
పెంచిన ఫీజు చెల్లించాలని పీజీ విద్యార్థులపై యాజమాన్యాల తీవ్ర ఒత్తిడి
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకముందే ఫీజులు ఎలా చెల్లిస్తామంటున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ విద్యార్థులకు సంబంధించి అదనపు ఫీజుల లొల్లి నడుస్తోంది. ఫీజులు చెల్లించిన విద్యార్థులనే తరగతులు, వైద్యసేవలకు అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. సాధారణంగా పీజీ వైద్య విద్యార్థులకు తరగతి గదిలో కంటే ఓపీ(అవుట్ పేషెంట్), ఐపీ(ఇన్ పేషెంట్) విభాగాల్లోనే ఎక్కువగా విధులుంటాయి.
60 శాతం ఫీజులు చెల్లించినా...
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య విద్యార్థులకు వేర్వేరుగా ఫీజులున్నాయి. మూడేళ్ల క్రితం ఫీజుల పెంపుతో కేటగిరీ‘ఏ’లో సీటు సాధించిన విద్యార్థి రూ.7 లక్షలు, , కేటగిరీ ‘బి’లో సీటు సాధించిన విద్యార్థి రూ.24 లక్షల చొప్పున ఫీజులను ఖరారు చేశారు.
అయితే ఆ ఫీజుల పెంపును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలనుసారం కేటగిరీ‘ఏ’విద్యార్థులు 60 శాతం చొప్పున, కేటగిరీ ‘బి’విద్యార్థులు 70 శాతం చొప్పున ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల గడువు ముగిసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఫీజులు చెల్లించాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి.
హాజరు లేదు... డ్యూటీలు లేవు...
అదనపు ఫీజులు చెల్లించని పీజీ వైద్య విద్యార్థులను పలు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తరగతులకు అను మతించడం లేదు. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరం పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులకు ఈనెల 15వ తేదీ నుంచి డ్యూటీలు రద్దు చేశారు. తాజాగా ఆయా విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు సైతం స్వీకరించడం లేదు. మరోవైపు తరగతులకు సైతం హాజరు కావొద్దని స్పష్టం చేయడంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఫీజు నిధులు ఇవ్వకపోవడంతో...
కన్వీనర్ కోటాలో సీటు సాధించిన పీజీ వైద్య విద్యార్థికి ఏటా రూ.3.5 లక్షల వరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుండగా, బీసీలకు మాత్రం సీలింగ్ పద్ధతిలో రూ.3.5లక్షలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది.
ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత తిరిగి చెక్కుల రూపంలో వెనక్కి తీసుకోవాలని విద్యార్థులకు చెబుతున్నాయి.