
అధినేత అధ్యక్షతన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం
పార్టీ రజతోత్సవాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్న నేతలు
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KCR) సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రానున్నారు. పార్టీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్‌కు 25 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు పార్టీ తరఫున ఆహ్వానం పంపించారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
బహిరంగ సభ వేదిక ఖరారు చేసే అవకాశం
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన కార్యాచ రణపైనా ఈ భేటీలో సమగ్రంగా చర్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల హక్కులను కాపాడే దిశగా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ఈ నెలాఖరులో బీఆర్‌ఎస్ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా వేదికను కూడా 19న జరిగే భేటీలో ఖరారు చేసే అవకాశముంది. ఆహ్వానితులు కచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఆరు నెలల తర్వాత..
సుమారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఏడాది జూలై 23న తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్ నేతలతో భేటీలో ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను తయారు చేసుకోవడం బీఆర్‌ఎస్‌కు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment