
కొత్త సర్కారు టీచర్లకు 3 రోజుల శిక్షణ
అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభం
విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లవైపు మళ్లించాలి
టీచర్లు కూడా నిరంతర అధ్యయనం చేయాలి
కొత్త టీచర్లకు ప్రభుత్వం సూచనలు
సాక్షి, హైదరాబాద్: మారుతున్న విద్యా విధానంతో కొత్త తరం టీచర్లు పోటీ పడాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి సాంకేతిక కోణంలో బోధన ఉండాలని సూచిస్తోంది. డీఎస్సీ–2024లో ఎంపికైన 10 వేల మంది టీచర్లకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి మొదలైంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇది కొనసాగుతోంది. మార్చి 3వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు.. 4, 5, 6 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీని తర్వాత మార్చి 10, 11, 12 తేదీల్లో స్పెషల్ ఎడ్యుకేషన్, పీఈటీలకు శిక్షణ ఇస్తారు. సీనియర్ అధ్యాపకులను రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీళ్లంతా కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఎంపికైన టీచర్లను కూడా శిక్షణకు రప్పించారు. వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతర ఉపాధ్యాయులను నియమించారు. శిక్షణ విధానంపై రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లవైపు విద్యార్థులను మళ్లించేలా టీచర్లు తీసుకోవాల్సిన చొరవను సూచించింది.
ఇవీ కీలకాంశాలు..
⇒ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు నూతన బోధన విధానాలను ఆకళింపు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సర్కారు నిర్దేశించింది.
⇒ ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం కల్పించడం, స్కూళ్లల్లోని వసతులు, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ సౌకర్యాల వివరాలను టీచర్లు జనంలోకి తీసుకెళ్లాలి.
⇒ పాఠ్య ప్రణాళికలు నూతన పద్ధతుల్లో రూపొందించడం, మూల్యాంకన విధానంలో మార్పులు, డిజిటల్ విధానంలో బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల నిర్వహణ, యూడైస్‌లో డేటా ఎంట్రీ పద్ధతులను కొత్త టీచర్లకు వివరిస్తున్నారు.
⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ బోధనలో కీలక పాత్ర పోషించబోతోంది. కొత్త తరం టీచర్లు నిరంతర అధ్యయనం, టెక్నాలజీతో పోటీపడి నేర్చుకునే పద్ధతులు అనుసరించాల్సి ఉంది. ఈ కోణంలో శిక్షణ ఇస్తున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
⇒ ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఏఐ టెక్నాలజీ బోధనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని కన్నా ముందు ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా మరిన్ని మెళకువలు నేర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.
⇒ ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాత టీచర్లు ఏఐపై సమగ్ర అవగాహన సంపాదిస్తారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment