సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్‌సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్‌లోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్‌లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం.
ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా..
వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు.
మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్‌లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది.
కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు..
రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్‌లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీఎంఆర్‌లో లేని మిల్లులకు ధాన్యం
ఇప్పటివరకు సీఎంఆర్‌తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment