భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లల్ సినిమాకు దశదిశలా ఖ్యాతిని తెచ్చి పెట్టిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగళ్ (90) ఇకలేరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ముంబైలో స్థిరపడిన బెనగళ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్యామ్ బెనగళ్ కుమార్తె పియా బెనగళ్ వెల్లడించారు.
బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. లెజెండరీ దర్శకుడిగా పేరొందిన శ్యామ్ బెనగళ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో చివరికంటా ఉంది.
శ్యామ్ బెనగళ్( ShyamBenegal) తన సినిమాల్లో శక్తిమంతమైన స్త్రీపాత్రలకు రూపకల్పన చేశాడు. ‘అంకుర్’ (1974)తో మొదలెట్టి ‘జుబేదా’ (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. 1973లో విడుదలైన రెండు సినిమాలు ‘అంకుర్’, ‘గరమ్ హవా’ నవ సినిమాల పతాకాన్ని పట్టుకున్నాయి. అయితే ‘గరమ్ హవా’ తీసిన ఎం.ఎస్.సత్యు ఎక్కువ సినిమాలు చేయలేదు. శ్యామ్ బెనగళ్ నిరంతరం పని చేశాడు. ‘సినిమా కచ్చితంగా సామాజిక మాధ్యమం. అది సమాజాన్ని పట్టించుకోవాల్సిందే. నేను సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతాంగ పోరాటం, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. ప్రజల పక్షం నిలబడాలి సినిమా అనుకున్నాను’ అంటారాయన.
కంటోన్మెంట్ ఏరియాలోని టెంట్ హాలులో వారానికి మూడు ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ తన అన్నయ్యతో కలిసి సినిమాలు తీసేందుకు ప్రయోగాలు చేసిన శ్యామ్ బెనగళ్ యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే పార్లల్ సినిమా అంటే చిత్రోత్సవాల్లో ప్రదర్శించేది కాదు నేరుగా హాల్లో రిలీజ్ చేసి హిట్ చేయదగ్గది అని నిరూపించిన తొలి భారతీయ దర్శకుడు శ్యామ్ బెనగళ్. ‘అంకుర్’ హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటమే ఉదాహరణ. భూస్వాముల దోపిడిని ఆ సినిమాలో చూపి కొనసాగింపుగా ‘నిషాంత్’ తీశాడు బెనగళ్. ఇక ‘మంథన్’ చిన్న మనుషులు ఒక్కటైతే సహకార వ్యవస్థ ద్వారా ఎలా స్వయం సమృద్ధి సాధించ వచ్చో ఆ రోజుల్లోనే తీశాడు బెనగళ్. దీని నిర్మాణానికి పాడిరైతులు తలా రెండురూపాయల వాటా వేయడం నభూతో నభవిష్యతి.
ఎన్నో ప్రయోగాలు:
శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చాడు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలు పోషించదగ్గ నటీమణులుగా గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఔట్‌డోర్‌కు తన యూనిట్‌తో వెళ్లి అక్కడే ఉండిపోయి సినిమా తీసే పరంపరను బెనగళ్ ప్రవేశపెట్టాడు. అందరూ కలిసి ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి మార్గం అంటాడాయన. ఆయన దర్శకత్వ ప్రతిభ తెలిసి కేవలం ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో ‘అనుగ్రహం’లో వాణిశ్రీ నటించింది. వ్యభిచార వ్యవస్థ మీద ‘మండి’, వ్యాపార సామ్రాజ్యాల ఎత్తుగడల మీద ‘కల్‌యుగ్’, గోవాలో పోర్చుగీసు పాలన సమాప్త సమయంలో చెలరేగిన భావోద్వేగాలను ‘త్రికాల్’ లో, నాలుగు కాలాల అంతరంలో ఒక సినీ నాయిక జీవితం, సినిమా జీవితం ఎలా మారిందో చూపిన ‘భూమిక’... ఇవన్నీ ప్రయోగాత్మక కథలు. ‘త్రికాల్’లో రాత్రి సన్నివేశాలు క్యాండిళ్ల వెలుతురులో తీసి ఒక గాంభీర్యం తెచ్చాడు బెనగళ్.
దేశం కోసం:
దేశం కోసం దేశ వాసుల కోసం బెనగళ్ పని చేస్తూనే వెళ్లాడు. ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద తీసిన డాక్యుమెంటరీ ముఖ్యమైనది. ఇక నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ ఖోజ్’ పేరుతో ఇచ్చిన దృశ్యరూపం కష్టతరమైనది. దూరదర్శన్‌లో దీనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ మీద పరిశోధన చేసి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ తీశాడు. ‘మేకింగ్ ఆఫ్ మహాత్మా’కు దర్శకత్వం వహించాడు. జీలాని బానో రాసిన ‘నర్సయ్య కీ బావ్‌డీ’ (నర్సయ్య బావి)ని చాలా కాలం తర్వాత ‘వెల్‌డన్ అబ్బా’గా తీశాడాయన.ఆయన నిష్క్రమణంతో గొప్ప వెలుగు వీడ్కోలు తీసుకున్నట్టయ్యింది.
అవార్డులు...
శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి ‘అంకుర్’(1975), ‘నిశాంత్’(1976), ‘మంథన్ ’(1977), ‘భూమిక: ది రోల్’(1978), ‘జునూన్’(1979), ‘ఆరోహణ్’(1982), ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’(2005), ‘వెల్‌డన్ అబ్బా’ (2009). అలాగే సినీ రంగంలో కనబరచిన అత్యుత్తమ ప్రతిభకుగానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అందుకున్నారు. తెలుగు సినిమా ‘అనుగ్రహం’కు నంది అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment