స్వరాష్ట్రంలో ‘సమృద్ధి’ | Telanganas share in the countrys development is increasing every year | Sakshi
Sakshi News home page

స్వరాష్ట్రంలో ‘సమృద్ధి’

Published Thu, Sep 19 2024 3:33 AM | Last Updated on Thu, Sep 19 2024 3:33 AM

Telanganas share in the countrys development is increasing every year

దేశాభివృద్ధిలో ఏటేటా పెరుగుతున్న తెలంగాణ వాటా 

రాష్ట్రమేర్పడే నాటికి జీడీపీలో 3.8 శాతంగా రాష్ట్ర వాటా 

తాజా అంచనాల ప్రకారం 4.9 శాతానికి పెరుగుదల 

ప్రధానికి ఆర్థిక సలహా మండలి నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌:     దేశంలోనే వయసులో చిన్నదైన తెలంగాణ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దేశాభివృద్ధిలో రాష్ట్ర వాటా ఏటేటా పెరుగుతోందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఆర్థిక సలహా మండలి ఇటీవల ప్రధానమంత్రికి ఇచ్చిన రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి నివేదిక మేరకు జాతీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర వాటా 4.9 శాతంగా తేలింది. 

తెలంగాణ ఏర్పాటయ్యాక జీడీపీలో రాష్ట్రం వాటా 3.8 శాతం కాగా, పదేళ్లలోనే ఇది గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో రాష్ట్ర వాటా 4.7 శాతానికి చేరగా, తాజా అంచనాల మేరకు 2023–24లో 4.9 శాతానికి చేరింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్‌ వాటా 8.4 శాతంగా ఉండేదని అంచనా. ఇప్పుడు అది 9.7 శాతానికి పెరిగింది. అయితే అందులో 1.1 శాతం తెలంగాణ వాటానే పెరిగింది. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా అభివృద్ధి బాటలోనే పయనిస్తున్నా.. జీడీపీలో ఆ రాష్ట్ర వాటా పెరుగుదల స్వల్పంగానే ఉంది. రాష్ట్రం విడిపోయే నాటికి 4.6 శాతం ఉండగా, 2020–21 నాటికి 4.9 శాతానికి చేరింది. అయితే 2023–24 నాటికి 4.7 శాతానికి తగ్గింది. మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలోనే ఉన్నాయని, రెండు రాష్ట్రాల జీడీపీ వాటా ఏటేటా పెరుగుతోందని ఆర్థిక సలహా మండలి నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

దక్షిణాది రాష్ట్రాలే టాప్‌ 
ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆర్థికాభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. 1991 సంవత్సరానికి ముందు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులు జీడీపీలో తమ భాగస్వామ్యాన్ని చెప్పుకోదగిన స్థాయిలో నమోదు చేయలేదని, ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడు సింహభాగం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని ఆర్థిక సలహా మండలి నివేదిక చెపుతోంది. 

ప్రస్తుత జీడీపీలో దాదాపు 30 శాతం ఈ రాష్ట్రాలదేనని వెల్లడించింది. తలసరి ఆదాయం కూడా జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో జాతీయ సగటుతో పోలిస్తే 193.6 శాతం అధికమని, కర్ణాటక 181, తమిళనాడు 171, కేరళ 152.5 శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా తలసరి ఆదాయం కలిగి ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement