మణిపూర్‌లో అంతే.. వెరైటీ ‘పెళ్లిళ్లు’
అక్కడ అత్యధికంగా జరిగేవి గాంధర్వ వివాహాలే
పారిపోయి చేసుకునే పెళ్లిళ్లపై ఠాణాల్లో కేసులు
ఆపై పోలీసుస్టేషన్‌లోనే ఇరుపక్షాల రాజీ
తన అనుభవాలను పంచుకున్న మహేశ్ భగవత్
నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సదస్సులో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024కు అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ ప్యానల్ స్పీకర్‌గా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) క్యాడర్‌కు రావడానికి ముందు ఆయన కొన్నాళ్లు మణిపూర్‌లో పని చేశారు. వివాహాలకు సంబంధించి అక్కడ, భద్రత కోణంలో న్యూయార్క్‌లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు.
అక్కడ ఎస్పీ కూడా అలానే వివాహం చేసుకున్నారట...
నేషనల్ పోలీసు అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1997లో ట్రైనీ ఏఎస్పీ హోదాలో మణిపూర్‌లోని ఓ పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా పని చేశా. ఓ రోజు ఠాణాలో ఉండగా నలుగురు యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేసిన వ్యక్తి వాళ్లు వెళ్లిన వాహనం నెంబర్ కూడా చెప్పారు. వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి రంగంలోకి దిగా. నాలుగు కిలోమీటర్లు ఛేజ్ చేసి కిడ్నాపర్ల వాహనాన్ని పట్టుకుని యువతిని రెస్క్యూ చేశాం. వాళ్లను ఠాణాకు తీసుకువచి్చన తర్వాత మా ఎస్పీకి ఫోన్ చేసి పెద్ద ఆపరేషన్ చేశానని చెప్పాం.
దీనికి ఆయన ఫక్కున నవ్వుతూ తానూ అలాంటి గాంధర్వ వివాహమే చేసుకున్నానని అన్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు, కేసు ఎందుకని ప్రశ్నించా. ‘‘అది అక్కడ ప్రొసీజర్ అని, కేసు పెట్టి ఇరుపక్షాలను ఠాణాకు పిలవాల్సిందేనని’’అన్నారు. ‘‘ఆపై యువతీయువకులు తమ సర్టిఫికెెట్లు చూపించి మేజర్లుగా నిరూపించుకుంటారు. వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అప్పగిస్తే మూడునాలుగు రోజులకు మరోసారి ఘనంగా వివాహం చేస్తారు ’’అని ఎస్పీ చెప్పడంతో నాకు ఆశ్చర్యమేసింది.
అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగితే అనుమానించారు...
అమెరికాలో వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 2001లో జరిగిన 9/11 ఎటాక్స్ తర్వాత ఇది చాలా పెరిగింది. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిజం శిక్షణ కోసం ఓ పోలీసు బృందాన్ని అమెరికా పంపింది. ఆ బృందంలో నేను కూడా ఉన్నా. అప్పట్లో నక్సలిజం చాలా ఎక్కువగా ఉండటంతో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేవాళ్లం. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగా. విక్రయించనంటూ నిర్మొహమాటంగా చెప్పేసిన దాని యజమాని బయటకు వచ్చి నేను వినియోగించిన వాహనం నెంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరైనా అలాంటి ఓ దుకాణానికి వెళ్లి అడిగితే.. వారి వద్ద లేకపోయినా పది నిమిషాలు కూర్చోమంటూ ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి ఇస్తామంటారు. ఈ ధోరణి మారి వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి పెరగాలి.
ప్రజలను చైతన్యవంతం చేయడమే సవాల్...
ఇక్కడ నివసిస్తున్న ప్రజలను నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడేలా మోటివేట్ చేయడమే పెద్ద సవాల్. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌లో సరాసరిన రోజుకో ఆత్మహత్య చొప్పున జరుగుతూ ఉంటుంది. ఇలా ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించడానికి పోలీసు విభాగం తరఫున సుశిక్షితులైన సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఆ ఉదంతం జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు మాత్రం స్పందించరు. తొలి ప్రాధాన్యం వీడియో చిత్రీకరించడానికే ఇస్తారు. తాము ఫస్ట్ సేవర్ కావాలని ఆశించడం కన్నా సోషల్‌మీడియాలో పెట్టడానికి ఫస్ట్ రికార్డర్ కావాలని భావిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రజలను మోటివేట్ చేయడమే ప్రస్తుతం సమాజంలో ఉన్న పెద్ద సవాల్.
Comments
Please login to add a commentAdd a comment