
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్‌పై వివాదం తలెత్తింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు.
సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచిచడంతో ఆ విద్యార్థి సెలూన్‌కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.
కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూను తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment