విభిన్నంగా ఆలోచించండి..
బ్యాంకర్లకు జైట్లీ సూచన
• ఆర్థిక మంత్రి ప్రీ–బడ్జెట్ సమావేశం
• భారీ మూలధనం కోరిన బ్యాంకులు
• సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై ప్రోత్సాహకాలకూ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ, సవాళ్లను ఎదుర్కొనడం వంటి అంశాల్లో విభిన్నంగా ఆలోచించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ ఎత్తున తాజా మూలధన మద్దతు కల్పించాలని, అలాగే స్థిర డిపాజిట్ల విషయంలో సీనియర్ సిటిజన్ల నుంచి తగిన స్పందన రావడానికి పన్ను పరమైన ప్రోత్సాహకాలు అవసరమని కేంద్రానికి బ్యాంకర్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇక్కడ బ్యాంకర్లతో సాంప్రదాయక ప్రీ–బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. లాభదాయకత దృష్ట్యా ఎన్‌పీఏ ప్రొవిజనింగ్‌కు పూర్తి పన్ను మినహాయింపును బ్యాంకర్లు ఈ సందర్భంగా కోరారు.
జైట్లీ ఏమన్నారంటే...: ఈ ఆర్థిక సంవత్సరాన్ని సాదాసీదాగా భావించడానికి వీలులేదు. ఎన్నో సంస్కరణాత్మక నిర్ణయాలను తీసుకున్నాం. ప్రభుత్వం అలాగే బ్యాంకులు చేయగలిగిందంతా చేయడానికి ఎంతో విభిన్నంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ వెన్నుదన్నన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
బ్యాంకుల అభిప్రాయం...: ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధన కల్పన అవసరం. పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌లో ద్రవ్య లభ్యత పెరిగింది. ఇది డిపాజిట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది సీనియ ర్ సిటిజన్ల ఆదాయాలపై ప్రతికూలత చూపుతుంది. వారి డిపాజిట్లకు సంబంధించి పన్ను పరమైన ప్రోత్సాహకాలు అవసరం. డిజిటల్ లావాదేవీలు పెరగడానికి వీలుగా సేవల పన్ను నుంచి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల లావాదేవీలను మినహాయించాలి. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా నగదు ఆధారిత వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి అవసరం.
నాబార్డ్‌కూ రూ.2,500 కోట్ల మూలధనం అవసరం. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న డెయిరీ రంగం మౌలిక అభివృద్ధి నిధి ఏర్పాటు జరగాలి. ఇక పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వినియోగం పెంపునకు బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు ఉండాలి. ఇది డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. డిజిటల్ పేమెంట్లకు తగిన ప్రోత్సాహకాలు అవసరం. సమావేశంలో యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ కొందరు తమ బ్యాంక్ అధికారులు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్థికవేత్తలతో కూడా...
ఆర్థికమంత్రి మంగళవారం ఆర్థికవేత్తలతో కూడా బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఆర్థికవ్యవస్థ, ద్రవ్యోల్బణం, వివిధ రంగాల్లో ప్రభుత్వ వ్యయాల పెరుగుదలపై డీమోనిటైజేషన్ ప్రభావం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
చిన్న వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు..
డిజిటలైజేషన్ వైపు వెళ్లే చిన్న వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు లభించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. 30% వరకూ పన్ను భారాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రూ.2 కోట్ల వరకూ టర్నోవర్ ఉండే వ్యాపారుల ఆర్జించే లాభం టర్నోవర్‌లో 8% వరకూ వుండవచ్చని 2016–17 బడ్జెట్‌లో పేర్కొన్నాం. దాని ప్రకారం పన్ను విధించాల్సివుంది. అయితే ప్రస్తుతం చెల్లింపులకు సంబంధించి డిజిటల్ విధానాన్ని ఎంచుకుంటే, వారి టర్నోవర్‌లో లాభం 6%గానే భావించడం జరుగుతుందన్నారు.