Pre-Budget meeting
-
దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని కేంద్రాన్ని ఆర్థిక రంగం విజ్ఞప్తి చేసింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఏడో ప్రీ–బడ్జెట్ సమావేశంలో ఆర్థిక రంగం ప్రతినిధులు ఈ మేరకు వినతులు ఇచ్చారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలను కూడా తెలియజేసినట్లు ఎడెల్విస్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలకు సంబంధించి రీఫైనాన్స్ విండోను ఏర్పాటు చేయాలని నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కోరినట్లు ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఐడీసీ) డైరెక్టర్ రమణ్ అగర్వాల్ వివరించారు. గృహ రుణాల కంపెనీల తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి రీఫైనాన్సింగ్ చేసేందుకు సిడ్బి, నాబార్డ్‌ల కోసం నిర్దిష్ట ఫండ్‌ను ఏర్పాటు చేయొచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన ఆర్థిక సలహాదారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. -
విభిన్నంగా ఆలోచించండి..
బ్యాంకర్లకు జైట్లీ సూచన • ఆర్థిక మంత్రి ప్రీ–బడ్జెట్ సమావేశం • భారీ మూలధనం కోరిన బ్యాంకులు • సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై ప్రోత్సాహకాలకూ విజ్ఞప్తి న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ, సవాళ్లను ఎదుర్కొనడం వంటి అంశాల్లో విభిన్నంగా ఆలోచించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ ఎత్తున తాజా మూలధన మద్దతు కల్పించాలని, అలాగే స్థిర డిపాజిట్ల విషయంలో సీనియర్ సిటిజన్ల నుంచి తగిన స్పందన రావడానికి పన్ను పరమైన ప్రోత్సాహకాలు అవసరమని కేంద్రానికి బ్యాంకర్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇక్కడ బ్యాంకర్లతో సాంప్రదాయక ప్రీ–బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. లాభదాయకత దృష్ట్యా ఎన్పీఏ ప్రొవిజనింగ్‌కు పూర్తి పన్ను మినహాయింపును బ్యాంకర్లు ఈ సందర్భంగా కోరారు. జైట్లీ ఏమన్నారంటే...: ఈ ఆర్థిక సంవత్సరాన్ని సాదాసీదాగా భావించడానికి వీలులేదు. ఎన్నో సంస్కరణాత్మక నిర్ణయాలను తీసుకున్నాం. ప్రభుత్వం అలాగే బ్యాంకులు చేయగలిగిందంతా చేయడానికి ఎంతో విభిన్నంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ వెన్నుదన్నన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంకుల అభిప్రాయం...: ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధన కల్పన అవసరం. పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌లో ద్రవ్య లభ్యత పెరిగింది. ఇది డిపాజిట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది సీనియ ర్ సిటిజన్ల ఆదాయాలపై ప్రతికూలత చూపుతుంది. వారి డిపాజిట్లకు సంబంధించి పన్ను పరమైన ప్రోత్సాహకాలు అవసరం. డిజిటల్ లావాదేవీలు పెరగడానికి వీలుగా సేవల పన్ను నుంచి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల లావాదేవీలను మినహాయించాలి. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా నగదు ఆధారిత వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి అవసరం. నాబార్డ్కూ రూ.2,500 కోట్ల మూలధనం అవసరం. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న డెయిరీ రంగం మౌలిక అభివృద్ధి నిధి ఏర్పాటు జరగాలి. ఇక పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వినియోగం పెంపునకు బడ్జెట్లో ప్రత్యేక చర్యలు ఉండాలి. ఇది డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. డిజిటల్ పేమెంట్లకు తగిన ప్రోత్సాహకాలు అవసరం. సమావేశంలో యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ కొందరు తమ బ్యాంక్ అధికారులు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థికవేత్తలతో కూడా... ఆర్థికమంత్రి మంగళవారం ఆర్థికవేత్తలతో కూడా బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఆర్థికవ్యవస్థ, ద్రవ్యోల్బణం, వివిధ రంగాల్లో ప్రభుత్వ వ్యయాల పెరుగుదలపై డీమోనిటైజేషన్ ప్రభావం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చిన్న వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు.. డిజిటలైజేషన్ వైపు వెళ్లే చిన్న వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు లభించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. 30% వరకూ పన్ను భారాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రూ.2 కోట్ల వరకూ టర్నోవర్ ఉండే వ్యాపారుల ఆర్జించే లాభం టర్నోవర్‌లో 8% వరకూ వుండవచ్చని 2016–17 బడ్జెట్లో పేర్కొన్నాం. దాని ప్రకారం పన్ను విధించాల్సివుంది. అయితే ప్రస్తుతం చెల్లింపులకు సంబంధించి డిజిటల్ విధానాన్ని ఎంచుకుంటే, వారి టర్నోవర్‌లో లాభం 6%గానే భావించడం జరుగుతుందన్నారు. -
అందరం కష్టపడదాం
నవ్యాంధ్రను 2019 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ర్టంగా నిలుపుదాం ప్రీ బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు ఉదయం 11 నుంచి రాత్రి 10.15 వరకు సమీక్ష డాక్టర్ శుభాకరరావు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం దంపతులు పుస్తక ప్రదర్శనను తిలకించిన చంద్రబాబు విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌ను 2019 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు అందరం కష్టపడి పనిచేయాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం బుధవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 10 గంటలకు నగరానికి వచ్చిన ఆయన రాత్రి 10.45 గంటలకు వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఉదయం 9.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎంకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పది గంటల సమయంలో నగరానికి చేరుకున్న చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా సూర్యారావుపేటలో ఇటీవల మర ణించిన డాక్టర్ శుభాకరరావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి సీఎం ఉదయం 10.40 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్లి చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం నగరాల్లో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో స్టేడియాలు నిర్మిస్తామని ప్రకటిం చారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. హోటల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడ అనంతపురం జిల్లాలో పల్లెవెలుగు బస్సు ప్రమాద ఘటనపై ఆ జిల్లా మంత్రి పరిటాల సునీత, ఇతర మంత్రులతో సీఎం మాట్లాడారు. ఉదయం ఐఏఎస్‌లతో.. మధ్యాహ్నం ఐపీఎస్‌లతో... అనంతరం గేట్‌వే హోటల్లో జరిగిన రాష్ట్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 11.30కి ప్రారంభమైన సమావేశం రాత్రి 10.20 గంటల వరకు కొనసాగింది. ఉదయం ఐఏఎస్ అధికారులతో, మధ్యాహ్నం ఐపీఎస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 50 నిమిషాలపాటు ప్రారంభోపన్యాసం చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు వివరించి పూర్తిస్థాయిలో కష్టపడి పని చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను 2019 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు అందరం కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు. సమావేశం అనంతరం సీఎం రాత్రి 10.35 గంటలకు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పుస్తకమహోత్సవం వద్దకు చేరుకున్నారు. పుస్తకమహోత్సవ ప్రాంగణంలోని 58 నుంచి 73వ స్టాల్ వరకు సందర్శించిన సీఎం పలు పుస్తకాలను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గాన గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సీఎం రాత్రి 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, శ్రీరాం తాతయ్య, గద్దె రామ్మోహన్, బొండా ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, నగర మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణరావు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జె.మురళి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. - -
నగరానికి నేడు సీఎం రాక
ఉదయం 10 గంటలకు బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం 11 నుంచి రాత్రి 7.30 వరకు ప్రీ బడ్జెట్ సమావేశం విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం నగరానికి రానున్నారు. ఆయన ఉదయం 8.15 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి 9.30 గంటలకు సూర్యారావుపేట నర్సింహనాయుడి వీధిలోని చిల్డ్రన్స్ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ చింతపల్లి శుభాకరరావు గృహానికి వెళ్తారు. అనంతరం 10 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుని జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. స్టేడియం నుంచి 10.45 గంటలకు బయలుదేరి 11 చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగే ప్రీ బడ్జెట్ వర్క్‌షాపులో పాల్గొంటారు. అనంతరం హోటల్ నుంచి బయలుదేరి గన్నవరం విమాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 8 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళ్తారు. ఏర్పాట్లు పూర్తి : ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు మంగళవారమే నగరానికి వచ్చారు. ఇన్చార్జి కలెక్టర్ జె.మురళి, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రొటోకాల్ విధుల్లో భాగంగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం, గేట్ వే హోటల్ వరకు కాన్వాయ్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. విమానాశ్రయం నుంచి నగరం వరకు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి 18 మంది రాష్ట్ర మంత్రులు, 200 మందికి పైగా ప్రతినిధులు వస్తారని సమాచారం. మంగళవారం రాత్రికే మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్నెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి వచ్చారు. హోటళ్ల ప్రతినిధులతో సమావేశం ఇన్చార్జి కలెక్టర్ జె.మురళి నగరంలోని స్టార్ హోటళ్ల ప్రతినిధులతో సమావేశవయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ముందస్తు బడ్జెట్ సమాలోచన కార్యక్రమానికి దాదాపు 200 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని ఆయన చెప్పారు. వారికి కేటాయించిన గదుల విషయలో యాజమాన్యాలు పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. నగరంలో స్టేట్ గెస్ట్‌హౌస్, హోటల్ డీవీ మనార్, ఐలాపురం, గేట్ వే, మురళీ ఫార్చ్యూన్ తదితర హోటళ్లలో ప్రొటోకాల్‌కు ప్రత్యేక అధికారిగా సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, పర్యవేక్షకాధికారులుగా ట్రైనీ కలెక్టర్ జి.సృజన, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, డెప్యూటీ తహశీల్దార్ వైకుంఠరావు తదితరులు వ్యవహరిస్తారు.