ముఖ్యమైన పోస్టులన్నింట్లో మనోళ్లే ఉండాలి
గత సీఎంతో అంటకాగినోళ్లని పంపించేద్దాం.. ఎవరెవరు ఏం చేశారో వివరాలన్నీ సేకరించండి
మన కోసం పని చేసిన వారిని గుర్తించండి.. మన వాళ్లు రిటైర్ అయినా సరే ఇంకో రకంగా తెచ్చుకుందాం
అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లు చేయగలం
సీఎస్, డీజీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై విస్తృత చర్చ
అనుకూలంగా ఉండే వారి జాబితా తయారు చేయాలని ఆదేశం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కీలక స్థానాల్లో తమకు అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐజీలు, డీఐజీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇలా అందరినీ త్వరిత గతిన బదిలీలు చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రతో సమావేశమయ్యారు.
గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు సన్నితంగా వ్యవహరించిన అధికారులందరినీ గుర్తించాలని, అలాంటి అధికారులు తమకు అవసరం లేదని.. ఎవరెవరు ఏం చేశారో వివరాలు సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో మన కోసం (టీడీపీ) పని చేసిన వారిని గుర్తించాలని, అలాంటి వారు రిటైర్ అయినప్పటికీ మరో రకంగా తెచ్చుకుందామని అన్నట్లు సమాచారం. రాజధాని అమరావతిని త్వరతగతిన అభివృద్ధి చేయడం తమ ప్రథమ లక్ష్యం అని, ఇందుకోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.
ఇందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తిరిగి అమలు చేసే విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేసిన ముఖ్య అధికారులను పిలిపిస్తే, తానే స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే గతంలో తాను సీఎంగా ఉండగా తన కార్యాలయంలో పనిచేసిన ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజమౌళిని మళ్లీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఇలాంటి మరికొందరు అధికారులతోపాటు రాష్ట్రంలోనే వివిధ శాఖల్లో ఉన్న తమకు అనుకూలమైన వారిని పిలిపించుకుని మాట్లాడి.. వారికి ఏ పోస్టింగులు ఇవ్వాలనే దానిపై సూచనలు ఇచ్చినట్లు తెలిసింది.
వాళ్లను పంపించేద్దాం
టీడీపీకి సహకరించని అధికారులను గుర్తించి, వారిని బదిలీ చేయించే విషయంపై కూడా చంద్రబాబు సీఎస్, డీజీపీతో చర్చించినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పని చేశారని ఇప్పటికే కొంత మందిని గుర్తించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ముఖ్య అధికారులందరినీ త్వరగా గుర్తిస్తే.. వారిని బదిలీ చేయడం లేక సెంట్రల్ సర్విసులకు వెళ్లి పోండని చెప్పడం.. లేక ఇక్కడే ఉంటే అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేద్దామని వివరించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరెవరు ఎలా పని చేశారో తనకు తెలుసని, అయినప్పటికీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్‌ల తర్వాతే అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఉపక్రమిద్దామని సీఎం అన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment