
కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేది.. గుజరాత్‌కు సీఎం అయ్యాక కులాన్ని బీసీల్లో కలిపారు
ఇత్తేసి పొత్తు కుదిరారు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ
జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదు
కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి, వర్గీకరణపై మంత్రి దామోదర పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రదానమంత్రి మోదీ(PM Narendra Modi)ని ఉద్దేశించి రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేదని, గుజరాత్‌కు సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపి ఇత్తేసి పొత్తు కుదిరాడని అన్నారు. మోదీ సర్టిఫికెట్ మాత్రమే బీసీదని, మనస్తత్వం ఇందుకు వ్యతిరేకమని విమర్శించారు. తాను బీసీ ప్రధానిని కనుక ఇక ఎవరూ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా సీఎం విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదని అన్నారు. మరోమారు నిర్వహిస్తున్న కులగణనలో అయినా వివరాలు ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు సామాజిక బహిష్కరణే శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నామని, అందరూ ఆమోదించాలని కోరారు.
శుక్రవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో కులగణన చేసిన తీరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీలను వర్గీకరించిన తీరును మంత్రి దామోదర రాజనర్సింహ.. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
పారదర్శకంగా కులగణన: ‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశలో మేం ప్రయత్నిస్తుంటే ప్రత్యర్థి రాజకీయ పక్షాలు, ఆ పారీ్టల నేతలు ఆరోపణలతో, లేనిపోని అపోహలు సృష్టిస్తూ కుల గణన తప్పుల తడక అనే అభిప్రాయం కలిగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కులగణన జరిగి బలహీన వర్గాల లెక్క తేల్చి వారి కోటా, వాటా వారికివ్వాలనేది రాహుల్‌గాంధీ ఆలోచన. ఆ దిశలోనే ముందుకెళ్లి తెలంగాణ ప్రజలకు రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు పారదర్శకంగా కులగణన చేశాం.
గ్యాంబ్లర్స్‌కు కులగణన ఇష్టం లేదు..
కేసీఆర్ గతంలో కాకి లెక్కలతో సర్వే చేశాడు. చెట్ల మీద విస్తరాకులు కుట్టి ఇదే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నాడు. ఆయన చేసిన లెక్క సక్కదనమైనది అయితే, ఎస్సీల్లో 59 ఉప కులాలుంటే ఆయన సర్వేలో 82 కులాలు ఎలా వచ్చాయి? రాష్ట్రంలో అందరినీ లెక్కపెడుతున్నప్పుడు కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు వివరాలు ఎందుకు ఇవ్వలేదు? అలా వివరాలు ఇవ్వని కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు, మాట్లాడే హక్కు లేదు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పోచంపల్లి వాళ్ల లెక్కలు చెప్పలేదు. కుల గణన చేయడం ఆ గ్యాంబ్లర్స్‌కు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ల లెక్క తెలిస్తే గత ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు ఎలా తీసుకున్నారని బీసీలు అడుగుతారని, కడుగుతారని, వంగబెట్టి దంచుతారని తెలుసు. వీరి జనాభాకు వార్డు మెంబర్ కంటే ఎక్కువ పదవులేవీ రావు. అందుకే ఈ లెక్క రాకూడదని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. మనకు తెలియకుండానే ఆ కుట్రలో మనం భాగస్వాములవుతున్నాం. నేను సవాల్ చేస్తున్నా.. మేం చేసిన కులగణనలో ఒక్క తప్పులేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు.
ఐదు గ్రూపుల్లో ముస్లింలు కూడా ఉన్నారు
‘కొందరు కాంగ్రెస్‌కు నేనే ఆఖరు సీఎం అని అంటున్నారు. అయినా ఫర్వాలేదు. మా నాయకుడి మాట నిలబెట్టేందుకే ఈ కులగణన చేశాం. నాయకుడిచ్చిన మాటను నిలబెట్టడం మా «ధర్మమని, ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ముందుకెళ్లాం. అయినా దొంగ లెక్కలు ఇలా రాస్తారా? దొంగ లెక్కలు రాయాలనుకుంటే మా జనాభా 5 శాతం ఎందుకు చూపిస్తాం. 15–20 శాతం చూపిస్తాం కదా? కొందరు మైనారీ్టల లెక్కలెలా తీస్తారని అంటున్నారు. గతంలో బీసీల్లో ఐదు గ్రూపులున్నాయి. అందులో ముస్లింలు కూడా ఉన్నారు. అందుకే వారి లెక్క తీశాం..’అని రేవంత్ వివరణ ఇచ్చారు.
కోల్డ్ స్టోరేజీలో పెట్టేలా బీజేపీ కుట్ర
‘బీసీల లెక్కలు రాకూడదన్నదే మోదీ, కేడీల ప్రయత్నం. తెలంగాణలో మా ప్రభుత్వం అన్ని కులాల లెక్కలు తీసిందని, అదే పని దేశవ్యాప్తంగా ఎందుకు చేయరని పార్లమెంటులో మోదీని రాహుల్‌గాంధీ నిలదీశారు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీన్ని తప్పుల తడక అనే ముద్ర వేసి కోల్డ్ స్టోరేజీలో పెట్టాలనుకుంటున్నారు. నిజంగా మోదీకి బీసీలపై ప్రేమ ఉంటే 2021 లోనే జనాభా లెక్కలు తీసి అందులో కులగణన చేసేవారు. రేపు చేయబోయే జనగణనలో అయినా బీసీ కులాల లెక్క తేల్చాలి. నిజంగా మేం చేసిన లెక్కలు తప్పయితే మోదీ దేశ వ్యాప్తంగా కులగణన చేయడం ద్వారా రాష్ట్రంలోని బీసీల లెక్కలు తేల్చాలి. ఇవిగో మోదీ లెక్కలు, ఇవిగో రాహుల్ లెక్కలు అని ప్రజల ముందు పెట్టాలి..’అని సీఎం అన్నారు.
వారి ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి
‘ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు పంపిణీ చేశాం. దీన్ని కూడా తప్పు పట్టాలని కొందరు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని చాలెంజ్ చేయండి. ఏ లెక్క, ఏ వార్డు, ఏ కుటుంబంలో తప్పు ఉందో చెప్పమని అడగండి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి. అప్పుడు కూడా వివరాలు ఇవ్వకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష విధించండి..’అని సీఎం వ్యాఖ్యానించారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment