
ఆదర్శంగా ‘పల్లెగడ్డ’ గ్రామం...కలిసికట్టుగానే మంచిచెడులు
గ్రామంలో ఎవరైనా చనిపోతే ఊరంతా ఉపవాసమే
90 శాతం వ్యవసాయమే జీవనాధారం... ఇటీవలగ్రామపంచాయతీగా గుర్తింపు
నేటి ఆధునికయుగంలో బంధాలు.. అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆ గ్రామమంతా కలిసికట్టుగా ఉంటోంది. అన్నింట్లో పాలుపంచుకుంటున్న ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. దాదాపు 500 ఏళ్ల క్రితం వలస వచ్చిన ఓ కుటుంబం... ఇప్పుడు 228 ఇళ్లుగా మారి ఓ పంచాయతీగానే రూపాంతరం చెందింది. అదే నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ‘పల్లెగడ్డ’గ్రామం.
మరికల్: ఒకే కులం.. ఒకే మాటతో గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా అన్న.. తమ్మి, మామ, అల్లుడు అని పలకరిస్తూ కలిసికట్టుగా పరిష్కరించుకుంటారు పల్లెగడ్డ వాసులు. ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైనా చనిపోతే ఊరంతా ఉపవాసం ఉండి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 500 ఏళ్ల క్రితం మరికల్ గ్రామంలో ముదిరాజ్ కులంలోని కట్టెకొండ గోత్రానికి చెందినవారు ఉండేవారు.
వీరి వ్యవసాయ భూములు మరికల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ప్రాంతంలో ఉండేవి.దీంతో కట్టెకొండ గోత్రానికి చెందిన ఓ వ్యక్తి మరికల్ నుంచి అక్కడకు వెళ్లి ఓ గుడిసె వేసి నివాసం ఏర్పరుచు కున్నాడు. కాలక్రమంలో ఈ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు పుట్టి మూడు తరాలుగా విడిపోయి ఇళ్లు నిర్మించుకోవడంతో ఒక చిన్న పల్లెగా అవతరించింది. ఆనాడు మరికల్ పరిధిలోనే ఈ గ్రామం ఉండటంతో పల్లెగడ్డగా పేరుగాంచింది.
ఒక ఇంటిలో మూడు తరాలుగా విడిపోయిన అన్నదమ్ములే వారసత్వంగా కుటుంబాలు పెరిగి.. నేడు ఇక్కడ 228 ఇళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 1,260 జనాభా ఉండటంతో మరికల్ నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 349 మంది స్త్రీలు, 357 మొత్తం కలిపి 706 మంది ఓటర్లు ఉన్నారు.
75 శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కుంటున్నారు. గ్రామ శివారులో 1,245 ఎకరాల వరకు భూమి ఉంది. ఇక్కడ 90 శాతం మంది వ్యవసా యంపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, 10 శాతం మంది మాత్రమే ఇతర వ్యాపారాలు చేస్తున్నారు.
ఆపద వస్తే సాయం
గ్రామమంతా ఒకే కులంవారు ఉండటంతో అందరూ ఐక మత్యంతో ఉంటున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు చేయడానికి దేవాలయం లేకపోవడంతో గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తారు.
ఆనందంగా ఉంది..
మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇప్పటికే ఏడు తరాలు దాటినట్టు తెలిసింది. ఒకే కులం పేరుతో ఇక్కడ నివసించడం ఆనందంగా ఉంది. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా, అందరూ కలిసి వారి బాధను పంచుకుంటాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. – హన్మంతు
శ్రీవారి సేవకులం
15 ఏళ్ల నుంచి టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి దేవ స్థానంలో నిర్వహించే కార్య క్రమాలకు గ్రామం నుంచి మూడు టీంలుగా వెళతాం. అక్కడే వారం రోజులు ఉండి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు చేస్తాం. అన్నదానం, లడ్డూ్డ తయారీ, అఖండ భజన కార్యక్రమాలు నిర్వహించడంతో మా గ్రామానికి ప్రత్యేక గౌరవం దక్కింది. –శ్రీరామ్
Comments
Please login to add a commentAdd a comment