
కార్యక్రమంలో పాల్గొన్న హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, వైఎస్ భారతిరెడ్డి. చిత్రంలో భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఇక్ఫాయ్ ప్రతినిధులు,‘సాక్షి’ సీఈఓ, డైరెక్టర్లు
‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సేవ చేస్తున్న వారిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్నో రంగాల్లో సేవ చేస్తున్నవారు నిజజీవితంలో తారసపడుతున్నప్పటికీ.. అందులో ఉత్తమమైన వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్న ‘సాక్షి’కృషి అద్భుతమని ప్రశంసించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తులకు ‘సాక్షి’మీడియా గ్రూప్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ.. వైఎస్ భారతిరెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడారు.
ఈ కృషిని అభినందించాల్సిందే..
సమాజంలో ఎలాంటి ఫలాలను ఆశించకుండా సేవచేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని.. ఆ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే, వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని దత్తాత్రేయ చెప్పారు. వారి జీవితం సమాజంలోని ఎంతోమందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఎక్సలెన్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ‘సాక్షి’మీడియా గ్రూప్ పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తోందని.. ఈ కృషిని అభినందించాల్సిందేనని చెప్పారు.
‘‘ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ఆశామాషీ కాదు. సేవ చేసేవారిని గుర్తించడం, వారి సేవతో సమాజంలో వస్తున్న మార్పును విశ్లేషిచడం ద్వారా విశిష్ట వ్యక్తులను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ సభ్యులకు అతిపెద్ద సవాలు..’’అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపిక చేసిన విధానం అద్భుతంగా ఉందని జ్యూరీ సభ్యులను అభినందించారు. పదేళ్ల అవార్డుల ప్రదానోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహా్వనించినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమలు, ఆరోగ్య పరిరక్షణ తదితర కేటగిరీలలో తొమ్మిది మందికి గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇక్ఫాయ్ యూనివర్సిటీ డైరెక్టర్లు కె.ఎల్.నారాయణ, కె.ఎస్.వేణుగోపాల్‌రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పోతూరి, సాక్షి సీఈవో, డైరెక్టర్లు, ఎడిటర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment