సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment