
వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?
చిన్నప్పుడు బడిలో సర్ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.
చెట్లు కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లనూ ఫిల్టర్ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.

ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
