రెవెన్యూ రికార్డుల్లో ఊళ్లుగా నమోదు
మరికొన్ని శివారు గ్రామాలుగా...
ఇళ్లు ఉండవు.. మనుషులు నివసించరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.
⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు.
⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు.
⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.
⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్‌పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్‌పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం.
⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.
⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు.
⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు.
⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.
యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు
కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment