సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, వారంతా పార్టీ మారుతున్నారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు.. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు రెడీ అయ్యారు.
కాగా, తెలంగాణ భవన్‌లో నేడు హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌ను బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు.
అయితే, రేపటి సమావేశంలో కౌన్సిల్ హాల్‌లోనే బైఠాయించాలని వారు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. సంఖ్యా బలం చూసుకుంటే తమకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు. దీంతో, రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగిన సమావేశానికి హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో, వీరు పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment