తెలంగాణలో ఐదేళ్లుగా ఒకేరీతిలో వివాహ రిజిస్ట్రేషన్లు
2023–24లో అత్యధికంగా 1.09 లక్షల రిజిస్ట్రేషన్లు
గ్రేటర్ పరిధిలోనే 40 శాతం..వరంగల్, కరీంనగర్‌లలో భారీగానే నమోదు
‘కల్యాణలక్ష్మి’లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షల వరకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వివాహ రిజిస్ట్రేషన్లు ఓ మోస్తరుగానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయనే అంచనా ఉండగా, రిజిస్ట్రేషన్లు మాత్రం లక్షలోపే ఉంటున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019–20 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏటా సుమారు 90 వేలకు పైగా మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఐదేళ్ల కాలంలో కూడా ఈ సంఖ్యలో మార్పు లేకపోవడం విశేషం. అయితే..2023–24లో మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా 1.09 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలోనే 40 శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
2023–24 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 15,733 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రంగారెడ్డిలో 13,502, హైదరాబాద్ జిల్లాలో 10,925 మంది తమ వివాహాలను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌లో 14,027, వరంగల్ జిల్లాలో 11,565 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లోనే సగం రిజిస్ట్రేషన్లు జరగ్గా, మిగిలిన ఏడు రిజి్రస్టేషన్ జిల్లాల్లో కలిపి మరో సగం జరగడం గమనార్హం.
ఏ డాక్యుమెంట్లు కావాలంటే...!
వివాహ రిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం వద్దని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం పట్టదని, స్లాట్ బుక్ అయిన రోజునే పూర్తవుతుందంటున్నారు. అయితే డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక, 2 పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్‌కార్డులు, వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, వారి ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి.
వివాహానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు విదేశాలకు వెళ్లాలనుకునే దంపతులకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో వివాహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డులో చిరునామా మార్పు కావాలన్నా, కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం. అయితే, కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది.
కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తుండగా, అందులో ఎక్కువగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఇచ్చే వివాహ ధ్రువపత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో ధ్రువపత్రాలు ఒకసారి, వివాహాల రిజిస్ట్రేషన్లు మరోసారి కాకుండా నేరుగా సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.
గతం కంటే అవగాహన పెరిగింది కానీ..అది సరిపోదని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. జరిగే ప్రతి వివాహం రిజి్రస్టేషన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదని సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment