
ఆర్ అండ్ బీ ఆస్తుల సంరక్షణకు చర్యలు చేపట్టండి
ఉద్యోగ కల్పన కేంద్రాలుగా బీసీ స్టడీ సెంటర్లు
ప్రీ బడ్జెట్ సమావేశంలో మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను వచ్చేనెల ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను చేపట్టారు. గురువారం సచివాలయంలో ఆయా శాఖలకు కేటాయింపులకు సంబంధించి రహదారు లు – భవనాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారు లతో సమావేశమయ్యారు, ఆర్‌అండ్‌బీకి సంబంధించి ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భట్టి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 3డి డిజైన్లు వంటి పనులను సత్వరం పూర్తిచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశా రు.
ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని భట్టి అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు.
కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, డిప్యూటీ సీ ఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.
హాస్టళ్ల, గురుకులాల బకాయిలు చెల్లిస్తాం..
అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాల అద్దె బకాయిలు వెంటనే చెల్లిస్తామని అందుకు, ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు.
డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై మంత్రులు అధికారులను అడిగారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment