నగరానికి నేడు సీఎం రాక
ఉదయం 10 గంటలకు బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం
11 నుంచి రాత్రి 7.30 వరకు ప్రీ బడ్జెట్ సమావేశం
విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం నగరానికి రానున్నారు. ఆయన ఉదయం 8.15 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి 9.30 గంటలకు సూర్యారావుపేట నర్సింహనాయుడి వీధిలోని చిల్డ్రన్స్ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ చింతపల్లి శుభాకరరావు గృహానికి వెళ్తారు. అనంతరం 10 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుని జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. స్టేడియం నుంచి 10.45 గంటలకు బయలుదేరి 11 చేరుకుంటారు. అక్కడ ఉదయం 11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగే ప్రీ బడ్జెట్ వర్క్‌షాపులో పాల్గొంటారు. అనంతరం హోటల్ నుంచి బయలుదేరి గన్నవరం విమాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 8 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళ్తారు.
ఏర్పాట్లు పూర్తి : ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు మంగళవారమే నగరానికి వచ్చారు. ఇన్‌చార్జి కలెక్టర్ జె.మురళి, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రొటోకాల్ విధుల్లో భాగంగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం, గేట్ వే హోటల్ వరకు కాన్వాయ్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. విమానాశ్రయం నుంచి నగరం వరకు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి 18 మంది రాష్ట్ర మంత్రులు, 200 మందికి పైగా ప్రతినిధులు వస్తారని సమాచారం. మంగళవారం రాత్రికే మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్నెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి వచ్చారు.
హోటళ్ల ప్రతినిధులతో సమావేశం
ఇన్‌చార్జి కలెక్టర్ జె.మురళి నగరంలోని స్టార్ హోటళ్ల ప్రతినిధులతో సమావేశవయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ముందస్తు బడ్జెట్ సమాలోచన కార్యక్రమానికి దాదాపు 200 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని ఆయన చెప్పారు. వారికి కేటాయించిన గదుల విషయలో యాజమాన్యాలు పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. నగరంలో స్టేట్ గెస్ట్‌హౌస్, హోటల్ డీవీ మనార్, ఐలాపురం, గేట్ వే, మురళీ ఫార్చ్యూన్ తదితర హోటళ్లలో ప్రొటోకాల్‌కు ప్రత్యేక అధికారిగా సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, పర్యవేక్షకాధికారులుగా ట్రైనీ కలెక్టర్ జి.సృజన, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, డెప్యూటీ తహశీల్దార్ వైకుంఠరావు తదితరులు వ్యవహరిస్తారు.