సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను పచ్చి దగా చేస్తోందని, రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. కేవలం పావు శాతం రుణమాఫీతో వంద శాతం రైతులను మోసం చేశారని.. ఈ అంశంపై సీఎం, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కోరుతున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఏమిటని నిలదీశారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, ఆయన పన్నిన వలలో తాము చిక్కుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘రైతు ధర్నా’ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుధవారం బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు..
‘‘సీఎం రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు రైతులకు ఎంత మేర రుణం మాఫీ అయిందో కూడా సీఎం, మంత్రులకు తెలియనట్టుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమయ్యాయని చెప్తున్నారు. నిజంగా వంద శాతం రుణమాఫీ అయి ఉంటే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో సీఎం చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూ, బ్యాంకులను ముట్టడిస్తున్నారని.. రైతు రుణమాఫీ కోరుతున్న రైతులపై ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, బజార్‌హత్నూర్‌లలో ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోని పక్షంలో రైతులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి జైల్‌భరోకు పిలుపునిస్తామని చెప్పారు. లక్షలాది మంది రైతులను మోసం చేసిన ప్రభుత్వంపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు.
బజారు భాషకు వ్యతిరేకంగా పాలాభిషేకాలు
‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నందుకు సీఎం రేవంత్ బజారు భాష మాట్లాడారు. ఆ బజారు భాషకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రైతు ధర్నాను ప్రారంభించాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి మండలంలో ఐదు బ్యాంకుల్లో కలిపి 20,239 రైతు ఖాతాలుంటే.. కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. రుణమాఫీకి ఎన్నో కుంటిసాకులు చెబుతూ ఆంక్షలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుబంధుకు ఇంకెన్ని ఆంక్షలు పెడుతుందోననే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండాం వెంటాడుతాం, వేటాడుతామని చెప్పారు.
రేవంత్ ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయాలి
హైడ్రా పేరిట హైడ్రామా ఆపండి..
‘‘జన్వాడలో నాకు ఎలాంటి ఫామ్‌హౌజ్ లేదు.. ఓ మిత్రుడి ఫామ్‌ను లీజుకు తీసుకున్నా. ఒకవేళ ఆ ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. ప్రభుత్వానికి దమ్ముంటే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, మహేందర్‌రెడ్డి, వివేక్ వంటి కాంగ్రెస్ నాయకుల రాజభవనాలు కూడా కూల్చేయాలి. ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా ఆపాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే అన్ని అక్రమ నిర్మాణాలను ఒకేరోజు కూల్చాలని.. రేవంత్‌రెడ్డి అ«దీనంలోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు.
పావుశాతం మాఫీతో వంద శాతం మోసం: కేటీఆర్
Published Thu, Aug 22 2024 1:19 AM | Last Updated on Thu, Aug 22 2024 1:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment