రోడ్డుపై పాలు పారబోసి నిరసన
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కామారెడ్డి– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గంటసేపు రైతులు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
రైతు ప్రతినిధులు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రైతుబంధు వేయలేదన్నారు. అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాడి రైతులకు విజయ డెయిరీ నుంచి నాలుగు నెలల బిల్లులు రావాలని, వెంటనే వాటిని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తాడ్వాయి, గాంధారి ఎస్సైలు తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రహిమొద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment