సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ప్రక్రియ తుది అంకానికి చేరుకోవడంతో జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో టెన్షన్ కనిపిస్తోంది. తాము ఏ కేడర్ కిందకు వెళతామో, తెలంగాణలోనే ఉంటామా, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి వస్తుందా అనే ఉత్కంఠ వారిలో నెలకొంది. జిల్లాలో నలుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్, ఇద్దరు ఐఎఫ్‌ఎస్ అధికారులు పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పుడు ఎవరు ఏ కేడర్ కిందకు వెళతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
శనివారం జరిగిన ప్రత్యుష్‌సిన్హా కమిటీ సమావేశంలో అఖిల భారత సర్వీసుల అధికారుల కేడర్‌ను ఏ రాష్ట్రం నుంచి కేటాయించాలన్న దానిపై తీసిన లాటరీలో ఆ అవకాశం తెలంగాణకే రావడం... మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడుతాయని, 15 రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని... ఇప్పుడున్న వారిలో అందరిలో మార్పులు వచ్చే అవకాశం ఉందని ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రేమండ్‌పీటర్ ఢిల్లీలో వెల్లడించడంతో ఎవరికి ఏ కేడర్ వస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. లాటరీ ప్రక్రియ ముగియడంతో అఖిల భారత సర్వీసు అధికారులంతా శనివారం ఈ అంశంపైనే చర్చోపచర్చలు జరిపినట్టు సమాచారం. తమ బ్యాచ్‌కు చెందిన అధికారులు, సన్నిహితులైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతూ, తాము ఏ కేడర్‌కు వెళతామనే దానిపై చర్చించారు.
ఇద్దరూ బయటి అధికారులే..
జిల్లాలోని ఐఏఎస్ అధికారుల విషయానికి వస్తే కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి, ఐటీడీఏ పీవో దివ్య తమిళనాడుకు చెందిన వారు. మిగిలిన ఇద్దరు ఐఏఎస్‌లయిన జేసీ సురేంద్రమోహన్, సింగరేణి డెరైక్టర్ (పా) విజయ్‌కుమార్ తెలంగాణ ప్రాంతానికే చెందిన వారు. వీరిలో జేసీ, సింగరేణి డెరైక్టర్ ఇద్దరూ తెలంగాణ కేడర్ కిందకే వస్తారని హైదరాబాద్ వర్గాలంటున్నాయి. ఇక, బయటి రాష్ట్రం నుంచి వచ్చిన ఇలంబరితి, దివ్యలకు రోస్టర్ ఆధారంగా కేడర్ కేటాయించనుండంతో వారికి తెలంగాణ కేడర్ వస్తుందా రాదా అన్నది చర్చనీయాంశమయింది.
ఉన్న అధికారులలో 10:13 నిష్పత్తిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు పంపిణీ జరుగుతుందని, మిగిలిన అధికారులను కూడా గ్రూప్‌గా చేసి విభజిస్తారని ఉన్నత స్థాయి వర్గాలు చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోస్టర్ పాయింట్ తెలంగాణ కేడర్ నుంచే ప్రారంభమవుతుంది. మరి అప్పుడు ఇలంబరితి, దివ్య ఏ కేడర్‌లోకి వస్తారనేది తేలాల్సి ఉంది. ఇక, జేసీ, సింగరేణి డెరైక్టర్ (పా)లు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే అయినా వారు మిగులు అధికారుల జాబితాలోనికి వస్తే (సీనియార్టీ ప్రకారం) మాత్రం కేడర్ మారే అవకాశం లేకపోలేదు. ఐపీఎస్ అధికారుల విషయానికి వస్తే ఎస్పీ రంగనాథ్ కూడా తెలంగాణ కేడర్ కిందకే రానున్నారు. ఆయనకు కేంద్రం ఇచ్చిన ఆప్షన్‌లో కూడా తెలంగాణ కేడర్‌నే ఎంచుకున్నారు.
కానీ, ఆయన ఏ కేడర్ కిందకు వెళతారనేది కూడా నిబంధనలు తేల్చనున్నాయి. ఎస్పీ తెలంగాణ కేడర్‌కు వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ నిబంధనలు అనుకూలంగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కూ వెళ్లవచ్చనే చర్చ జరుగుతోంది. ఇక భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలంగాణకు చెందిన వారు. ఆయన కూడా తెలంగాణ కేడర్‌లోనే ఉంటారని సమాచారం. ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో కన్జర్వేటర్ ఆనందమోహన్, డీఎఫ్‌వో ప్రసాద్‌లలో ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు తెలంగాణ కేడర్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ అఖిల భారత సర్వీసు అధికారులందరి కేడర్ నిర్ధారణ ‘ ఉద్యోగ స్థానికత’ ఆధారంగానే జరగనుంది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మాత్రం రోస్టర్ పద్ధతిన కేటాయించనున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పుడున్న అఖిల భారత సర్వీసు అధికారుల్లో ఎంత మంది తెలంగాణ కేడర్ కిందకు వస్తారు... ఎంత మంది ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళతారనేది తేలాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే.
టెన్షన్... టెన్షన్
Published Sun, Aug 17 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement