
అంతటా పెళ్లి కూతుళ్ల కొరత
మ్యారేజ్ బ్యూరోల్లో పెరుగుతున్న అబ్బాయిల జాబితా
సామాజిక మాధ్యమాల వేదికగా వెతుకులాట
ఎదురుకట్నానికీసరేనంటున్న అబ్బాయిలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పెళ్లి కూతుళ్లకు కొరత ఏర్పడింది. అవును.. మీరు చదువుతున్నది నిజం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అమ్మాయి దొరకడం లేదనే మాట వినిపిస్తోంది. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉండి కూడా అమ్మాయిల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆడపిల్లల జనాభా తగ్గడమేనన్నది వాస్తవం. సంప్రదాయ పెళ్లిళ్లన్నీ కులాల ప్రాతిపదికనే నడుస్తాయి. ప్రేమ వివాహాల దగ్గర మాత్రమే కుల ప్రస్తావన కనిపించదు.
అయితే కొన్ని కులాల్లో ఆడపిల్లల కొరతతో చాలామంది పెళ్లి కాని ప్రసాద్‌లుగా మిగిలిపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ కులం అమ్మాయి అయినా సరే అంటున్నారు. మరికొందరు పెళ్లి ఖర్చు భరిస్తామని, అవసరమైతే అమ్మాయి తరపు వారికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తామని ముందుకొస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెళ్లి సంబంధాల కోసం బంధువులు, తెలిసిన వారి చెవుల్లో వేస్తున్నారు. ఓ అమ్మాయిని వెతికి పెట్టండని మొర పెట్టుకుంటున్నారు.
పురుషులకు దీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్లను ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారెందరో ఉన్నారు. కొందరైతే కడుపులో పెరుగుతున్నది ఆడో, మగో తెలుసుకుని.. ఆడపిల్ల అయితే కడుపులోనే తుంచేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు, వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పడం లేదు.
తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2024 నివేదికలో.. 2011 జనాభా ఆధారంగా రాష్ట్రంలో 2021 ప్రొజెక్టెడ్ పాపులేషన్ రికార్డులను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్టు స్పష్టమవుతోంది. పదిహేనేళ్ల నుంచి 19 ఏళ్ల లోపు జనాభాలో.. మగవారి కన్నా ఆడవాళ్లు 96 వేల మేర తక్కువగా ఉన్నారు.
అలాగే 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఆడపిల్లలు లక్షా 6 వేల మంది తక్కువగా ఉన్నారు. పాతికేళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారు 78 వేల మంది ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. పెళ్లి వయసు వచ్చిన మగవారి కన్నా.. ఆడపిల్లలు దాదాపు 2 లక్షల నుంచి 2.50 లక్షల మంది తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.
మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని...
పెళ్లికూతుళ్ల కొరత మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని కల్పిస్తోంది. అబ్బాయి తరపువారు అమ్మాయిల కోసం బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. తెలిసిన వారికల్లా తమ కొడుక్కి ఓ మంచి సంబంధం చూడమంటూనే మరోవైపు బ్యూరోలకు బయోడేటా, ఫొటోలు ఇస్తున్నారు. బ్యూరోల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో ఒకటి రెండు కులాల్లో వివాహ వేదికలు ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల్లో వివాహ సంబంధాలు వెతికే బ్యూరోలు వెలిశాయంటే.. అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంటర్నెట్‌లోనూ పెళ్లి సంబంధాలు..
వివాహ సంబంధాలకు మ్యారేజ్‌బ్యూరోలు ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్లు తెరిచాయి. దీంతో అబ్బాయిలు తమకు ఎలాంటి అమ్మాయి కావాలో వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. పలు వివాహ వేదికలు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లలో వందలు, వేలల్లో పెళ్లి సంబంధాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వివాహ పరిచయ వేదికలకు గిరాకీ పెరిగింది. వివిధ కులాలకు చెందిన పెళ్లి సంబంధాలను పరిచయ వేదికల ద్వారా వెతికే పని చేపట్టారు. ఈ వేదికలపై ఎన్నో పెళ్లి సంబంధాలు ఖాయం అవుతుండడంతో ఆదరణ పెరుగుతోంది.
ఎదురు కట్నాననికి సిద్ధం
వరకట్నం సమస్య అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమైన పరిస్థితుల్లో.. ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిలు సిద్ధమవుతున్నారు. అమ్మాయి దొరికితే చాలు.. అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొన్ని కులాల్లో ఎదురుకట్నం ఇచ్చే సంప్రదాయం మొదలైంది. కొందరు పెళ్లి ఖర్చు భరిస్తున్నారు. అమ్మాయిల కొరతతో ఎందరో అబ్బాయిలు.. పెళ్లికాని ప్రసాద్‌లుగా మిగులుతుండడం ఆందోళన కలిగించే అంశం.