
సాక్షి, గచ్చిబౌలి: ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే.. ఆరు నెలల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో.. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే, వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, తోర్‌మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.
అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్‌చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.
ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్‌చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment