సన్నాలకు.. సాంకేతికత | Technology to identify Thin rice | Sakshi
Sakshi News home page

సన్నాలకు.. సాంకేతికత

Published Sun, Oct 27 2024 4:42 AM | Last Updated on Sun, Oct 27 2024 4:42 AM

Technology to identify Thin rice

క్వింటాకు రూ.500 బోనస్‌ 

గింజను ఒలవడానికి ప్యాడిహస్కర్‌ 

సన్నాలను గుర్తించేందుకు గ్రెయిన్‌ కాలిపర్‌ 

సంచులకు కోడ్‌.. ఎర్ర దారంతో కుట్లు.. సంచిపై ఎస్‌ అనే అక్షరం 

రాష్ట్రవ్యాప్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు 

సాక్షి, సిద్దిపేట: సన్న బియ్యాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. రాష్ట్రంలో సన్న రకాల ధాన్యం సాగు చేసిన రైతులకు మద్దతు ధరపై క్వింటాకు రూ.500 బోనస్‌ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

ధాన్యం నాణ్యత విషయంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు దొడ్డు, సన్న నిర్ధారణ ప్రమాణాలు పాటించకుండానే వడ్లను కొనుగోలు చేసింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 60.8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. అందులో 40 శాతం వరకు సన్నాలు సాగు చేశారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 

మొత్తంగా 91 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని, ఇందుకోసం 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే చాలా వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. గ్రేడ్‌–ఏ ధాన్యానికి క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లించనున్నారు. 

33 సన్న రకాలకు బోనస్‌ 
ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, డబ్లూయజీఎల్‌ –44, కేపీఎస్‌–2874, జేజీఎల్‌–27356, జేజీఎల్‌ 28545, డబ్ల్యూజీఎల్‌–14, డబ్ల్యూజీఎల్‌–32100, జేజీఎల్‌–11470, జేజేఎల్‌–384, ఆర్‌ఎన్‌ఆర్‌–2458, జేజీఎల్‌–384, జేజీఎల్‌–3828, తెలంగాణ సోనా, వరంగల్‌–1119, కేఎల్‌ఎం–1638, వరంగల్‌–962, రాజేంద్రనగర్, కేఎల్‌ఎం–733, జేజీఎల్‌–1798, జేజీఎల్‌3844, జేజీఎల్‌ 3855, జేజీఎల్‌–11118, ఎన్‌ఆర్‌ఎల్‌–34449, సుగంధ సాంబ, శోభిని, సోమనాథ్, ఆర్‌ఎన్‌ఆర్‌–31379, కేపీఎస్‌–6251, జేజీఎల్‌ 33124, హెచ్‌ఎంటీ సోనా, ఎంజీయూ–1224, ఎంటీయూ–1271 రకాలకు బోనస్‌ చెల్లించనున్నారు.

బియ్యం గింజగా మార్చేందుకు ప్యాడిహస్కర్‌ 
వడ్లకున్న పొట్టును ఒలిచేందుకు ప్యాడిహస్కర్‌ యంత్రాలను అందజేస్తున్నారు. 20 వడ్ల గింజలను తీసుకుని ఈ యంత్రంలో పోసి తిప్పితే.. పొట్టూడిపోయి బియ్యం గింజలు బయటికొస్తాయి. పాత కాలంలో వడ్లను చేతితో నలిపేవారు. అప్పుడు వడ్ల నుంచి బియ్యం వచ్చేవి. ఇప్పుడు ప్యాడిహస్కర్‌ను వినియోగిస్తున్నారు. ఈ బియ్యం గింజలను సుమారు 10 గింజలను తీసుకుని అన్నింటిని ఒక్కొక్కటిగా గ్రెయిన్‌ కాలిపర్‌ మెషీన్‌లో పెట్టి కొలవనున్నారు.

గ్రెయిన్‌ కాలిపర్‌ యంత్రాలు 
సన్నధాన్యం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాలకు గ్రెయిన్‌ కాలిపర్‌ (డయల్‌ మైక్రోమీటర్‌) యంత్రాన్ని అందజేస్తున్నారు. దీంతో సన్నబియ్యం గింజ పొడవు, వెడల్పు కొలవనున్నారు. 

పొడవు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలని నిర్ణయించారు. బియ్యం గింజ పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా నిర్దేశిత ప్రమాణాలుంటేనే కొనుగోలు చేయనున్నారు. ఇలా ఉన్న ధాన్యాన్నే సన్నాలుగా గుర్తించి వారికి క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్‌ అందజేయనుంది. ఇప్పటికే ఈ యంత్రంపై కొనుగోలు కేంద్రాల వారికి అవగాహన కల్పించారు. 

సంచులకు కోడ్‌ 
సన్నాల సంచులకు ఎరుపు రంగు దారంలో కుట్టి.. వాటిపై ఎస్‌ అనే అక్షరం రాయనున్నారు. దొడ్డు రకానికి పచ్చ రంగు దారంతో కుట్లు వేయనున్నారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఓపీఎంఎస్‌ కోడ్‌ను రాయనున్నారు. మిల్లుకు చేరిన తర్వాత సైతం ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించనున్నారు.  

ఒక్కో సెంటర్‌కు ఒక్కో మీటర్‌ 
సన్నాలు కొనుగోలు చేసే కేంద్రాలకు.. ఒక్కొక్క కేంద్రానికి ఒకటి గ్రెయిన్‌ కాలిపస్, ప్యాడిహస్కర్‌లను, ఓపీఎంఎస్‌ కోడ్‌లను అందించాం. ఇంకో 10 రోజులైతే సన్నాలు కొనుగోలు కేంద్రాలకు రానున్నాయి. సన్న వడ్ల సంచిలకు ఎస్‌ అనే అక్షరం సైతం రాయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం.  
– ప్రవీణ్, డీఎం,  సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్, సిద్దిపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement