ఈసారి 88 లక్షల టన్నుల సన్నాల దిగుబడి అంచనా
అధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు
మార్కెట్‌కు వచ్చే సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తాం
40 లక్షల ధాన్యం నిల్వ కోసం గోదాములు ఏర్పాటు చేసినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో.. ఖరీఫ్‌లో రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు ఎన్నడూ లేనివిధంగా 36.80 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను సాగు చేశారని.. సుమారు 88.09 లక్షల టన్నుల సన్న వడ్ల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు.
రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో 2024–25 ఖరీఫ్ పంట కొనుగోళ్లపై జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు.
సన్న, దొడ్డు వడ్లు కలిపి ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగయ్యాయని, మొత్తంగా 1.46 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వివరించారు. ఇందులో 91.28 లక్షల టన్నులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సన్నాలు, దొడ్డు వడ్లను వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదు
గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఇకపై ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ తొలివారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి చివరి వరకు కొనసాగుతాయన్నారు.
మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు వీలుగా గోదాములను సిద్ధం చేసిందని చెప్పారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో అందిస్తామని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment