ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ విభజనపై కేంద్రం కీలక ఆదేశాలు
ఏపీ నుంచి తెలంగాణకు ముగ్గురు ఐఏఎస్‌లు వెళ్లాలని ఆదేశం
అలాగే తెలంగాణ నుంచి ఏపీకి నలుగురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లు
వారిని రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు
16లోగా ఆయా రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్‌ల కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించినవారు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణకు కేటాయించినా ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సృజన(ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), శివశంకర్ లోతేటి (వైఎస్సార్ జిల్లా కలెక్టర్), సీహెచ్ హరికిరణ్(వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్)లను వెంటనే తెలంగాణకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ అధికారులను ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ చేస్తూ వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెలియజేసింది.
రాష్ట్ర విభజన సమయంలోనే...
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అలాగే తెలంగాణకు కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు.. తమను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరినా అంగీకరించలేదు. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది.
గత మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి వారి అభ్యర్థనలు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారుల అభ్యంతరాల పరిశీలనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీపక్‌ను కేంద్రం నియమించింది. దీపక్ ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను తిరస్కరించింది. కచ్చితంగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment