
పార్టీ పనైపోయిందని ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నేతలపై కేసీఆర్ ఫైర్
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాల ప్రకటన
ఘనంగా బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ
పార్టీ కమిటీలకు గులాబీ బాస్ ఆదేశం
కమిటీల ఇంఛార్జిగా హరీష్‌రావు నియామకం
ఏప్రిల్ 10 నుంచి బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఏప్రిల్ 27వ బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
డీలిమిటేషన్ తర్వాత మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం: కేసీఆర్
తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.
‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు.
27న భారీ బహిరంగ సభ
ఇక.. ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన.
ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.
భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే
త్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం.
పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి.
బీఆర్‌ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్‌ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్‌ఎస్ లక్ష్యం.
ఉప ఎన్నికలు గ్యారెంటీ
తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన.
ఒర్రకండిరా బాబూ..
సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యువల్
అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment