రుణమాఫీ కోరితే రైతులను అరెస్టు చేస్తారా: కేటీఆర్
ప్రజాభవన్‌కు రైతులు వస్తుంటే భయమెందుకు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోరుతూ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘రుణమాఫీ కోరుతూ చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన రైతులను బుధవారం రాత్రి నుంచే అక్రమంగా అరెస్టు చేసి దొంగలు, ఉగ్రవాదుల్లా పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణం.
పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులను పోలీసులు బేషరతుగా విడుదల చేయాలి. రుణమాఫీపై హామీ ఇచ్చి మోసం చేసినందునే రైతులు ఆందోళన చేస్తున్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా రైతులు సంఘటితమై చేస్తున్న ఉద్యమం ఆగదు. దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు’ అని కేటీఆర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శిశు మరణాలపై కమిటీ వేస్తాం
గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. సమస్యపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై బీఆర్‌ఎస్ తరపున నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తామన్నారు.
ఈ కమిటీ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి, ప్రజలకు నివేదిస్తుందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం స్వీకరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమీక్ష చేసి వైద్యంలో నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. గాంధీ ఆసుపత్రిలో అనుభవం కలిగిన వైద్యులను బదిలీ చేయడం వల్లే చికిత్సకు ఆటంకం ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment