తెలంగాణలో పేట బంగారానికి గుర్తింపు
చొక్క బంగారానికి పెట్టింది పేరు
128 ఏళ్లుగా బంగారు ఆభరణాల విక్రయాలు
నారాయణపేట: మగువల మనసు దోచే అందమైన, అద్భుతమైన మన్నికకు మారుపేరుగా నిలిచే బంగారు అభరణాలకు నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి. దాదాపు 128 ఏళ్లుగా పేట బంగారానికి చెక్కుచెదరని ఖ్యాతి ఉంది. ఇక్కడి బంగారం నాణ్యత చూసిన నిజాం ప్రభువు నారాయణపేట్ సోనేకా ఠేట్ (స్వచ్చమైన బంగారం) అని కితాబిచ్చినట్లు ప్రచారం ఉంది.
24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని విక్రయించడంలో స్థానిక స్వర్ణకారులు నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అందుకే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు.
బంగారు విక్రయానికి 128 ఏళ్లు
నారాయణపేటలో 1898వ సంవత్సరం నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వ్యాపారులు బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజాం కాలంలో లహోటికి చెందిన వారు వ్యాపారం భారీగా చేసేవారు. ఆ కాలంలో రాజస్తాన్ నుంచి నారాయణపేటకు వచ్చిన రాంచందర్ మెగరాజ్ భట్టడ్ ఇక్కడ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఐదు దశాబ్దాలుగా స్థానికంగా బంగారం వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆరంభంలో అసరం భట్టడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర ఎనిమిది బంగారు దుకాణాలుంటే.. ప్రస్తుతం 100పైగా దుకాణాలకు విస్తరించాయి.
హాల్‌మార్క్.. మోనోగ్రామ్
స్థానికంగా దుకాణాల్లో తయారు చేసిన అభరణాలపై చిన్న సైజులో తమ దుకాణం పేరు ముద్రను (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలు చేసిన వారు విక్రయించేందుకు వెళ్తే.. గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లను వ్యాపారులు బంగారం ప్రియుల కోసం అందుబాటులో ఉంచుతారు.
తారాపూర్, అమృత్‌సర్, ముంబై, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్‌లో డైస్ వచ్చిన పది రోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. హాల్‌మార్క్‌తో కూడిన వివిధ రకాల డిజైన్లలో నగలను హైదరాబాద్, నారాయణపేటలోని బెంగాలీ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మీ నెక్లెస్, లక్ష్మీలాంగ్ చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల అభరణాలు లభిస్తాయి.
శుభకార్యం వస్తే చాలు..
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేట సరాఫ్ బజార్ కిటికిటలాడుతుంది. రాష్ట్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, జనగాంలతో పాటు నారాయణపేటలో బంగారం ఎంతో నాణ్యత, మన్నికతో ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగారం కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని యాద్గిర్, సేడం, గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు ఎక్కువ వస్తుంటారు.
స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచే కొనుగోళ్లు
దేశంలోని బంగారు వ్యాపారస్తులు ఆన్‌లైన్ ద్వారా స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌తో పాటు సెంట్రల్ బ్యాంకుల్లో డీడీలను కట్టి బంగారు బిస్కెట్‌లను కొనుగోలు చేస్తుంటారు. ఎస్‌బీఐ, కార్పొరేషన్ బ్యాంకులు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ల నుంచి కిలోల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ఆరంభంలో డాలర్ విలువపై హెచ్చుతగ్గు ధరలు కావాల్సిన వారు.. బంగారం కోసం ఆన్‌లైన్‌లో ధరను కోట్ చేసి ఉంచితే వారికి అదే ధరకు బంగారం కేటాయిస్తారు.
సరాఫ్ బజార్
ఏ ఊళ్లోనైనా కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్, కిరాణా మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండడం సహజం. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 100 దుకాణాలు వరుసగా ఉండడంతో సరాఫ్ బజార్ అని పేరుపెట్టారు. పెద్ద పెద్ద నగరాల స్థాయిలో పేటలో బులియన్ అండ్ జువెల్లర్స్‌గా వ్యాపారం కొనసాగుతోంది.
తేజాప్‌తో నాణ్యత
ఆభరణాలు నాణ్యతగా ఉన్నాయా?, డూప్లికేటా? అనేది తేజాప్‌తోనే పరిశీలిస్తారు. డూప్లికేట్ బంగారు నగలైతే వెంటనే అది కాలిపోతూ నల్లగా మారుతుంది. ఒరిజినల్ బంగారాన్ని తేజాప్‌లో వేసి కరిగించినా ఎలాంటి మార్పు రాదు. తేజప్‌లో పాత బంగారాన్ని కరిగించి నగల నాణ్యతను గుర్తిస్తారు. టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారాన్ని పరీక్షిస్తున్నారు. నారాయణపేటలో 24 క్యారెట్లతో నగలు తయారు చేస్తారు. అందుకే అత్యవసర సమయాల్లో అభరణాలను విక్రయిస్తే.. పేట బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గదు.
30 ఏళ్లుగా వ్యాపారం
నేను 30 ఏళ్లుగా బంగారు వ్యాపారం చేస్తున్నా. ముంబై, పుణే, హైదరాబాద్ నగరాల్లో 18, 19 క్యారెట్లతో బంగారు అభరణాలు విక్రయిస్తుంటారు. కానీ ఒక్క నారాయణపేటలోనే ఇప్పటికి 24 క్యారెట్లతో నగలు తయారు చేసి విక్రయిస్తున్నాం.
– సరాఫ్ నాగరాజు, వ్యాపారి, నారాయణపేట
నాణ్యతకు మారుపేరు..
నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు మారుపేరు నారాయణపేట బంగారు అభరణాలు. 24 క్యారెట్లతో నాణ్యత కూడిన బంగారు అభరణాల విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కొన్న అభరణాలు రీసేల్ చేస్తే 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారాన్ని కొనేందుకు అసక్తి చూపుతారు.
– హరినారాయణభట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నారాయణపేట
అంతా ‘చొక్క’బంగారమే
నారాయణపేటలో స్వర్ణకారులు తయారు చేసేది.. వ్యాపారస్తులు అమ్మేదంతా చొక్క బంగారమే. అభరణాల్లో కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డాణాలు, నానులు తదితర ఆభరణాలను నాణ్యత, మన్నికతో తయారు చేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. వందశాతం నాణ్యతగా ఉంటుంది.
– శ్రీనివాస్ చారి, స్వర్ణకారుడు, నారాయణపేట
చొక్క బంగారు అభరణాలివే
నాను, పుస్తెలతాడు, గొలుసు, రెండు, మూడు వరసల పెద్దగొలుసులు, జిలేబీ చైను, చుట్టూ ఉంగరాలను 24 క్యారెట్లతో తయారు చేస్తారు. చంద్రహార, బోర్‌మాల్ గుండ్లు, కొలువులు, టెక్కీలు, ఐదారుటెక్కీలు, నెక్లెస్, లాంగ్‌చైన్, వడ్డాణం, వంకీలు, గాజులు, చెవుల కమ్మలు, జుంకీలు, మకరకురందనాలు, గెంటీలు, తార్‌కాస్ కమ్మలు, కరివేపూలు, ఏడురాళ్ల కమ్మలు, బ్రాస్‌లెట్లు, లాకెట్లు తదితర ఆభరణాలను కూడా తయారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment