సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిన జలంధర్‌రెడ్డి, పులిమామిడి రాజు
రేపు నారాయణపేట సభతో సీఎం ప్రచారం మొదలు
ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు చోట్ల ప్రచారానికి వెళ్లే అవకాశం
నేడు హైదరాబాద్‌కు కేసీ... లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళిపై సమీక్ష
ఈ నెల 20లోపు ముఖ్య కార్యకర్తల భేటీల ముగింపు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడినట్టు కనిపించినా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో సన్నాహక భేటీలు నిర్వహిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతల నేతృత్వంలో అసెంబ్లీ స్థాయి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలను ఈనెల 20లోపు ముగించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సమావేశాల అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల రాకతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది.
సీఎం రేవంత్‌రెడ్డి కూడా లోక్‌సభ ఎన్నికల కోసం తన ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు చోట్ల ప్రచారం నిర్వహించేలా ఆయన సభల షెడ్యూల్ తయారవుతోంది. తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. ఇక్కడ సోమవారం నిర్వహించే సభకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
నేడు కేసీ రాక..: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి ని సమీక్షించేందుకుగాను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చా ర్జులు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు ఏఐసీసీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్, సభల నిర్వహణ ఎక్కడన్న దానిపై కూడా టీపీసీసీ నేతలతో చర్చించనున్నారు.
టార్గెట్ బీజేపీ
రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ముఖ్యంగా బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తోన్న నియోజకవర్గాల నుంచి కమలనాథులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సంగారెడ్డి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జి పులిమామిడి రాజు, మక్తల్ నేత జలంధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. త్వరలోనే మరింత మంది అసెంబ్లీ స్థాయి బీజేపీ నేతలకు కాంగ్రెస్ గాలం వేయనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment