అందరం కష్టపడదాం
నవ్యాంధ్రను 2019 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ర్టంగా నిలుపుదాం
ప్రీ బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు
ఉదయం 11 నుంచి రాత్రి 10.15 వరకు సమీక్ష
డాక్టర్ శుభాకరరావు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం దంపతులు
పుస్తక ప్రదర్శనను తిలకించిన చంద్రబాబు
విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌ను 2019 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు అందరం కష్టపడి పనిచేయాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం బుధవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 10 గంటలకు నగరానికి వచ్చిన ఆయన రాత్రి 10.45 గంటలకు వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఉదయం 9.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎంకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పది గంటల సమయంలో నగరానికి చేరుకున్న చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా సూర్యారావుపేటలో ఇటీవల మర ణించిన డాక్టర్ శుభాకరరావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి సీఎం ఉదయం 10.40 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్లి చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం నగరాల్లో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో స్టేడియాలు నిర్మిస్తామని ప్రకటిం చారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. హోటల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడ అనంతపురం జిల్లాలో పల్లెవెలుగు బస్సు ప్రమాద ఘటనపై ఆ జిల్లా మంత్రి పరిటాల సునీత, ఇతర మంత్రులతో సీఎం మాట్లాడారు.
ఉదయం ఐఏఎస్‌లతో.. మధ్యాహ్నం ఐపీఎస్‌లతో...
అనంతరం గేట్‌వే హోటల్‌లో జరిగిన రాష్ట్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 11.30కి ప్రారంభమైన సమావేశం రాత్రి 10.20 గంటల వరకు కొనసాగింది. ఉదయం ఐఏఎస్ అధికారులతో, మధ్యాహ్నం ఐపీఎస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 50 నిమిషాలపాటు ప్రారంభోపన్యాసం చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు వివరించి పూర్తిస్థాయిలో కష్టపడి పని చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను 2019 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు అందరం కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు. సమావేశం అనంతరం సీఎం రాత్రి 10.35 గంటలకు పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న పుస్తకమహోత్సవం వద్దకు చేరుకున్నారు. పుస్తకమహోత్సవ ప్రాంగణంలోని 58 నుంచి 73వ స్టాల్ వరకు సందర్శించిన సీఎం పలు పుస్తకాలను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గాన గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సీఎం రాత్రి 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, శ్రీరాం తాతయ్య, గద్దె రామ్మోహన్, బొండా ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, నగర మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణరావు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జె.మురళి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
-