![5 Killed As Two Cars Collide Head On In Telangana Narayanpet - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/25/accedents.jpg.webp?itok=3rI8pIzr)
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. అస్తమా వ్యాధితో బాధపడుతోన్న కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ గ్రామానికి చెందిన రెహమాన్‌బేగం(40)ను చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్దికి తీసుకువచ్చారు.
చికిత్స పొందిన అనంతరం తిరుగు ప్రయాణంలో భర్త మౌలాలి(40), కలీల్(43), మరో వ్యక్తి వడివాల్‌తో కారులో కలిసి బయలుదేరారు. ఇదే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని కార్వాల్‌లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగి దీపక్ సమల్, భార్య భవిత సమల్(35), కూతురు అవిస్మిత సమల్(8)తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు.
జక్లేర్ సమీపంలో ఉన్న దాబా దగ్గర అతివేగంగా వచి్చన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో రెహమాన్ బేగం, మౌలాలి, ఖలీల్, భవిత సమాల్, అవిస్మిత సమాల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వడివాల్, దీపక్ సమల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దీపక్ సమల్ పరిస్థితి విషమించడంతో 108లో మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంలాల్ తెలిపారు. దీపక్ సమల్‌కు విశాఖపట్టణానికి బదిలీ కావడంతో అక్కడికి వెళ్లేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారని బంధువులు తెలిపారు. కాగా, కార్లలో బెలూన్ల సౌకర్యం ఉన్నప్పటికీ అవి సకాలంలో ఓపెన్ కాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు. రోడ్డుపై డివైడర్ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment