శాసనసభలో చర్చకు బీఆర్‌ఎస్ పట్టు..
టూరిజం పాలసీపై లఘు చర్చను అడ్డుకున్న ప్రధాన ప్రతిపక్షం
సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’ఘటనపై సోమవారం శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్‌ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు.
వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. అధికార పక్షం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు లేచి బీఆర్‌ఎస్ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అయినా బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ గందరగోళంలో సభను కొనసాగించలేక మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో..
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా విలేజీ భూసేకరణను ప్రతిఘటించిన రైతులను నిర్బంధించిన ఘటనపై చర్చించాలంటూ టి.హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. దీనితో పార్టీ సభ్యులంతా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం..దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. నహీ చలేగా.. తానా షాహీ నహీ చలేగా..’అని నినాదాలు చేశారు. దీనితో సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
వెనక్కి తగ్గని బీఆర్‌ఎస్ సభ్యులు
సభ తిరిగి ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే పర్యాటక విధానంపై లఘు చర్చను ప్రారంభించాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్పీకర్ సూచించారు. కానీ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ కల్పించుకుని... బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులను అప్పగించి ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటే హరీశ్‌రావుకు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ముందు మాట్లాడేందుకు అవకాశమిస్తే ప్లకార్డులను అప్పగిస్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో నిరసనను కొనసాగించారు.
శ్రీధర్‌బాబు, భట్టి కల్పించుకున్నా..
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళనను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తోపాటు శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. అందరం కలసి రూల్స్ బుక్ తయారు చేసుకున్నామని, సభలో ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం దానికి విరుద్ధమని స్పీకర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశాంతంగా కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక సభలో ప్లకార్డులు, కరపత్రాలు ప్రదర్శించరాదని నిబంధనలు ఉన్నాయని, శాసనసభా వ్యవహారాల మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన హరీశ్‌రావుకు అది బాగా తెలుసని మంత్రి డి.శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ కార్యకలాపాలపై ప్రతిరోజూ బులెటిన్ ఇస్తారని, వాటి ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశంపై ప్రభుత్వం సమాధానమిస్తుందని హామీ ఇచ్చారు. ఇక సభ గౌరవాన్ని పరిరక్షించాలని... పర్యాటక విధానంపై మంత్రి మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్ సభ్యులు బాధ్యతారాహితంగా వ్యవహరించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ‘రైతులకు కరెంట్ షాకులా?.. రైతులకు బేడీలా..? సిగ్గు సిగ్గు’అంటూ నినాదాలు చేశారు.
నిరసనల మధ్య జూపల్లి ప్రసంగం
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే మంత్రి జూపల్లి కృష్ణారావు కాసేపు ప్రసంగించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయిందని, తాము పర్యాటక అభివృద్ధి ద్వారా ఆ పనిచేస్తున్నామని చెప్పారు. బంగారు పళ్లెంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని హరీశ్‌రావు అంటుంటారని, తెరిచి చూస్తే అప్పులకుప్పగా ఉందని విమర్శించారు.
15 నిమిషాలే కొనసాగిన సభ
బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూనే ఉండటంతో గందరగోళం నెలకొంది. దీనితో బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు తీసుకోవాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ వచ్చేలోపే హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ ముందు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్లకుండా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు.
ఈ గందరగోళం నడుమ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకురాగా.. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సభ్యుల కుర్చీల వద్దే నిలబడి నిరసన తెలిపారు. మధాŠయ్‌హ్నం 2.25 గంటలకు లఘు చర్చ ప్రారంభంకాగా 2.40 గంటలకు వాయిదా పడింది. అంటే 15 నిమిషాలు మాత్రమే సభ నడిచింది.
మండలిలోనూ ‘లగచర్ల’నిరసన
‘లగచర్ల’గిరిజన రైతుల అరెస్టులు, బేడీలు వేయడంపై సోమవారం శాసన మండలిలోనూ బీఆర్‌ఎస్ తీవ్రంగా నిరసన తెలిపింది. వాయిదా తీర్మానం ఇచ్చింది. దానికి మండలి చైర్మన్ అనుమతించకపోవడంతో శాసన మండలి ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, శంభీపూర్ రాజు, వాణిదేవి, రవీందర్‌రావు తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ‘ఇదేమి రాజ్యం... దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు’అంటూ నినాదాలు చేశారు.
నేడు అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్‌ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment