
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్‌ఎం సహా మరొకరిపై సస్పెన్షన్
ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే!