
సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.
దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన.
మనవళ్లకు మొక్కల పేర్లు!
వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.
అలసిపోని వనజీవి
ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్‌ఎస్ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.
సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రచార సాధనాలు
ప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.
అవార్డులు, పాఠంగా రామయ్య జీవితం
కోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది.
ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు.


2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ..

