రైతుల ఆత్మహత్యలపై వాస్తవాలు అంగీకరించిన ప్రభుత్వం
రైతులను తాము నిండా ముంచుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒప్పుకుంది. వారిలో ఏ ఒక్కరికీ పైసా పరిహారం చెల్లించలేదని అంగీకరించింది. రబీ సీజన్‌లో నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 60.55 లక్షల ఎకరాలు కాగా, కేవలం 8.80 లక్షల ఎకరాల్లో పంటలకు మాత్రమే బీమా కవరేజ్ కల్పించినట్టుగా కూడా వెల్లడించింది. అంటే తమ ప్రభుత్వ నిర్వాకం వల్లే దాదాపు 52 లక్షల ఎకరాల్లో సాగవుతున్న నోటిఫైడ్ పంటలకు బీమా దూరమైందని కూడా అంగీకరించింది.
గత రబీ సీజన్‌లో 43.82లక్షల మంది రైతులకు నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అందించగా... నేడు కేవలం 6.50లక్షల మందికే స్వచ్ఛంద నమోదు పంటల బీమా కింద నమోదు చేసినట్టు తెలిపింది. మొత్తం 37.32 లక్షల మంది రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయినట్లు అంగీకరించింది. తద్వారా ఐదేళ్లపాటు రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి, కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛంద నమోదు పద్ధతి వల్ల రైతులకు పంటల బీమా రక్షణ లేకుండాపోయిందని ఒప్పుకుంది.
ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను గాలికి వదిలేసిన తీరుపై పూర్తి ఆధారాలతో ‘సాక్షి’లో వరుసగా రెండు రోజులపాటు ప్రచురితమైన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు సోమవారం విడుదల చేసిన ప్రకటనల ద్వారా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు సమ్మతించడం గమనార్హం.
97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
⇒ సాక్షిలో ‘సర్కారు హత్యలు 97’ కథనంపై వ్యవసాయ శాఖ వివరణ
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12 నుంచి నేటి వరకు 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి ఆరు నెలల్లో 49 మంది చనిపోగా, జూన్ నుంచి డిసెంబర్ వరకు 97 మంది చనిపోయారని తేల్చి చెప్పింది. ‘సర్కారు హత్యలు 97’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాక్షి’లో పేర్కొన్న 97 మంది రైతుల ఆత్మహత్యలు నిజమేనని ఆ ప్రకటనలో అంగీకరించింది. వారిలో ఏ ఒక్కరికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యల వివరాలను పొందుపర్చేందుకు ప్రభుత్వాదేశాల మేరకు ప్రత్యేకంగా ఇటీవలే చంద్రన్న పోర్టల్ ప్రారంభించినట్టు పేర్కొంది.
ఈ 97 మందిలో త్రిసభ్య కమిటీ నిర్ధారించిన రైతుల వివరాలను చంద్రన్న పోర్టల్‌లో అప్లోడ్ చేసి, ఆయా రైతు కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సున్నా వడ్డీ రాయితీ చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి అర్హుల వివరాల జాబితాలను అప్‌లోడ్ చేయడంలో జరిగిన జాప్యం వల్లే రాయితీ విడుదల చేయలేదని పేర్కొంది. ఆ సీజన్‌లో అర్హత పొందిన 6.31లక్షల మందికి చెల్లించాల్సిన రూ.132 కోట్లను కూడా సాధ్యమైనంత త్వరగానే చెల్లిస్తామని తెలిపింది.
పంటల బీమా పరిధిలోకి వచ్చింది 8.80 లక్షల ఎకరాలే
⇒ నేటితో ప్రీమియం చెల్లింపునకు గడువు ముగిసినట్టే..
⇒ అవగాహన కల్పించినా.. ఆరున్నర లక్షల మందే దరఖాస్తు
⇒ ‘సాక్షి’ కథనంపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు
సాక్షి, అమరావతి: రబీ సీజన్ నుంచి అమలు చేస్తున్న స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమాలో చేరేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఇప్పటి వరకు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 8.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు బీమా పరిధిలోకి తీసుకొచి్చనట్టు పేర్కొన్నారు. ‘ప్రీమియం భారం.. బీమాకు దూరం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకే ఐదేళ్ల పాటు అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు.
పంట రుణాలు పొందని రైతులు ఈ పథకంలో చేరేందుకు మంగళవారంతో గడువు ముగిసిందని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులు మాత్రం పోర్టల్ ద్వారా పూర్తి వివరాలు అప్లోడ్ చేసేందుకు మరో 15 రోజులు వెసులుబాటు కల్పించామని వివరించారు. జీడిమామిడి పంటకు ఏడు రోజులు, వరిపంటకు మరో 15 రోజులు పొడిగించాలని బీమా కంపెనీలను సంప్రదించామని, వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వెబ్‌ల్యాండ్ డేటాతోపాటు కౌలుదారుల సమాచారం సీసీఆర్సీ డేటా బేస్, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూముల వివరాలను రెవెన్యూ శాఖ సహకారంతో జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులదే
⇒ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నిరోధించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ అన్నారు. బ్యాంకులు మానవీయ కోణంలో స్పందించి రైతులను ఉదారంగా ఆదుకోవాలని ఆయన కోరారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ తుపాన్లు, అధిక వర్షాల వంటి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర ఆటుపోట్లకు గురవుతోందన్నారు.
ప్రతికూల పరిస్థితుల నడుమ బ్యాంకర్లు, వ్యవసాయ సిబ్బందికి అవసరమైన చేయూతనివ్వాలన్నారు. పెట్టుబడుల నిమిత్తం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు మాట్లాడుతూ ఎటువంటి హామీ, పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.60లక్షల నుంచి రూ.2లక్షలకు ఆర్బీఐ పెంచిన విషయాన్ని రైతులకు తెలియజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment