
కాచారంలో ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తున్న భట్టి విక్రమార్క
పండుగ రోజు ప్రజలతో మమేకమైన భట్టి
ఎర్రుపాలెం: ‘మీ అందరికీ విద్యుత్ జీరో బిల్లు వస్తోందా.. పెద్దయ్యా.. నీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా.. అమ్మా.. మీకు వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తున్నాయా?’ అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కాచారం, కొత్త గోపవరం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇళ్లు లేని అర్హులైన పేదలకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భట్టి భరోసా ఇచ్చారు. పొదుపు సంఘంలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ డెయిరీ పథకంలో సబ్సిడీపై గేదెలను ఇస్తామని హామీ ఇచ్చారు. కాచవరం గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా సానుకూలంగా స్పందించారు.
నరసమ్మగారూ.. బాగున్నారా..
ఎర్రుపాలెం మండలం కాచారంలో భట్టి పర్యటన సందర్భంగా స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకురాలిని చూడగానే ‘నరసమ్మ గారూ బాగున్నారా.. ఆరోగ్యం ఎట్లా ఉంది’ అంటూ భట్టి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె ‘నెల రోజుల నుంచి నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటున్నది. సార్ వస్తే నా ఇంటికి తీసుకురమ్మని మన నాయకులకు చెప్పాను. పండుగ రోజున నన్ను చూడడానికి నా ఇంటికి వచ్చి పలకరించినవ్. నాకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ భట్టిని ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురైంది.