కేసీఆర్ ఫొటో ఉందని పుస్తకాలు వెనక్కి పంపిస్తారా?
ఇదేం పాలన: బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బీఆర్‌ఎస్ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. స్వయంగా సీఎం నిర్వహిస్తున్న విద్యా శాఖలోనే గందరగోళ పరిస్థితి ఉంటే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ ఫొటోలు, పేర్లు ఉన్నాయని స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తెప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ కుమార్‌తో కలిసి బాల్క సుమన్ శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు.. హోం శాఖ స్వయంగా సీఎం అధీనంలో ఉన్నా ఆయన సొంత జిల్లాలో పట్ట పగలు వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ రవాణాలో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారని బాల్క సుమన్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment