సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు రూ.31 వేల కోట్ల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివరాలన్నీ క్లియర్‌గా ఉన్న 22,37,848 మంది రైతులకు సంబంధించిన రూ.2 లక్షల లోపు రుణాలు, వాటి వడ్డీలకు సంబంధించి మొత్తం రూ.17,933 కోట్లను ఆగస్టు 15లోగా ఏకకాలంలో మాఫీ చేశామని తెలిపారు.
అయితే ఆధార్ కార్డు నంబర్‌లో 12 అంకెలకు బదులుగా 11, 13 అంకెలుండడంతో 1.20 లక్షల మందికి, బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల్లోని పేర్లలో తేడాలుండడంతో 1.6 లక్షల మందికి, బ్యాంకులు ఇచ్చిన వివరాల్లో తప్పులుండడంతో 1.5 లక్షల మందికి, రేషన్‌కార్డు లేకపోవడంతో 4.83 లక్షల మందికి, రూ.2 లక్షలకు మించి రుణం పొందిన 8 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని మంత్రి వెల్లడించారు.
ఆయా కారణాలతో మొత్తం 17.13 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూటికి నూరు శాతం రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
అర్హతలుండీ రుణమాఫీ జరగని రైతుల నుంచి వివరాలను సేకరించి, తప్పులు సవరించి అప్‌లోడ్ చేయాల్సిందిగా మండల వ్యవసాయ అధికారులను ఆదేశించామని, ఆ వెంటనే వారికీ రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. సోమవారం జలసౌధలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రేషన్‌కార్డు లేని రైతుల ఇళ్లకు అధికారులు
బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద లబ్ధి పొందేందుకు రైతులకు అవకాశమిస్తామని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. రేషన్‌కార్డు లేని రైతుల ఇళ్లకు స్వయంగా మండల వ్యవసాయ అధికారి వెళ్లి కుటుంబసభ్యులను నిర్థారించుకున్న తర్వాత రుణమాఫీ చేస్తామన్నారు. రూ.2 లక్షలకు మించి రుణం తీసుకున్న వారు ఆపైన ఉన్న రుణ మొత్తాన్ని చెల్లిస్తే వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని తెలిపారు.
ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
రాజకీయ దురుద్దేశంతో రుణమాఫీపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే నినాదం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రుణమాఫీ ఊసెత్తలేదని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మొత్తం రూ.26 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందని తెలిపారు. 2014–18 మధ్యకాలంలో ఏటా సుమారు రూ.4 వేల కోట్లు చొప్పున విడుదల చేసినా మొత్తం రూ.1,743 కోట్లు వడ్డీల కింద సర్దుబాటు కావడంతో అసలు రుణాలు అలానే మిగిలిపోయాయని విమర్శించారు.
2018లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018–19, 2019–20, 2022–23లో ఎలాంటి నిధులు విడుదల చేయలేదన్నారు. 2020–21లో రూ.408.3 కోట్లతో 2.96 లక్షల మందికి, 2021–22లో రూ.1,339.5 కోట్లతో 3.88 లక్షల మందికి, 2023–24లో తొలి విడతగా రూ.6,763 కోట్లతో 10.68 లక్షల మందికి, రెండో విడతగా రూ.4,818.24 కోట్లతో 8.07 లక్షల మందికి రుణమాఫీ చేశారన్నారు.
20.84 లక్షల ఖాతాలకు సంబంధించిన రూ.8,579 కోట్ల రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేయలేదన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతోనే కొందరు రైతుల ఖాతాల్లో లోపాలు చోటుచేసుకున్నాయని, దీంతో వారికి రుణమాఫీ జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడాన్ని జీరి్ణంచుకోలేకే బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.
రూ.31 వేల కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం..
Published Tue, Aug 20 2024 6:16 AM | Last Updated on Tue, Aug 20 2024 6:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment