అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
భూపాలపల్లి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త.. అమ్మను బాగా చూసుకో.. అమ్మకు, నీకు తోడుగా, అండగా ఉండాల్సిన సమయంలో మీకు అన్యాయం చేసి తిరిగిరాని లోకానికి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’.. అంటూ ఓ యువరైతు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన నీలాల శేఖర్ (29)తండ్రి రాజయ్య 15 ఏళ్ల క్రితం చనిపోయాడు.
తల్లి వెంకటమ్మ, తమ్ముడు సిద్ధూతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా లేక, పెట్టుబడి కూడా రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శేఖర్.. నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న శేఖర్ ఆదివారం చనిపోయాడు. కాగా, తాను కచ్చితంగా చనిపోతానని భావించిన శేఖర్.. ముందే తీసిన సెల్ఫీ వీడియోలో అప్పుల బాధతోనే పురుగు మందు తాగినట్లు స్పష్టం చేశాడు. అంతకుముందే ఆయన రాసి పెట్టుకున్న లేఖ కూడా బయటికి వచ్చింది. లేఖ, సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment