సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య మరింత ఖరీదు కాబోతోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ కోర్సుల ఫీజులు భారీగా ఉండగా, మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు అటు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తూనే.. ఇటు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ)కి సైతం విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2023–24 నుంచి 2025–26 మధ్య కాలానికి సంబంధించి ఫీజుల నిర్థారణపై కసరత్తు మొదలుపెట్టిన టీఏఎఫ్‌ఆర్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా మెడికల్ కాలేజీల వారీగా ప్రస్తుతం ఫీజులు, పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది.
కేటగిరీల వారీగా ఫీజులు
మెడికల్ కోర్సులకు సంబంధించి ఫీజులు ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో స్థిరమైన ఫీజులుండగా.. ప్రైవేటు కాలేజీల్లో మాత్రం ఏ, బీ, సీ కేటగిరీల్లో భిన్నమైన ఫీజులు తీసుకుంటున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కేటగిరీ ‘ఏ’ (కన్వీనర్ కోటా) అడ్మిషన్‌కు వార్షిక ఫీజు రూ.60వేలు ఉండగా.. కేటగిరీ ‘బీ’ (మేనేజ్‌మెంట్ కోటా)కి రూ.11.5 లక్షల నుంచి రూ.14.5 లక్షల వరకు ఉంది.
ఇక కేటగిరీ ‘సీ’ (ఎన్నారై కోటా) అడ్మిషన్ ఫీజు రూ.25 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఉంది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేటగిరీ ‘ఏ’కు రూ.7.5లక్షలు, కేటగిరీ ‘బీ’కి రూ.28 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఫీజు ఉంది. బీడీఎస్ కోర్సులకు కేటగిరీ ‘ఏ’లో రూ.45 వేలు, కేటగిరీ ‘బీ’లో రూ.4.2 లక్షలు ఉండగా.. కేటగిరీ ‘సీ’లో రూ.ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంది. వీటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీల వారీగా భిన్నంగా ఉన్నాయి.
ఆడిట్ రిపోర్టులే కీలకం
యూజీ, పీజీ మెడికల్ కోర్సుల ఫీజు పెంపునకు కాలేజీల ఆడిట్ రిపోర్టులే కీలకం కానున్నాయి. టీఏఎఫ్‌ఆర్సీ తాజాగా ప్రతి కాలేజీ ఆడిట్ రిపోర్టును సమర్పించాలని సూచించింది. ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ, ఇతర వ్యయాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒకరకంగా ఉంటే పట్టణ ప్రాంతాల కాలేజీల్లో మరోరకంగా ఉంటాయి. దీంతో కాలేజీ వారీగా ఆడిట్ నివేదికలను పరిశీలించాక ఫీజుల పెంపుపై టీఏఎఫ్‌ఆర్సీ ఒక అంచనాకు వస్తుంది. ఆ మేరకు ఫీజులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆమోదిస్తే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment