
ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి.. శనివారం సాయంత్రం 6 గంటల వరకు దైవ చింతనే
ఇళ్లు, వాకిళ్లను ఊడవరు
సిగరెట్, కల్లు, మద్యం ముట్టరు
లహరి కృష్ణ భక్తుల ఆచారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి.
వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు.
ఆ 24 గంటలు ప్రత్యేకం
వీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు.
చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలు
ఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు.
అందరం నియమాలు పాటిస్తాం
ఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి.
– దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment