Shyam benegal
-
Shyam Benegal: శ్యామ్ బెనగళ్‌కు తుది వీడ్కోలు
ముంబై: సీనియర్ సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం ముగిశాయి. జాతీయ పతాకం, పూలమాలలతో కప్పిన ఆయన పారి్థవ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు త్రీ గన్ సెల్యూట్ అనంతరం విద్యుత్ దహన వాటికలో దహనం చేశారు. అనంతరం పూజారులు పూజలు చేశారు. బెనగళ్‌కు కడసారి వీడ్కోలు పలికిన వారిలో భార్య నీరా, కుమార్తె పియాతోపాటు సినీ రంగానికి చెందిన నసీరుద్దీన్ షా, రంజిత్ కపూర్, కుల్‌భూషణ్ కర్బందా, ఇలా అరుణ్, గుల్జార్, జావెద్ అక్తర్, బొమన్ ఇరానీ, కునాల్ కపూర్ ఉన్నారు. ఈ సందర్భంగా నటుడు నసీరుద్దీన్ షా..‘శ్యామ్ సాహబ్, నేను, నా సర్వస్వం మీవే. మీకు రుణపడి ఉన్నాను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను’అంటూ ఉది్వగ్నం చెందారు. సినీ నిర్మాత గోవింద్ నిహలానీ కూడా తనేమీ మాట్లాడలేకపోతున్నానన్నారు. ‘14న 90వ బర్త్‌డేనాడు బెనగళ్ సార్ ఆఫీసుకు వెళ్లి బర్త్‌డే పాట పాడాం. గతంలో ఎప్పుడూ మేం ఆయనకు పుట్టిన రోజు వేడుక చేయకపోవడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. త్వరలోనే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే ఆయన చివరి చూపవుతుందని అస్సలు ఊహించలేదు’అని దర్శకుడు శ్యామ్ కౌశల్ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ రంగంలో బెనగళ్ విప్లవం సృష్టించారు. మళ్లీ మరొకరు అలాంటిది చేయలేకపోయారు’అని సినీ రచయిత గుల్జార్ పేర్కొన్నారు. శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. -
ముంబయిలో దర్శకుడు శ్యామ్ బెనెగల్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
భారతీయ చిత్రసీమలో ఆయనొక లెజెండ్ : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగళ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘భారతీయ చిత్రసీమలో ఒక లెజెండ్ శ్యామ్ బెనగల్(Shyam Benegal). చిత్ర నిర్మాణానికి ఆయన చేసిన కృషి లక్షలాది మంది దర్శకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. శ్యామ్ బెనగల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.Deeply saddened by the passing of Shyam Benegal Ji, a legend in Indian cinema. His contributions to filmmaking continue to inspire millions of directors. May his soul rest in peace. pic.twitter.com/mw92JPkZFV— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2024హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్ బెనెగల్.. ఎన్నో కళాత్మకచిత్రాలను(Art Films) తెరకెక్కించారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నిన్న(డిసెంబర్ 23, 2024) సాయంత్రం 6గంటల 38నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బెనెగల్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ.శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో పూర్తయ్యాయి. -
#Shyam Benegal శారదకు దక్కని అంకుర్.. షబానాను వరించింది!
ఓల్డ్ అల్వాల్ పోరడు– బి. నరసింగ రావు, దర్శకులుశ్యామ్ బెనగళ్ (Shyam Benegal) కూ నాకూ 12 ఏళ్ల వయసు తేడా ఉంది. ఆయనకు 90 అయితే నాకు 78. మా ఓల్డ్ అల్వాల్‌లో వాళ్ల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. గతంలో శ్యామ్ అన్నయ్య మధు అందులో ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. కనిపించడం లేదు. శ్యామ్ చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ల నాన్నకు ఫొటో స్టుడియో ఉండేది. అందులో మేము చిన్నప్పుడు ఫొటోలు దిగేవారం. శ్యామ్ చాలా యాక్టివ్. నిజాం కాలేజీలో (Nizam College) మేగజీన్ ఎడిటర్‌గా ఉండేవాడు. ఫిల్మ్ సొసైటీ నడిపాడు. సైకిల్ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చాక ఫ్రెష్ అయ్యి వెంటనే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకునేవాడు ఆటలకు. గురుదత్ ఆయనకు కజిన్. బాంబే వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలంటే చార్జీలకు కూడా డబ్బులు లేవు. అప్పుడు మా మిత్రుల్లో అమ్రేష్ అనే అతని అన్న రైల్వేలో ఉండేవాడు. అతను పాస్ ఇస్తే వెళ్లాడు. గురుదత్ ఇంట్లోనే ఉండి సినిమాలు తెలుసుకున్నాడు. ‘అంకుర్’ (Ankur) కథలో హీరోకు మా మిత్రబృందంలోని ఒక వ్యక్తి జీవితమే ఇన్స్పిరేషన్. ‘నీ కథే తీస్తున్నానురా’ అని ఆ మిత్రుడికి చెప్పి మరీ ఆ సినిమా తీశాడు. ఆఫ్కోర్స్... సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసుకున్నాడు. తన నిర్మాణ సంస్థకు ‘సహ్యాద్రి ఫిల్మ్స్’ అని పేరు పెట్టుకున్నాడు. సత్యం శంకరమంచి కథలను దూరదర్శన్ కోసం తీస్తున్నప్పుడు నన్ను కలిశాడు. వాటి నిర్మాణంలో నా మాటసాయం ఉంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆఖరుసారి మాట్లాడాను. ఆ తర్వాత మాట్లాడలేదు. చాలా క్వాలిటీతో ఎక్కువ పని చేసిన దర్శకుడు శ్యామ్. శారదకు మిస్సయిన ‘అంకుర్’ శ్యామ్ బెనగళ్ తన మొదటి సినిమా ‘అంకుర్’లో హీరోయిన్గా వహీదా రెహమాన్‌ను (Waheeda Rehman) అనుకున్నాడు. ఆమె మొదట చేస్తానని తర్వాత నో చెప్పింది. అప్పుడు శారదకు ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుందని ఆమెను సంప్రదించాడు. ఆమెకు కథ నచ్చినా, దక్కనీ భాషలో డైలాగులు చెప్పగలనో లేదో అనే సందేహంతో చేయలేదు. అపర్ణసేన్ కూడా వెనుకా ముందు ఆడటంతో చివరకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన షబానా ఆజ్మీని ఎంచుకున్నాడు. షబానాకు ఒకరకంగా హైదరాబాద్‌తో బంధం ఉన్నట్టే కదా. ఆమె తల్లి షౌకత్ హైదరాబాదీ. షబానా, స్మిత, నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రిష్‌పురి... వీరంతా బెనగళ్ సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించారు.సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్యామ్ బెనగళ్ నివాసం ప్రస్తుత స్థితి -
స్త్రీ పాత్రల రూపశిల్పి శ్యామ్ బెనగళ్.. అల్విదా!
భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లల్ సినిమాకు దశదిశలా ఖ్యాతిని తెచ్చి పెట్టిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగళ్ (90) ఇకలేరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ముంబైలో స్థిరపడిన బెనగళ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్యామ్ బెనగళ్ కుమార్తె పియా బెనగళ్ వెల్లడించారు. బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. లెజెండరీ దర్శకుడిగా పేరొందిన శ్యామ్ బెనగళ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో చివరికంటా ఉంది.శ్యామ్ బెనగళ్( ShyamBenegal) తన సినిమాల్లో శక్తిమంతమైన స్త్రీపాత్రలకు రూపకల్పన చేశాడు. ‘అంకుర్’ (1974)తో మొదలెట్టి ‘జుబేదా’ (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. 1973లో విడుదలైన రెండు సినిమాలు ‘అంకుర్’, ‘గరమ్ హవా’ నవ సినిమాల పతాకాన్ని పట్టుకున్నాయి. అయితే ‘గరమ్ హవా’ తీసిన ఎం.ఎస్.సత్యు ఎక్కువ సినిమాలు చేయలేదు. శ్యామ్ బెనగళ్ నిరంతరం పని చేశాడు. ‘సినిమా కచ్చితంగా సామాజిక మాధ్యమం. అది సమాజాన్ని పట్టించుకోవాల్సిందే. నేను సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతాంగ పోరాటం, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. ప్రజల పక్షం నిలబడాలి సినిమా అనుకున్నాను’ అంటారాయన. కంటోన్మెంట్ ఏరియాలోని టెంట్ హాలులో వారానికి మూడు ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ తన అన్నయ్యతో కలిసి సినిమాలు తీసేందుకు ప్రయోగాలు చేసిన శ్యామ్ బెనగళ్ యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే పార్లల్ సినిమా అంటే చిత్రోత్సవాల్లో ప్రదర్శించేది కాదు నేరుగా హాల్లో రిలీజ్ చేసి హిట్ చేయదగ్గది అని నిరూపించిన తొలి భారతీయ దర్శకుడు శ్యామ్ బెనగళ్. ‘అంకుర్’ హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటమే ఉదాహరణ. భూస్వాముల దోపిడిని ఆ సినిమాలో చూపి కొనసాగింపుగా ‘నిషాంత్’ తీశాడు బెనగళ్. ఇక ‘మంథన్’ చిన్న మనుషులు ఒక్కటైతే సహకార వ్యవస్థ ద్వారా ఎలా స్వయం సమృద్ధి సాధించ వచ్చో ఆ రోజుల్లోనే తీశాడు బెనగళ్. దీని నిర్మాణానికి పాడిరైతులు తలా రెండురూపాయల వాటా వేయడం నభూతో నభవిష్యతి.ఎన్నో ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చాడు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలు పోషించదగ్గ నటీమణులుగా గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఔట్డోర్కు తన యూనిట్‌తో వెళ్లి అక్కడే ఉండిపోయి సినిమా తీసే పరంపరను బెనగళ్ ప్రవేశపెట్టాడు. అందరూ కలిసి ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి మార్గం అంటాడాయన. ఆయన దర్శకత్వ ప్రతిభ తెలిసి కేవలం ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో ‘అనుగ్రహం’లో వాణిశ్రీ నటించింది. వ్యభిచార వ్యవస్థ మీద ‘మండి’, వ్యాపార సామ్రాజ్యాల ఎత్తుగడల మీద ‘కల్యుగ్’, గోవాలో పోర్చుగీసు పాలన సమాప్త సమయంలో చెలరేగిన భావోద్వేగాలను ‘త్రికాల్’ లో, నాలుగు కాలాల అంతరంలో ఒక సినీ నాయిక జీవితం, సినిమా జీవితం ఎలా మారిందో చూపిన ‘భూమిక’... ఇవన్నీ ప్రయోగాత్మక కథలు. ‘త్రికాల్’లో రాత్రి సన్నివేశాలు క్యాండిళ్ల వెలుతురులో తీసి ఒక గాంభీర్యం తెచ్చాడు బెనగళ్.దేశం కోసం:దేశం కోసం దేశ వాసుల కోసం బెనగళ్ పని చేస్తూనే వెళ్లాడు. ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద తీసిన డాక్యుమెంటరీ ముఖ్యమైనది. ఇక నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ ఖోజ్’ పేరుతో ఇచ్చిన దృశ్యరూపం కష్టతరమైనది. దూరదర్శన్‌లో దీనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ మీద పరిశోధన చేసి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ తీశాడు. ‘మేకింగ్ ఆఫ్ మహాత్మా’కు దర్శకత్వం వహించాడు. జీలాని బానో రాసిన ‘నర్సయ్య కీ బావ్డీ’ (నర్సయ్య బావి)ని చాలా కాలం తర్వాత ‘వెల్డన్ అబ్బా’గా తీశాడాయన.ఆయన నిష్క్రమణంతో గొప్ప వెలుగు వీడ్కోలు తీసుకున్నట్టయ్యింది. అవార్డులు... శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి ‘అంకుర్’(1975), ‘నిశాంత్’(1976), ‘మంథన్ ’(1977), ‘భూమిక: ది రోల్’(1978), ‘జునూన్’(1979), ‘ఆరోహణ్’(1982), ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’(2005), ‘వెల్డన్ అబ్బా’ (2009). అలాగే సినీ రంగంలో కనబరచిన అత్యుత్తమ ప్రతిభకుగానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అందుకున్నారు. తెలుగు సినిమా ‘అనుగ్రహం’కు నంది అవార్డు అందుకున్నారు. -
భాగ్యనగర్ కా బెనగళ్..
సాక్షి, హైదరాబాద్: విఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్‌కు నగరంతో విడదీయరాని అనుంబంధం ఉంది. ఆయన చదువు ఇక్కడే కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కళాశాల నుంచి ఆరి్థక శాస్త్రంలో శ్యామ్ బెనగళ్ పట్టభద్రుడయ్యాడు. అదే సమయంలో ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. నాన్నే తొలి గురువు... నగరంలో ఉండగానే తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు శ్యామ్ బెనగళ్. ఆయన తండ్రి నగరంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ప్రాచుర్యం పొందాడు. ఖాళీ సమయాల్లో ఆయన 16 ఎంఎం కెమెరాతో తన పిల్లలతోనే సినిమాలను షూట్ చేసేవారు. ఆయన దగ్గర ఈ సినిమాల భారీ కలెక్షన్ ఉంది. శ్యామ్ బెనగళ్ది పెద్ద కుటుంబం. ఆయనతో కలిపి పది మంది పిల్లలు. ‘నాకు మా నాన్న తొలిగా సినిమా గురించి అవగాహన కల్పించారు. మా డిన్నర్ తర్వాత వినోదం.. మా నాన్న రూపొందించిన చిత్రాలను చూడటమే. సినిమాతో నా ప్రమేయం అలా మొదలై చివరికి నన్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్‌గా మార్చింది’ అంటూ శ్యామ్ బెనగళ్ గుర్తు చేసుకునేవారు. తన తండ్రికి చెందిన 16 ఎంఎం సినిమా కెమెరాతో వేసవి సెలవుల్లో తన అన్నదమ్ములు, కజిన్లు కలిసినప్పుడు తాను తీసిన ‘చుటియో మే మౌజ్ మజా (సెలవుల్లో వినోదం, ఆటలు)’ తన మొదటి సినిమాగా ఆయన పేర్కొంటారు. కంటోన్మెంట్ ఏరియాలో... సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో తాము నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఆర్మీ గ్యారీసన్‌లో సినిమా ప్రదర్శనలు ఉండేవనీ, ప్రధానంగా సైన్యం కోసం ఉద్దేశించిన ఆ ప్రదేశంలో వారాంతంలో ఆంగ్ల భాషా చిత్రంతో పాటు, వివిధ భారతీయ భాషలలోని చలనచిత్రాలు ప్రదర్శించేవారని ఆయ న తన చిన్ననాటి స్మృతులను నెమరేసుకునేవారు. అనుబంధం..అపురూపం... ‘హైదరాబాద్ నా జన్మభూమి’ అని శ్యామ్ బెనగళ్ సగర్వంగా చెప్పేవారు. తాను జని్మంచిన నగరం గురించి ‘నేను ఇక్కడ పెరిగాను, నా పాఠశాల కళాశాల ఇక్కడే. ఇక్కడ మరే ఇతర ప్రదేశంలో లేని విశిష్టమైన స్వభావం, మిశ్రమ సంస్కృతి దీని సొంతం’ అంటూ కొనియాడేవారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిజాం కాలేజ్‌లో చదువుకున్న తాను ప్రస్తుతం పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘విశ్వవిద్యాలయం ఇప్పటికీ గొప్పగా ఉంది, కానీ అక్కడ రాజకీయ ప్రమేయం పెరిగింది’ అంటూ ఆయన తాను చదువుకున్న ఉస్మానియా గురించి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం తీస్తానన్నారు... తన సినిమాలపై తెలంగాణ ప్రభావం గురించి మాట్లాడుతూ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘అంకుర్, నిషాంత్, మండి చిత్రాలపై ఈ ప్రాంత ప్రభావం ఉందని బెనగళ్ అనేవారు. తెలంగాణ నేపథ్యంలో మరొక కథ దొరికితే, తాను ఖచి్చతంగా దాన్ని కూడా సినిమాగా మలుస్తాను అంటూ ఈ రాష్ట్రంపై ప్రేమను చాటేవారాయన. అనుగ్రహం అనే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన బెనగళ్‌కు తెలుగు మాట్లాడటం అంతగా రాదు.‘నాకు తెలుగు బాగా అర్థం అవుతుంది కానీ మాట్లాడటం కొంచెం కష్టమవుతుంది’ అనేవారు. తాను హైదరాబాద్‌ను విడిచిపెట్టి 50 సంవత్సరాలకు పైనే అవుతున్నా, ఈ సిటీపై ఇష్టానికి దూరం కాలేదంటారు. ‘ఇది సినిమా క్రేజీ సిటీ. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. చాలా మంది మంచి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ ఉన్నారు’ అంటూ కొనియాడేవారు. ఆయన ఇప్పుడు లేకున్నా..ఆ మంచి దర్శక నిర్మాతలకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందనేది వాస్తవం. -
సమాంతర సినిమా సృష్టికర్త శ్యామ్ బెనగళ్
శ్యామ్ బెనగళ్– ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకి తెలిసి ఉండవచ్చు. కానీ సినిమాలు తెలిసి ఉండక పోవచ్చు. భారతీయ సినిమా భాషా భేదాలు లేకుండా కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో ప్రవాహానికి ఎదురీదిన వాడు, సమాంతర (పారలల్ ) సినిమాకి ఊపిరి పోసిన వాడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ళ శ్యామ్ సుందర రావు. సికింద్రాబాద్‌లో డిసెంబరు 14, 1934న జన్మించారు. సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు ఈ భూమి మీద బతికారు. భారతీయ సినిమా రంగంలో ఇకపై ఎన్ని వందల ఏళ్ళు శ్యామ్ బెనగళ్ జీవించి ఉంటారనేది చరిత్ర చెబుతుంది. తెలంగాణ– ఆయనకి ఊహ తెలిసేటప్పటికి ఇంకా నిజాం పాలనలోనే ఉంది. అప్పటి దొరల దౌర్జన్యాలు, పెత్తందారీతనాలు– అట్టడుగు ప్రజల, ముఖ్యంగా స్త్రీల కన్నీటి కథలు– శ్యామ్ బెనగళ్ గుండెలపై చెరగని జ్ఞాపకాలు అయ్యాయి. అందుకే తన మొదటి సినిమా అంకుర్ – ఇదే తెలంగాణ నేపథ్యంలో తీశారు. అప్పటిలో నిజాం రాజ్యంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలు కలిసి ఉండేవి. ఈ మూడుప్రాంతాల సంస్కృతులు, నేపథ్యాలు – శ్యామ్ బెనగళ్ని వెంటాడాయి. యాడ్ ఏజన్సీ లో కాపీ రైటర్‌గా కెరీర్‌ని ఆరంభించినా – ఆయన దృష్టి సినిమాల మీదే ఉండేది . కమర్షియల్ సినిమాల ప్రభంజనంలో – ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా– జీవితాన్ని – సమాజం లోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు శ్యామ్. హైదరాబాద్‌లో ఫిలిమ్ సొసైటీప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకుని, సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారు. తెలిసిన జీవితాలు, చూసిన సినిమాలు శ్యామ్ బెనగళ్ ఆలోచనల్లో పారలల్ సినిమా ప్రపంచాన్ని çసృష్టించాయి . కొత్త కథలు చెప్పాలి, జనం మస్తిష్కాలు కదిలించాలని శ్యామ్ బెనగళ్లో ‘అంకుర్’ సినిమాతో భారతీయ సినిమా తెరపై తన సంతకాన్ని పెట్టారు.1978–1980 మధ్య తెలుగు సినిమా అడవి రాముడు నుంచి శంకరాభరణం సినిమాల మధ్య బాక్సాఫీస్ ఊయలలు ఊగుతుండగా, ఓ బ్రహ్మాండమైన మలుపు తిరగబోయి ఆగిపోయింది. సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కొందరు– శ్యామ్ బెనగళ్, మృణాల్ సేన్, గౌతమ్ ఘోష్ – తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, ఆమోదానికి ఫిదా అయ్యారేమో తెలియదు కానీ – హిందీలో కాకుండా తెలుగులో పారలల్ సినిమాలు తీశారు. ‘మా భూమి’ అంటూ గౌతమ్ ఘోష్ అత్యద్భుతమైన సినిమాలు అందించారు. వీరి మధ్యలో శ్యామ్ బెనగళ్ మరాఠీ నవల ఆధారంగా తెలుగులో ‘అనుగ్రహం’ సినిమా తీశారు. తెలుగుతో పాటు హిందీలో ఇదే కథతో కొండూర– టైటిల్‌తో పారలల్‌గా తీశారు. రెండింటిలో అప్పటి అగ్ర కథానాయిక వాణిశ్రీ హీరోయిన్. అనంత్ నాగ్ హీరో . స్మితా పాటిల్ తెలుగులో నటించిన సినిమా ఇదే! అలాగే అమ్రేష్ పురి జగదేక వీరుడు – అతిలోక సుందరి మొదలైన వాటి కన్నా చాలా చాలా ముందు తెలుగులో నటించిన సినిమా అనుగ్రహం. తెలుగులో ఆరుద్ర, గిరీష్ కర్నాడ్‌తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు శ్యామ్ బెనగళ్. ఆరుద్ర మాటలు– పాటలు రాశారు. రావు గోపాలరావు గుర్తుండి పోయే పాత్ర చేశారు. అయితే శ్యామ్ బెనగళ్ చెప్పిన కథా విధానం అప్పటి ప్రేక్షకులకి రుచించ లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అభిరుచి ఉన్న ప్రేక్షకులు అంకుర్, నిషాంత్ , మంథన్ , భూమిక – ఏ ఫిలిమ్ సొసైటీల్లో చూపిస్తారా అని తిరుగుతుండేవారు. సగటు ప్రేక్షకులేమో ఈయనేంటి – వేరే కథలు చెబుతున్నారు – మనకి తెలియని జీవితపు కోణాలు పట్టుకుంటున్నారు అని డిస్ట్రబ్ అవుతుండే వారు. ఎదిగిన కొద్దీ ప్రేక్షకులకు శ్యామ్ బెనగళ్ను ఇంకొంచెం అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి , లాంటి గొప్ప నటుల్ని కనుగొన్న కొలంబస్ – శ్యామ్ బెనగళ్. ముఖ్యంగా మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శ్యామ్ బెనగళ్ దూరదర్శన్ కోసం తీసిన సీరియల్ ఎప్పటికీ గుర్తుంచు కోదగ్గది. ముస్లిమ్ మహిళల జీవితాలను çస్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు రూపొందించారు. కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ – మహా భారతాన్ని ఓ బిజినెస్ సామ్రాజ్యానికి అన్వయిస్తూ శశి కపూర్ తీయించిన ‘కలియుగ్’ శ్యామ్ బెనగళ్ ప్రయోగం. 23 డిసెంబర్ 2024న కన్ను మూశారు శ్యామ్ బెనగళ్. కన్ను మూసినా ఆయన ఆలోచనల్లో తీరని కలలు చెప్పని కథలు ఏమున్నాయో మనకి తెలియదు. కానీ కొత్త తరం రచయితలు, దర్శకులు శ్యామ్ బెనగళ్ స్ఫూర్తితో ఏ కొత్త సినిమాని పరిచయం చేస్తారోనని ఎదురు చూద్దాం. – తోట ప్రసాద్, సినీ రచయితసంతాపంసువర్ణాధ్యాయం ముగిసిందిభారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లోని ఓ సువర్ణాధ్యాయం శ్యామ్‌బెనగళ్ మరణంతో ముగిసింది. కొత్త తరహా సినిమాలనుప్రారంభించి, క్లాసిక్ సినిమాలను రూపొందించారు. నిజమైన ఇన్స్టిట్యూషన్కు ఆయన ఓ నిదర్శనం. ఎందరో కళాకారులను, నటులను తీర్చిదిద్దారు. సినిమా పరిశ్రమకు శ్యామ్ బెనగళ్ చేసిన సేవలు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారంతో సహా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఎంతోమంది ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతీవ్రంగా బాధించిందిశ్యామ్ బెనగళ్ గారి మరణం తీవ్రంగా బాధించింది. ఆయన కథలు ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆయన ప్రతిభ ఎప్పటికీ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత ప్రధానమంత్రి నరేంద్రమోదిఫిలిం మేకర్స్‌కు స్ఫూర్తిసమాంతర సినిమాకు నిజమైన మార్గదర్శకుడు, ఆలోచింపజేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు బెనగళ్. 18 జాతీయ చలన చిత్ర అవార్డులతో సహా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్, దాదాసాహెబ్ఫాల్కే అవార్డులను అందుకున్నారు. ఆయన చరిత్ర ఫిల్మ్‌మేకర్స్‌కు స్ఫూర్తినిస్తుంది. – కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేభావితరాలకు ప్రేరణవిజనరీ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగళ్ గారి మరణవార్త బాధిస్తోంది. సినిమాల్లో అద్భుతంగా సాగిన ఆయన ప్రయాణం, సామాజిక అంశాలపై అంకితభావంతో ఆయన చేసిన సినిమాలు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయి. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీసాంస్కృతిక సంపదమన దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్‌మేకర్, మేధావి అయిన శ్యామ్ బెనగళ్గారి మరణం నన్ను బాధించింది. సినిమా రంగంలోని ప్రతిభావంతులను గుర్తించి, ్రపోత్సహించారు. ఆయన తీసిన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారతదేశ సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయి. సహచర హైదరాబాదీ వాసి, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన బెనగళ్గారి అద్భుతమైన చిత్రాలు, భారతీయ సినిమాలో ఎప్పటికీ మన్ననలు పొందుతూనే ఉంటాయి. – చిరంజీవి -
ఆయన సినిమాలు మనదేశ సంస్కృతిలో భాగం: డైరెక్టర్ మృతి పట్ల మెగాస్టార్ సంతాపం
ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. మనదేశంలో అత్యుత్తమ డైరెక్టర్లలో ఆయన ఒకరని కొనియాడారు. ఆయన సినిమాలు, డాక్యుమెంటరీలు మనదేశం గొప్ప సంస్కృతిని తెలుపుతాయంటూ ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన శ్యామ్ బెనెగల్ సాబ్ రచనలు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మెగాస్టార్ పోస్ట్ చేశారు.డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి..సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. Deeply saddened at the departure of Shri Shyam Benegal,one of the finest film makers and great intellectuals of our country. He discovered & nurtured some of the brightest film talents of India. His films, biographies and documentaries form part of India’s greatest cultural…— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2024 -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.అనేక అవార్డులు- ప్రశంసలుదాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్-2005పద్మశ్రీ -1976పద్మ భూషణ్-1991ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం- 2003ఏఎన్నార్ జాతీయ అవార్డ్-2013నిశాంత్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు -1976మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు- 1977జునూన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు -1980 -
రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రికి వెళ్లలేని స్థితిలో నటుడు!
'ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత శ్యామ్ బెనగల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతడి రెండు కిడ్నీలు పాడైపోవడంతో నటుడు ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఆయన శరీరం సహకరించడం లేదు' అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై శ్యామ్ బెనగల్ కూతురు పియా స్పందించింది. అదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేసింది. ఆయన బాగానే ఉన్నారని, కాకపోతే కొంత బ్రేక్ తీసుకుని ఆఫీసుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. ఆ మాత్రం దానికే కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ అని రాసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. కాగా 88 ఏళ్ల వయసున్న శ్యామ్ బెనగల్.. అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక, జుబేదా, వెల్కమ్ టు సజ్జన్‌పూర్ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నంది, ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు 18 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్యామ్ బెనగల్ చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2005లో ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 1976లో పద్మ శ్రీ అవార్డు అందజేసింది. శ్యామ్ బెనగల్‌కు సొంతంగా సహ్యాద్రి ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. తను తీసిన సినిమాల ఆధారంగా ద చర్నింగ్ విత్ విజయ్ టెండుల్కర్, సత్యజిత్ రే, ద మార్కెట్‌ప్లేస్ అనే మూడు పుస్తకాలు రాశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ మొదటి ప్రధాని షైక్ ముజ్బర్ రెహమాన్ జీవిత కథ ఆధారంగా ముజీబ్: ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. -
గ్రామీణ భారతానికి క్షీరాభిషేకం
‘మంథన్’ పేరుతో ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ 1976లో ఒక సినిమా తీశారు. మంథన్ అంటే అర్థం – చిలకడం. గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లోని ఐదు లక్షల మంది రైతులు దీనికి పెట్టుబడి పెట్టారు. పెట్టుబడే కాదు, ఇతివృత్తం కూడా ఆ పాడి రైతులదే. సినిమా 1976లో విడుదలైంది. తమ కథను వెండితెర మీద చూడడానికి ఆ ప్రాంత ప్రజలు ట్రాక్టర్లు పెట్టుకుని, బళ్లు కట్టుకుని వేలాదిగా వెళ్లి చూసి వచ్చారు. పాడి రైతుల గాథతో వెలువడిన ఆ సినిమాకు అవార్డుల పంట పండింది. తమ జీవితాలే ఆధారంగా, తాము ఇచ్చిన డబ్బులతో తీసిన చిత్రం. అంటే ప్రతి రైతు నిర్మాతే. దీని ఇతివృత్తం ప్రపంచ ప్రఖ్యాత ‘అమూల్’ సంస్థ విజయ గాథ. ఆ సంస్థ లదొక్కుకోవడానికీ, ఒక మహోన్నత విజయం సాధించడానికీ కారకుడే వర్గీస్ కురియన్, ఇంతకీ కురియన్ ప్రతి సభ్యుడిని పెట్టుమన్న పెట్టుబడి కేవలం రెండు రూపాయలు. సంఘటితమైతే వచ్చే సత్ఫలితం ఎంత నిర్మాణాత్మకంగా ఉంటుందో ఆ సినిమా తెలియ చెప్పింది. కైరా జిల్లా (గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇది ఉంది) పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ నమోదు చేసిన ఈ విజయ గాథ కేవలం వెండితెర మీదే కాదు, ప్రపంచానికే విభ్రమ గొలిపేటట్టు ఉంటుంది. కథా రచనలో బెనెగల్‌తో పాటు, ఆ సంస్థ అధిపతి వర్గీస్ కురియన్ కూడా తోడ్పడ్డారు. తెర మీద నడిచిన కథలో హీరో ఎవరైనా, ఆ అద్భుతగాథకు అసలు హీరో వర్గీస్ కురియన్. ‘లండన్‌లోని మురికి నీరు కన్నా, బొంబాయిలోని పాలు మరింత కలుషితమైనవి’– 1942–43 సంవత్సరంలో లండన్‌లోని ఒక ప్రయోగశాల తేల్చి చెప్పిన సంగతిది. నాణ్యమైన పాల కోసమే కాదు, ఉత్పత్తిని పెంచడానికి కూడా అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం పాల కమిషనర్‌ను నియమించవలసి వచ్చింది. భారత పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన సత్యం మరొకటి ఉంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన పాల ఉత్పత్తి 155.5 మిలియన్ టన్నులు. రోజుకు పాల తలసరి లభ్యత 337 గ్రాములు. ఇప్పుడు పాల ఉత్పత్తిలో అగ్రస్థానం భారతదేశానిదే. అలాంటి అగ్రస్థానంలో దేశం నిలబడి చాలా కాలమే అయింది కూడా. ఆ పాల అల ఉత్థానపతనాలు నిజంగా ఒక అద్భుతం. ఒక చరిత్ర. ఇది మూడు దశాబ్దాలలో సాధించి చూపినవారే డాక్టర్ వర్గీస్ కురియన్ (నవంబర్ 26, 1921– సెప్టెంబర్ 9, 2012). తొమ్మిది మంది ప్రధానులను శాసించి తన నాయకత్వంలోని రైతుల సంస్థ కోసం పనులు చేయించారాయన. ప్రథమ ప్రధాని నెహ్రూ ఆయనను కౌగలించుకుని ‘కురియన్! మన దేశంలో నీలాంటి వాళ్లు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. అంతా కురియన్ను శ్వేత విప్లవ పితామహుడు అంటారు. పాల వెల్లువ ఆయన పథకమే. ఇంకా ఎందరో ముద్దుగా ‘పాలల్లో మసిలే మొసలి’ అని కూడా అంటూ ఉండేవారు. ‘భారతదేశ పాల రాజధాని’ని సృష్టించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. కురియన్ మాత్రం రైతాంగ సాధికారత కోసమే పాటు పడ్డానని సవినయంగా చెప్పేవారు. ఈ సమీప గతంలో కనిపించే అద్భుతమైన, అరుదైన వ్యక్తి వర్గీస్. దక్షిణ భారతంలోని కేరళలో, కాలికట్లో పుట్టారు. ఆ సిరియన్ క్రైస్తవ కుటుంబంలోని వారంతా ఉన్నత విద్యావంతులే. తండ్రి పుతేన్ పరక్కల్ సర్జన్. తల్లి పియానో విద్వాంసురాలు. ఒకప్పుడు కేంద్రంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన జాన్ మత్తయ్ వీరి సమీప బంధువే. కురియన్ పట్టువదలని విక్రమార్కుడు. మంచి సాంకేతిక నిపుణుడు. మార్కెటింగ్ వ్యూహకర్త. దేనినైనా కొత్తగా ఆలోచించే తత్వం కలిగినవారు. వీటితో పాటు గొప్ప మానవతావాది. బెనెగల్ వంటి దర్శకుడు కథా రచనలో కురియన్ సాయం తీసుకున్నారంటే ఇక ఆయన సృజనాత్మక సామర్థ్యం కూడా గట్టిదేనని చెప్పాలి. నిజమే, ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. ఆనంద్ అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి రాసుకున్న ఆత్మకథ ‘ఐ టూ హ్యాడ్ ఏ డ్రీమ్’ (తెలుగు: నాకూ వుంది ఒక కల. అను: డాక్టర్ తుమ్మల పద్మిని, డాక్టర్ అత్తలూరి నరసింహారావు). చాలామంచి రచన. ఎక్కడి కేరళ! ఎక్కడి గుజరాత్! అక్కడ నుంచి ముంబై–ఢిల్లీ జాతీయ రహదారి పక్కనే, నలభయ్ కిలోమీటర్ల దూరంలో ఉండే ఆనంద్ అనే చిన్న పట్టణానికి వచ్చారాయన. స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అక్కడ డెయిరీ వ్యవహారాలు చూడడానికి ప్రభుత్వం ఆయనను పంపించింది. ఆనంద్ తన జీవిత గమ్యమని ఆయన ఆ క్షణంలో ఊహించలేదు. ఆ చిన్న పట్టణానికి ఆయన చేరుకున్న రోజు శుక్రవారం. కురియన్ను ఆయన కార్యాలయానికి తీసుకువెళ్లిన వ్యక్తి, ఆ రోజు మంచిది కాదు కాబట్టి, మరునాడు విధులలో చేరమని సలహా ఇచ్చాడు. అందుకు కురియన్ ఇచ్చిన సమాధానం, ‘మంచిది కాదా! అయితే ఇవాళే చేరతాను. ఇక్కడ ఉండకూడదన్న నా ఆశ తీరుతుందేమో!’ అనే. అలా చెప్పిన కురియన్ కొన్ని దశాబ్దాల పాటు అక్కడే ఉండిపోయారు. పాడి పరిశ్రమ నిర్వహణ గురించి చదువుతానని విద్యార్థి వేతనం తీసుకుని కురియన్ న్యూయార్క్ (మిచిగాన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి) వెళ్లారు. కానీ అక్కడ చదువుకున్నది– మెటలర్జీ, న్యూక్లియర్ ఫిజిక్స్. తిరిగి వచ్చాక, విద్యార్థి వేతనం తీసుకున్నారు కనుక, నిబంధనల మేరకు ప్రభుత్వ ఆదేశంతో ఆనంద్‌కు వచ్చారు. మనసు పడి మాత్రం కాదు. కేవలం మొక్కుబడి. కానీ అప్పటికే అక్కడ పాడిరైతులను కూడగడుతున్న జాతీయ కాంగ్రెస్ నాయకుడు త్రిభువన్దాస్ పటేల్ విన్నపం మేరకు ఉండిపోయారు. న్యూయార్క్ వంటి మహా నగరం నుంచి, చక్కని వసతిని అనుభవించి దాదాపు అరవై ఏళ్ల క్రితం నాటి భారతదేశంలో ఒక చిన్న పట్టణానికి వచ్చిన వ్యక్తికి ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో, కురియన్ అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా కొన్ని అదనపు కష్టాలు వచ్చి పడ్డాయి. క్రైస్తవుడు కాబట్టి ఇల్లు ఇవ్వలేదు. శాకాహారానికి ప్రాధాన్యం ఇచ్చే గుజరాత్లో మాంసాహారికి ఇల్లు లభించడం కూడా కష్టమైంది. ఇలాంటి అభ్యంతరాలు లేనివాళ్లు ఆయన అప్పటికి బ్రహ్మచారి కాబట్టి ఇవ్వలేదు. చివరికి ఒక కారు షెడ్డులో ఆయన ఉద్యోగ జీవితం ఆరంభించారు. ఆనంద్‌లో ఉన్న ప్రభుత్వ క్రీమరీలో గేదె పాల నుంచి కొద్దిగా పాలపొడిని ఉత్పత్తి చేయడమే ఆయన ఉద్యోగం. కానీ ఎవరూ సహకరించేవారు కాదు. అయినా ఒక్కరు చేసే పనికోసం ఇరవై మందిని మాత్రం నియమించారు. అయినా అక్కడి ప్రజలను ఆయన ద్వేషించలేదు. ఆ పరిస్థితులను ఈసడించుకోలేదు. కానీ ఒకటి. ఇలాంటి చోట పనిచేయడం వల్ల తను చదువుకున్నదంతా ఒట్టిపోతుందని బెంగపడ్డారు. ప్రజాధనం అప్పనంగా తింటున్నానన్న న్యూనత మరొకటి. అందుకే తన రాజీనామాను ఆమోదించవలసిందని ప్రభుత్వాన్ని కోరారు. ఎనిమిది నెలలకు ఆమోదం లభించింది కూడా. అయితే అప్పటికే కురియన్ ఆ క్రీమరీ పక్కనే ఉన్న కైరా పాల సహకార సంస్థ సభ్యులతో కొంచెం అనుబంధం ఏర్పరుచుకున్నారు. దాని నాయకుడే త్రిభువన్దాస్ పటేల్. ఆయన కోరికపైనే ఎన్నో ఇక్కట్టు పడుతూ తమ పాల ఉత్పత్తులను మధ్య దళారీలకు అమ్ముకుంటున్న రైతుల కోసం పాటు పడడం మొదలుపెట్టారు. అప్పుడు సర్దార్ పటేల్, ఆయన అనుచరుడు మొరార్జీ దేశాయ్‌లు ప్రోత్సహిస్తున్నా ఆ సంస్థ అష్టకష్టాలు పడుతోంది. త్రిభువన్ పటేల్ సర్దార్ పటేల్ అనుయాయి. కైరా పాల సహకార సంస్థకు మరోపేరే అమూల్. ‘అమూల్య’ పదం నుంచి వచ్చింది. కైరా పాల సహకార సంస్థ అని పలకడం ఇబ్బందిగా ఉందికాబట్టి మరో పేరు పెట్టాలని కురియన్ భావించారు. అంతే, తన బృందంలో అమూల్ అని పేరు పెడదామన్నారు. అది ఆ సహకార సంస్థలో పనిచేస్తున్న అమూల్య అని కెమిస్ట్‌ను చూసి ఎవరో పైకి అన్న పేరు. అదే బావుందన్నారు కురియన్. ఇలా మొదలైన సంస్థ బహుళజాతి సంస్థలు నెస్లే గ్లాస్కో సంస్థలతో దీటుగా ఉత్పత్తులు చేసేటట్టు, మార్కెట్లో నిలబడేటట్టు చేశారు కురియన్. అప్పటిదాకా ఆవు పాల నుంచే పాలపొడి తీయగలమని ప్రపంచ దేశాలు నమ్మకం. ఆ దేశాలలో ఆవులు ఎక్కువ. కాబట్టి అంతకు మించి వారి ఆలోచన సాగలేదు. నిజానికి మన దేశంలో గేదెలు ఎక్కువ. అందుకే కురియన్ గేదె పాల నుంచి కూడా తీయవచ్చునని నిరూపించారు. ఇదొక ఘన విజయం. దేశీయంగా ఆలోచించడం ఎలాగో ఈ ఉదాహరణ నుంచి నేర్చుకోవచ్చు. మన దేశానికి సంబంధించి మరో వాస్తవాన్ని వెల్లడించిన ఆలోచనాపరులలో కురియన్ కూడా ఒకరు. ‘దురదృష్టవశాత్తు భారతదేశానికి పెద్ద మూలధనం అక్కడి ప్రజలే అనే విషయం మర్చిపోయాం. ఏ మాత్రం ఇంగితజ్ఞానం ఉన్న ప్రభుత్వమైనా కచ్చితంగా నేర్చుకోవలసింది– ప్రజల శక్తియుక్తులని, సామర్థ్యాలని ఉపయోగించుకుంటూ వాళ్లనే మమేకం చెయ్యడం’ అన్నారాయన.ఇంత పెద్ద ప్రయాణం కురియన్ నల్లేరు మీద నడకలా సాగించారని మన దేశ పరిస్థితులు చూసిన వారు ఎవరూ నమ్మలేరు. నిజం కూడా అదే. సహోద్యోగులు, నిపుణులు, రాజకీయ నాయకులు ఆయనను ఇరుకున పెట్టిన సంఘటనలు ఎన్నో. నేను నేర్చుకున్న గొప్ప పాఠం ఒకటి ఉందంటూ ఆయన ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు. ‘ఈ నిపుణుల సాంకేతిక సలహాలన్నీ తరచూ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక ప్రయోజనాలకి అనుగుణంగా ఉంటాయే కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకీ, వాస్తవ పరిస్థితులకీ అనుగుణంగా ఉండవు’ అన్నారాయన. కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమంటే ఇదే! తను ఎంత ఎత్తుకు ఎదిగినా క్షేత్రస్థాయిలోని వాస్తవికతను మరచిపోకుండా, గమనించుకుంటూ, అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఉండే గొప్ప లక్షణం కొందరికే ఉంటుంది. ఈ ఘటనను పరిశీలిస్తే కురియన్లో అలాంటి గొప్ప లక్షణం ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. డెయిరీలో పని తీరును గమనించేందుకు కురియన్ నిత్యం కాలినడకన తిరుగుతూ ఉండేవారు. ఆయన వస్తున్నట్టు అందరికీ తెలిసేది. కానీ ఒకరోజు అలాంటి సూచనలు ఏమీ ఇవ్వకుండానే ఆయన డెయిరీలోకి ప్రవేశించారు. అక్కడ కోల్డ్ స్టోరేజీ దగ్గర బాగా గెడ్డాలు, మీసాలు పెరిగి ఉన్న వ్యక్తి మీగడను ఆబగా తినడం కనిపించింది. చూసినందుకు కురియన్, పట్టుబడినందుకు ఆ గెడ్డాల మనిషి తత్తరపడ్డారు. అతడు తత్తరపడుతూ తాను ఏమీ తినలేదని అబద్ధం ఆడి వెళ్లిపోయాడు. కురియన్ వెనుదిరిగి వచ్చేశారు. ఆ మరునాడే అక్కడ పనిచేసే వారికి రోజూ అర లీటరు వంతున పాలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు కురియన్. వాళ్ల కళ్ల ముందు లక్షల లీటర్ల పాలు ఉంటాయి. కడుపులో ఆకలి ఉంటుంది. కానీ వాటిని తాగే అవకాశం వాళ్లకి లేదు. ఇది గమనించారు కాబట్టే కురియన్ ఈ ఆదేశాలు ఇచ్చారు.భారతదేశంలో ప్రతిభకు, సేవకు తగిన గుర్తింపునకు నోచుకున్న అరుదైన కొద్దిమందిలో కురియన్ ఒకరు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణŠ పురస్కారాల వరకు ఆయనకు అందాయి. ప్రపంచం కూడా ఆయన సేవలను గుర్తించింది. దాని ఫలితమే రామన్ మెగసెసె పురస్కారం. ఆయన దేశాన్ని ప్రేమించారు. దేశం కూడా ఆయన్ని ప్రేమించింది. -
సెన్సార్... సెన్సార్!
ఉన్న సెన్సార్ బోర్డును ఏం చేయాలో, కొత్త బోర్డు ఏర్పాటు చేస్తే దాని నియమ నిబంధనల తీరెలా ఉండాలో నిర్ణయించబోతున్నారని చాన్నాళ్లుగా వినబడుతోంది. శ్యాం బెనెగళ్ నేతృత్వంలో అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడం పూర్తయి కూడా ఏడాది గడుస్తోంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం రేపో మాపో తుది నిర్ణయం వెలువరించవచ్చునని చెబుతున్నారు. ఈలోగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీ యధావిధిగా తన దోవన తాను ‘కట్...కట్’ అంటూ చలనచిత్ర పరి శ్రమనూ, డాక్యుమెంటరీ నిర్మాతలనూ ఠారెత్తిస్తున్నారు. మరోపక్క కొన్ని పార్టీలూ, బృందాలూ సెన్సార్ బాధ్యతల్ని తమకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారన్నట్టు రెచ్చిపోతు న్నాయి. చిత్రాన్ని ముందుగా మాకు చూపించి, మేం ఓకే అన్నాక సెన్సార్ బోర్డుకు పంపుకోవాలని నిర్మాతలనూ, దర్శకులనూ బెదిరిస్తున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ఘనంగా చెప్పుకునేచోట భావ ప్రకటనా స్వేచ్ఛకు అధికార, ప్రైవేటు బృందాల నుంచి ఈ స్థాయిలో అవరోధాలు ఎదురుకావడం విస్మయం కలిగిస్తుంది. ఇతర కళారూపాల్లాగే సినిమా అనేది కూడా ఒక కళా రూపం. పైగా అది సమాజాన్ని ప్రభావితం చేయగల బలమైన సాధనం. దానికి ఆంక్షల సంకెళ్లు వేయడమే తన కర్తవ్యమన్నట్టు సెన్సార్‌బోర్డు వ్యవహరిస్తోంది. సీబీఎఫ్‌సీకి ఎందుకనో సెన్సార్ బోర్డు అనే మాట స్థిరపడిపోయింది. అలాగని ఆ బోర్డు నిజంగా అదే పని చేస్తున్నదన్న నమ్మకం కలగదు. కొన్ని చిత్రాల విషయంలో ఎంతో ‘విశాల దృక్పథాన్ని’ ప్రదర్శించి ఉదారంగా ధ్రువీకరణను అందజేసే బోర్డే... కొన్నిటి విషయంలో ఎక్కడలేని కారణాలనూ చూపి అడ్డుకుం టుంది. చాదస్తపు వాదనలతో చికాకు పెడుతుంది. ప్రభుత్వాలు మారినా, బోర్డుకు కొత్త వారొచ్చినా దాని పనితీరు మారదు. ఈమధ్యే నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌పై నిర్మాణమైన ‘ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’ డాక్యుమెంటరీపై నిహలానీ కత్తిగట్టారు. ‘హిందూ ఇండియా’, ‘ఆవు’, ‘గుజరాత్’లాంటి పదాలను దాన్నుంచి తీసేయాలని తీసేయాలని హుకుం జారీచేశారు. ఈ డాక్యుమెంటరీని నిర్మించిన సుమన్ ఘోష్ గతంలో తీసిన పలు చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నాయి. అమర్త్యసేన్తో ఆయన పూర్వ విద్యార్థి, అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన కౌశిక్ బసు జరిపిన సంభాషణను తీసు కుని ఈ డాక్యుమెంటరీ రూపకల్పన చేశారు. అమర్త్యసేన్ అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. ఆ అభిప్రాయాలతో ఏకీభవించేవారున్నట్టే వాటితో తీవ్రంగా విభేదించేవారున్నారు. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీలో ఆయన వాడిన పదాల్ని కొత్తగా తొలగించినంత మాత్రాన సెన్సార్ బోర్డు సాధించేదేముంటుంది? అత్య వసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీరుతెన్నులు, దాని నియం తృత్వ ధోరణులు ఇతివృత్తంగా మాధుర్ భండార్కర్ నిర్మించిన ‘ఇందూ సర్కార్’ కు కూడా సెన్సార్ బోర్డు డజను కత్తిరింపులు చెప్పి ఆయన్ను అయోమయంలో పడేసింది. ‘లిప్‌స్టిక్ అండర్ మై బురఖా’, ‘జబ్ హారీ మెట్ సెజాల్’ చిత్రాలకు కూడా ఈ గతే పట్టింది. సెన్సార్ బోర్డు తీరుపై నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నిస్తే నిహలానీ చిత్రమైన జవాబిస్తున్నారు. తమ సినిమాలకు ప్రచారం లభించాలన్న యావతో కొందరు నిర్మాతలు ఇలా చేస్తున్నారని ఆయన వాదన! నిజానికి నిర్మాతలు చెబుతున్న సమస్య మరో రకమైనది. సెన్సార్ బోర్డు పెట్టే ఇబ్బందుల గురించి నోరెత్తినవారిని ‘బ్లాక్ లిస్ట్’లో పెట్టి అలాంటివారి తదుపరి చిత్రాలకు కూడా లేనిపోని అవరోధాలు కల్పిస్తున్నారని వారు చెబుతున్నారు. వీటి గురించి నిర్మాత ఎవరికి చెప్పుకోవాలి? ఈ బోర్డును నియమించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పెద్దరికం వహించి ఏమైనా చెబుతుందనడానికి లేదు. కశ్మీర్ అశాంతిపైనా, నిరుడంతా జవహర్లాల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న నిరసనలపైనా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేములపైనా నిర్మించిన డాక్యుమెంటరీలపై ఆ మంత్రిత్వ శాఖ వ్యవహరిం చిన తీరు చూస్తే ఆ నమ్మకం కలగదు. గత నెలలో కేరళలో డాక్యు మెంటరీలు, చిన్న కథా చిత్రాల అంతర్జాతీయోత్సవం జరిగినప్పుడు ఈ మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనకూ ఆ శాఖ అనుమతి నిరాకరించింది. నిరుడు కూడా ఇలాగే రెండు చిత్రాలకు అనుమతి నిరాకరిస్తే ఒక నిర్మాత కేరళ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నాడు. విపక్షంలోని కాంగ్రెస్ ఈ సెన్సార్షిప్ను ప్రశ్నిస్తుందని ఆశపడక్కర్లేదు. అధి కారం కోల్పోయి మూడేళ్లవుతున్నా దానికి ఆ మత్తు దిగిన జాడలేదు. ‘ఇందూ సర్కార్’ చిత్రాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు చిత్ర నిర్మాత, దర్శకులను బెదిరిస్తున్నారు. మాధుర్ భండార్కర్ నిర్వహించబోయిన మీడియా సమావేశాలను వారు రెండుసార్లు అడ్డుకున్నారు. ఎమర్జెన్సీ పేరిట దేశంలో 21 నెలలపాటు నియంతృత్వాన్ని అమలుచేసి వేలాదిమందిని జైళ్లలో కుక్కి, వందలమంది ప్రాణాలు తీసినందుకు ఆ పార్టీ కనీసం క్షమాపణలు చెప్పే సంస్కారాన్నయినా ప్రదర్శించలేకపోయింది. ఆనాటి స్థితిగతులపై చిత్రం వస్తే మాత్రం అభ్యంత రమట! జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నవే ఇలా ఉంటే తమ కులాన్ని కించ పరిచారని, మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ వీరంగం వేసే ఛోటా నేతల గురించి చెప్పుకోవాల్సింది ఏముంటుంది? తమతో ఏకీభవించని ఆలోచనలనూ, అభిప్రాయాలనూ అడ్డగించడం... పీక నొక్కాలని చూడటం అనాగరికం. ఆ పని సెన్సార్ బోర్డు చేసినా, వీధి రౌడీలు చేసినా ఖండించాల్సిందే. సెన్సార్ బోర్డు తీరుతెన్నులెలా ఉండాలో సూచిస్తూ శ్యాం బెనెగెళ్ కమిటీ నివేదిక ఇచ్చి ఏడా దవుతోంది. ఆ సిఫార్సుల ఆధారంగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు బిల్లు తెస్తారని, సెన్సార్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలు చాలామటుకు పోతాయని చెబుతున్నారు. ఆ ముసాయిదా బిల్లు త్వరగా రూపుదిద్దుకుని, దానిపై సమగ్ర చర్చ జరిగి మెరుగైన విధానాలు అమల్లోకి వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు. -
సెన్సార్ బోర్డు చైర్మన్ ను మార్చనున్నారా?
న్యూఢిల్లీ: ఇటీవల ఉడ్తా పంజాబ్ సినిమా సెన్సార్ విషయంలో వివాదంలో చిక్కుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)లో పెను మార్పులు చేసేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్న పహ్లజ్ నిహ్లానీని తొలగించి ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ను నియమించనున్నారని తెలుస్తోంది. ఒక టీవీ ఇంటర్వూలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ త్వరలోనే సెన్నార్ బోర్డులో పెను మార్పులు జరుగనున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్ నిహ్లానీ నేను మోడీ చెంచానని బాహాటంగా ప్రకటించడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
సెన్సార్ బోర్డు సంస్కరణకు శ్యామ్ బెనగళ్ కమిటీ
- సీబీఎఫ్సీ నిబంధనల మార్పు, మెరుగైన సూచనల కోసం కమిటీ ఏర్పాటుచేసిన కేంద్రం న్యూఢిల్లీ: కనీసం సినిమా రూపకర్తల వివరణ కోరకుండా ఏకపక్షంగా కట్ చెప్పడాలు, సినిమాలకు సర్టిఫికేషన్ల జారీలో భారీ అవకతవకలు, సభ్యుల మధ్య ఏకాభిప్రాయలేమి తదితర వివాదాలతో గందరగోళంగామారి ఇటు సినీరంగం అటు ప్రభుత్వానికి తలనొప్పిగామారిన నెన్సార్ బోర్డు ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సమాయత్తమయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ) లేదా సెన్సార్ బోర్డు ప్రక్షాళనకు ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. సృజనాత్మక రంగంగా భావించే సినీరంగంలో సినీమా రూపకర్తలు, సెన్సార్ బోర్డుకు మధ్య సుహ్రుద్భావ వాతావరణం నెలకొల్పాటంటే ఏం చెయ్యాలి? ఫిలిం సర్టిఫికేషన్ జారీలో ఇప్పుడున్నవాటికంటే ఎలాంటి మెరుగైన విధానాలు రూపొందించాలి? తదితర కీలక అంశాలపై బెనగళ్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఇందుకోసం వివిధ దేశాల్లో అమలవుతున్న ఫిలం సర్టిఫికేషన్ల విధానాన్ని కూడా పరిశీలించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, పియూష్ పాండే, భావన సోమయ్య, నైనా లాథ్ గుప్తాలు నియమితులయ్యారు. జనవరి 2 నుంచి రెండు నెలల లోగా కమిటీ తన పనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై శ్యామ్ బెనగళ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం మేరకు కేంద్రం.. నెన్సార్ బోర్డు నిబంధనలను పునారచన చేయాలనుకుంటున్నదని, తమకు అప్పగించిన బాధ్యతను సకాలంలో నిర్వర్తిస్తామని చెప్పారు. బోర్డులో వివాదాలు ముదరటంతో 2014లో నాటి సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శ్యాంసన్ సహా 13 మంది సభ్యుల రాజీనామాలు చేశారు. గత ఏడాది ప్రారంభంలో పహలాజ్ నిహలానీ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి బోర్డు తీరు మరింత వివాదాస్పదంగా మారింది. పలువురు సినీ రూపకర్తలు బాహాటంగా సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీబీఎఫ్ సీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. -
'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ దిగ్గజాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేదిక మీదనుంచి రోజుకో వార్త సంచలనం సృష్టిస్తుండగా తాజాగా... లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనగల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన సినిమాలలో కథానాయికగా నటించిన స్మితాపాటిల్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు బెనగల్. స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది అంటూ కితాబిచ్చాడు. స్మిత, శ్యాం బెనగల్ రూపొందించిన మండీ, భూమిక, మంతన్, నిశాంత్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. శ్యాం మాటల్లో చెప్పాలంటే 'కెమరా ఆమెను ప్రేమించింది, ఆమె సహజ నటి, ఏ పాత్రలోకైన సునాయాసంగా ఒదిగిపోతుంది. మన ప్రేమేయం లేకుండానే ఆమె మన కథలో భాగమైపోతుంది.' స్మితతో పాటు తన సినిమాల్లో కథానాయికగా నటించిన షబానా అజ్మీని కూడా ప్రశంసించాడు శ్యాం బెనగల్. ' తొలిసారిగా క్యారెక్టర్ కోసం ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్యర్యపోయా, షబానా అజ్మీ ప్రొఫైల్ కూడా చూడటం మానేసి ఆమెనే చూస్తూ ఉండిపోయా. ఆ సమయంలోనే అంకుర్ సినిమాలో లక్ష్మీ నా కళ్లకు కనిపించింది.' అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. -
సెన్సార్‌బోర్డు అవసరమా?
ముంబై: జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దుదృశ్యం తొలగింపు వివాదం లో సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహలానీపై బాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 సెకన్ల సీన్‌ను 8 సెకన్లకు మార్చినంత మాత్రాన భారతదేశ నీతికి, సంస్కృతికి జరిగిన లాభమేంటో తెలపాలని బజరంగీ భాయ్‌జాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ ప్రశ్నించారు. అసలు సెన్సార్‌షిప్‌నే తొలగించాలని దర్శకుడు శ్యామ్ బెనగల్ డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై నిహలానీ స్పందిస్తూ.. నిబంధనల మేరకే అన్నీ చేస్తున్నామని.. ఎవరైనా అది తప్పని భావిస్తే.. పదవినుంచి తప్పుకునేందుకు సిద్ధమన్నారు. -
మన భూమి... జన సినిమా...
మూడున్నర దశాబ్దాల క్రితం సంగతి... తెలుగు సినిమా ఒక బాక్సాఫీస్ గిరి గీసుకొని, ఆ బరిలోనే ఆడాలని వెండితెరను నిర్దేశించడం మొదలైన రోజులవి. తెలుగు హీరో ‘అడవి రాముడై’, కలెక్షన్ల ‘వేటగాడు’గా మారాక, 3 ఫైట్లు... 6 పాటల ఫార్ములాతో ప్రేక్షకుల్ని పంచరంగుల్లో ఊహాలోక విహారం చేయిస్తున్న సమయం. అప్పుడు ఎవరైనా లక్షలు ఖర్చుపెట్టి, నిజజీవితాన్నీ, మన చరిత్రనూ బ్లాక్ అండ్ వైట్‌లో చూపే సాహసం చేస్తారా? గౌతవ్‌ు ఘోష్ దర్శకత్వంలో ‘మాభూమి’ చిత్రం ద్వారా నిర్మాతలు జి. రవీంద్రనాథ్, బి. నరసింగరావు ఆ పనే చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో 1980 మార్చి 23న రిలీజైన ఆ సినిమా స్థల, కాలాల పరిధులను దాటి గుండెను మండించిన సినిమా... మనసును బరువెక్కించిన సినిమా... ఇప్పటికీ తెరపై... తడి ఆరని నెత్తుటి గాయం. సినిమా నెగటివ్ పాడై, అందుబాటులో లేకుండా పోవడంతో, ఈ చిత్రాన్ని ఇటీవలే డిజిటలైజ్ చేశారు. సినిమా రిలీజై రేపు సోమవారంతో 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, చాలాకాలంగా అందుబాటులో లేని ‘మా భూమి’ని తొలిసారిగా బ్లూరే డి.వి.డి.గా ఇవాళ జనానికి అందుబాటులోకి తెస్తున్నారు నిర్మాతలు. ఆ సందర్భంగా విశ్వజనీన విప్లవ పోరాట చిత్రం ‘మా భూమి’ నిర్మాణ యజ్ఞంపై ఒక విహంగ వీక్షణం... - రెంటాల జయదేవ దర్శక ప్రముఖుడు మృణాల్‌సేన్‌ను ఒప్పించి, నవయుగ ఫిలిమ్స్ వారు తీసిన ‘ఒక ఊరి కథ’ (1977) తెలుగుతెరపై నవ్యచిత్రాల ధోరణికి నాంది అనవచ్చు. ఆ తర్వాత శ్యామ్‌బెనెగల్ దర్శకత్వంలో ‘అనుగ్రహం’ వచ్చింది. ఆ కాలఘట్టంలోనే దాశరథి రంగాచార్య నవల ‘చిల్లర దేవుళ్ళు’ ఆధారంగా అదే పేరుతో సినిమా (1975) వచ్చింది. తెలంగాణ భాషతో స్థానికతను ప్రతిబింబిస్తూ తయారైన తొలి చిత్రంగా దీన్ని పేర్కొంటారు. అయితే, ఇవేవీ వాణిజ్య విజయం సాధించలేదు. ఆ పరిస్థితుల్లో ‘మా భూమి’ చిత్ర నిర్మాణ ప్రయత్నం మొదలైంది. అప్పటికి పాతికేళ్ళ క్రితపుసమకాలీన చరిత్రను ప్రతిఫలిస్తూ, రైతాంగ పోరాటాన్ని సినిమాగా తీయడం సాహసమే! కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన బెంగాలీయుడు గౌతమ్ ఘోష్ పక్కా తెలుగు వాతావరణంలోని ఈ చిత్రాన్ని రూపొందించడం విచిత్రం. మూడేళ్ళు నిర్మాణంలో ఉన్న ‘మా భూమి’ని పూర్తి చేసేనాటికి స్వతహాగా మార్కిస్టు భావాలున్న ఘోష్ వయసు 29 ఏళ్ళే. కథ వెనుక కథ ఇదీ! హైదరాబాద్ సంస్థానం నిజామ్ ఏలుబడిలో ఉంటూ, భారత యూనియన్‌లో విలీనం కాక ముందు 1948 పూర్వపు తెలంగాణ జీవిత దృశ్యాన్ని ‘మా భూమి’ తెరపై చూపింది. ప్రసిద్ధ అభ్యుదయ రచయిత కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే చిన్న నవల ఈ చిత్రానికి మూలం. సినిమా తీయాల్సిందిగా కోరిన బి. నరసింగరావు, జి. రవీంద్రనాథ్లకు ఘోష్ ఆ నవలికను సూచించారు. వాళ్ళూ సరిగ్గా ఈ నవలిక దగ్గరే ఆగారు. అప్పటికే ఆ ఉర్దూ రచన తెలుగులో ‘జైత్రయాత్ర’ (‘పొలాలు మేల్కొన్నప్పుడు’ అనేది ఉప శీర్షిక, అనువాదకుడు పోలు శేషగిరిరావు)గా వచ్చింది. పోరుతో ప్రత్యక్ష పరిచయం లేనప్పటికీ, మిత్రుల ద్వారా సేకరించిన సమాచారంతో కిషన్ చందర్ ఆ నవలిక రాశారు. ఆ రచన ఆధారంగా ఘోష్ స్క్రిప్టు చేశారు. అయితే, జనజీవితానికీ, చరిత్రకూ దగ్గరగా ఉండేలా చారిత్రక విషయాల్ని జోడించారు. స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేయడంలో బి. నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, పార్థూ బెనర్జీలు ఘోష్‌కు వెన్నుదన్నయ్యారు. అలా చివరకు వచ్చేసరికి, ‘మా భూమి’ స్క్రిప్టులో నవలా మాతృకలోని మూల కథ తప్ప, మిగిలినదంతా జనజీవిత ఘటనలకు అద్దం పట్టిన కొత్త అల్లికే. నిర్మాణం... ఒక యజ్ఞం స్క్రిప్టు స్థల కాలాల ప్రకారం విద్యుత్ సౌకర్యం కూడా లేని పల్లెలో కథ జరిగినట్లు చూపాలి. అందుకోసం మంగల్‌పర్తి గ్రామాన్ని ఎంచుకున్నారు. అది నరసింగరావు అత్తగారి ఊరే. అక్కడ కరెంట్ కాదు కదా, కనీస వసతులు కూడా కరవే. యూనిట్ మొత్తం చిన్న బడిలో బస చేసింది. బాత్రూమ్ వసతైనా లేని ఆ ఊళ్ళో బావి దగ్గరే స్నానాదికాలు! రాత్రయితే, దోమలతో కుస్తీ. మహిళల కోసం మాత్రం ఊళ్ళో పెద్దల ఇళ్ళను వినియోగించుకున్నారు. షూటింగ్లో అయ్యే గాయాలకు రోజుకో టించర్ సీసా ఖాళీ అయ్యేదంటే, ఎన్ని కష్టాలు పడ్డారో ఊహించుకోవచ్చు. ‘మా భూమి’లో ఎక్కువమంది ఔత్సాహికులైన కొత్తవాళ్లు... రంగస్థల నటులే. పోరాట సన్నివేశాల కోసం పెద్ద సంఖ్యలో జనం కావాలి కాబట్టి, గ్రామంలోని స్థానికులను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. వర్షాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిత్రీకరణకు చాలా ఇబ్బందులే వచ్చాయి. అయినా సరే, నిర్మాతలు ఆస్తులు తాకట్టుపెట్టి మరీ, పట్టుదలగా నడిచారు. సినిమా అంతా పూర్తయినా, చిత్ర నిర్మాణం, విడుదలలో భాగస్వాములుగా పంపిణీదారుల మాటే చెల్లిన ఆ రోజుల్లో సినిమా విడుదలకూ ఎవరూ ముందుకు రాలేదు. అయితే, సారథీ స్టూడియోతో, ‘మృగయా’, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’ చిత్రాల నిర్మాణంతో అనుబంధమున్న నిర్మాత జి. రవీంద్రనాథ్‌కు ఉన్న పరిచయాలు ఒక మేరకు ఉపయోగపడ్డాయి. కెరీర్లో ఒక కొండగుర్తు ఎన్ని కష్టాలు పడినా, ఎందరో కళాకారులకు ఈ సినిమా ఎనలేని తృప్తినిచ్చింది. ‘‘నటజీవితంలో చాలాపాత్రలు పోషించినా, నా వరకు నాకు ఈ సినిమా ప్రత్యేకమైంది. విప్లవ సిద్ధాంతం పట్ల ఇష్టమున్న నాకు ఈ చిత్రం వృత్తిగతంగానే కాక, సైద్ధాంతికపరంగా వ్యక్తిగతంగా కూడా ఎనలేని సంతృప్తినిచ్చింది’’ అని నటుడు కాకరాల చెప్పారు. గౌతమ్ ఘోష్‌కు పెళ్ళయిన కొత్త రోజులవి. ఆయన భార్య నీలాంజనా ఘోష్ ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్. నటుడు జగ్గయ్య కంచుకంఠంతో చెప్పిన వ్యాఖ్యానం మరో హైలైట్. ఈ సినిమాతోనే సాయిచంద్, ‘తెలంగాణ’ శకుంతల, భూపాల్ రెడ్డి (‘కొమరం భీమ్’ ఫేమ్) పరిచయమయ్యారు. తెలుగువారు గర్వించే చిత్రకారుడు తోట వైకుంఠం కళాదర్శకత్వం వహించారు. ఆయనకూ ఇదే తొలి సినిమా అనుభవం. ప్రముఖ కవి దేవీప్రియ ‘మా భూమి’కి పబ్లిసిటీ ఇన్ఛార్జ్. ప్రముఖ చిత్రకారుడు గోపి డిజైన్లు చేశారు. బండెనక బండ్లు కట్టి.. వచ్చిన జనం అయితే, చిత్ర నిర్మాణంలో, విడుదలలో అష్టకష్టాలు పడిన ‘మా భూమి’ రిలీజ్‌కు ముందే మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ‘ఫిల్మోత్సవ్’లో ప్రీమియర్ జరుపుకొని, వార్తల్లో నిలిచింది. సినిమా రిలీజయ్యాక మునుపటి ఇబ్బందులన్నీ నిర్మాతలు మర్చిపోయేలా ఊహించని స్పందనొచ్చింది. జనాదరణతో పాటు ప్రింట్లు, కేంద్రాలు పెరిగాయి. కేవలం ఉదయం ఆటలుగా ప్రదర్శించిన ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎంలో ఏడాది పాటు ఆడింది. నిత్య చైతన్యదీప్తి... నిరంతర పోరాటస్ఫూర్తి చిత్రం ఏమిటంటే, స్థానికత నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆ హద్దును చెరిపేసి, విశ్వజనీనతను సంతరించుకుంది. కమ్యూనిస్టు భావజాలానికి కేంద్రంగా వెలిగిన విజయవాడలో సైతం అప్సర థియేటర్లో ఈ చిత్రం 100 రోజుల పైగా ప్రదర్శితమైంది. ఖమ్మం నుంచి జనం విజయవాడ వచ్చి, సినిమా చూసివెళ్ళేవారు. విశాఖలోనూ అదే ఆదరణ. ‘బండెనక బండి గట్టి...’ పాట వస్తే, హాలులో జనం లేచి నృత్యం చేసేవారు. అప్పుడే కాదు... ఇటీవల కూడా ‘సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్’ టీవీ చానల్ జరిపిన ఓ సర్వేలో దేశంలోని 100 అత్యుత్తమ సినిమాల్లో ‘మాభూమి’కి చోటు దక్కింది. ఒక్కమాటలో... తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని నక్సల్బరీ అందుకొని, కొనసాగుతున్నప్పుడు వచ్చిన ఈ సినిమా 1948 నాటి గతచరిత్రతో పాటు, చిత్రనిర్మాణం జరిగిన 1970ల నాటి సమకాలీన చరిత్రకూ సెల్యులాయిడ్ సింబల్! కాకరాల అన్నట్లు, ‘‘సాయుధ పోరు దన్ను లేకుండా కింది తరగతి జీవితాలకు న్యాయం జరగదని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే, సమూలమైన మార్పు కోరుకొనే సందర్భం వచ్చినప్పుడల్లా ‘మాభూమి’కి ప్రాధాన్యం, ప్రాసంగికత ఉంటూనే ఉంటాయి.’’ అలా పీడితులందరికీ ఇది ‘మన సినిమా... జన సినిమా’. నల్గొండ జిల్లా సిరిపురం గ్రామం. పేద రైతు వీరయ్య (కాకరాల). అతని కొడుకు రామయ్య (సాయిచంద్). భూస్వామి జగన్నాథరెడ్డి (ప్రసాదరావు), కొడుకు ప్రతాపరెడ్డి (ప్రదీప్‌శక్తి) అకృత్యాలకు అంతుండదు. యుక్తవయస్కుడైన రామయ్య, చంద్రిని (హంస)ను ప్రేమిస్తాడు. భూస్వాముల చేతుల్లో చంద్రి అత్యాచారానికి గురవుతుంది. మరోపక్క గ్రామంలో ‘సంఘం’ ఏర్పడి, భూస్వామిపై తిరుగుబాటు చేస్తుంది. రామయ్య సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. ఇంతలో దేశానికి స్వాతంత్య్రం వస్తుంది. కానీ, గ్రామజీవితంలో మార్పు లేదు. నిజామ్కు తొత్తులుగా పనిచేసిన దొరలు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. సైనికుల దాడిలో చివరకు రామయ్య సహా చాలామంది వీరమరణం పొందుతారు. పీడకులే కొత్త వేషాల్లో పెత్తనం చేసే స్థితిని వెండితెరపై వెక్కిరిస్తుందీ చిత్రం. భూమి కోసం, భుక్తి కోసం, పీడన నుంచి విముక్తి కోసం జనంలో కాకున్నా, వనంలో నుంచైనా పోరు సాగుతూనే ఉంటుందని విప్లవ చైతన్యదృష్టితో ముగుస్తుంది. ప్రజాగీతాల ప్రతిధ్వని ప్రజాపోరాట చిత్రమైన ‘మా భూమి’ పాటలూ జనజీవితంలోవే. ‘బండెనక బండికట్టి..’ అనే పాట నిజామ్ వ్యతిరేక పోరాటంలో బండి యాదగిరి చేసిన రచన. ఆ పాటను ఈ సినిమాలో వాడారు. నిజజీవితంలో ఆ పాటను విస్తృతంగా పాడుతూ వచ్చిన విప్లవ వీరుడు గద్దర్‌తోనే సినిమాలోనూ ఆ పాట పాడించారు. గద్దర్ మీదే చిత్రీకరించారు. అలా గద్దర్ తొలిసారి తెరపై కనిపించారు. ‘పల్లెటూరి పిల్లగాడ... పసులగాసే మొనగాడా...’ అనే పాట ప్రజాకవి సుద్దాల హనుమంతు (సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ తండ్రి) రచన. ‘జననాట్యమండలి’ సంధ్య గొంతులో వింటే గుండె బరువెక్కుతుంది.‘పొడల పొడల గట్ల నడుమ...’ నిజామాబాద్ నుంచి సేకరించిన పాట. కె.బి.కె. మోహన్‌రాజు పాడారు. సందర్భానుసారంగా తెలంగాణ ప్రాంత స్థానిక ఉత్సవాలనూ, అక్కడ పాడే పాటలనూ తెరపై చూపించారు. జానపద గాయని సీత (వింజమూరి సిస్టర్స్‌లో ఒకరు) సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని సారథీ స్టూడియో దొరక్క, మ్యాక్స్‌ముల్లర్ భవన్ లైబ్రరీలో ఒకే రోజులో రికార్డు చేశారట. ఇక, నేపథ్య సంగీతం దర్శకుడే చేసుకున్నారు. మద్రాస్‌లో రీరికార్డింగ్‌కు సినీసంగీత దర్శకుడు బి. గోపాలం వాద్యగోష్ఠి నిర్వహించారు. ‘‘హీరో పాత్రకు నా కన్నా ముందు పలువురిని అనుకున్నా, చివరకు కొత్తవాడినైన నన్ను తీసుకున్నారు. నేను షాకయ్యా. కానీ,‘‘నువ్వు చెయ్యగలనని నమ్మకంగా ఉండు. నీతో ఆ పాత్రను నేను చేయించుకుంటా’’ అని గౌతమ్‌ఘోష్ ఉత్సాహపరిచారు. నరసింగరావు కూడా నన్నెంతో గైడ్ చేశారు. ఈ చిత్రంలో నేను, నా తండ్రి పాత్రతో ‘ప్రజల కోసం పాటుపడే దాని కన్నా మంచి బతుకేముంటుందయ్యా?’ అంటా. ఆ డైలాగ్ నా జీవితంపై బలంగా ముద్ర వేసింది.’’ - సాయిచంద్, ‘మా భూమి’ చిత్ర కథానాయకుడు ‘‘జననాట్యమండలి’ స్థాపకుల్లో ఒకడిగా నాది మొదటి నుంచి విప్లవ పోరాట పంథా. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేశాక బయటకొచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనివేళ మిత్రుడు రవీంద్రనాథ్ ద్వారా సినిమా వైపొచ్చా. అక్కడా విప్లవ పంథాలోనే వెళ్ళాలనీ, తెలంగాణ పోరాట నేపథ్యాన్ని చూపాలనీ భావించా. అలా ‘మాభూమి’ తీశాం. లక్ష అనుకున్న బడ్జెట్ రూ.5.3 లక్షలైంది. మా ఇల్లు, బంగారం తాకట్టు పెట్టా. సెన్సార్‌కు డబ్బుల్లేకపోతే, సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్ళి ఉంగరం తాకట్టు పెట్టారు. ఆ కష్టాల్ని మరపిస్తూ, సినిమా రిలీజయ్యాక ప్రతిచోట జనం పాటలకి డ్యాన్స చేయడం మర్చిపోలేను.’’ - బి. నరసింగరావు, ‘మా భూమి’ నిర్మాతల్లో ఒకరు ‘‘ప్రపంచ విప్లవాల చరిత్రలోనే ప్రత్యేకస్థానం తెలంగాణ రైతాంగ పోరాటానిది. ఆ నేపథ్యంలో చేసిన ‘మాభూమి’ సినిమా చిత్రీకరణ రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ నాకు నరాలు ఉప్పొంగుతాయి. సినిమాగా అదే నాకు తొలి ప్రయత్నం. భారీ పోరాట సన్నివేశాలున్నప్పటికీ, వీలైనంత పరిమిత బడ్జెట్లో చిత్రీకరించాం. షూటింగ్ చేసిన పల్లెల్లోని గ్రామస్థులు ఎంతో సహకరించారు. వారి కట్టుబొట్టు అంతా తెలుసుకొని చేశాం. ఆ సినిమా చరిత్రలో మిగలడం వెనక ఎంతో మంది శ్రమ ఉంది.’’ - గౌతవ్‌ు ఘోష్, ‘మా భూమి’ చిత్ర దర్శకుడ -
మనతరం మహాదర్శకుడు
- శ్యామ్ బెనగళ్ వందేళ్ల భారతీయ సినిమా ప్రస్థానంలో దిగ్గజాల వంటి దర్శకులు అతి కొద్దిమంది మాత్రమే. వారి జాబితాను రూపొందిస్తే, మొదటి పదిమందిలో కచ్చితంగా చోటు పొందే దర్శకుడు శ్యామ్ బెనగళ్. న్యూవేవ్ సినిమాలో ఆయన ‘భూమిక’ నిరుపమానం. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, ఓంపురి, స్మితా పాటిల్, అమ్రిష్‌పురి, కుల్‌భూషణ్ ఖర్బందా వంటి మేటి నటీ నటులను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ హైదరాబాదీదే. బెనగళ్ రూపొందించిన ‘మంథన్’ చిత్ర నిర్మాణం భారతీయ సినీచరిత్రలోనే ఓ మైలురాయి. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్యామ్ బెనగళ్ విద్యాభ్యాసం ఇక్కడే కొనసాగింది. నిజాం కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో ఎంఏ పూర్తి చేశాక బాంబేలోని లింటాస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. విద్యార్థిగా హైదరాబాద్‌లో ఉన్న కాలంలోనే హైదరాబాద్ ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశారు. యాడ్స్ రంగంలో కొనసాగుతుండగానే తొలిసారిగా 1962లో ‘ఘెర్ బెతా గంగా’ (గంగానది ముంగిట) గుజరాతీ డాక్యుమెంటరీని రూపొందించారు. దాదాపు 900 స్పాన్సర్డ్ డాక్యుమెంటరీలు, యాడ్ ఫిలింలు రూపొందించారు. ప్రతిష్టాత్మకమైన పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో 1966-73 కాలంలో విద్యార్థులకు నటన, దర్శకత్వంలో మెలకువలను బోధించారు. ఈ ఇన్స్టిట్యూట్కు 1980-83, 1989-92లో రెండు పర్యాయాలు చైర్మన్‌గా కూడా సేవలందించారు. హోమీబాబా ఫెలోషిప్‌పై అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని చిల్డ్రన్స్ టెలివిజన్ వర్క్‌షాప్, బోస్టన్ డబ్ల్యూజీబీహెచ్-టీవీలలో 1970-72 మధ్య కాలంలో పనిచేశారు. తొలి చిత్రం నుంచే అవార్డుల పరంపర అమెరికా నుంచి బాంబే తిరిగి వచ్చేశాక, 1973లో ‘అంకుర్’ రూపొందించారు. షబానా అజ్మీ, అనంత నాగ్‌లకు కూడా ఇదే తొలిచిత్రం. జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ఇందులోని నటనకు షబానా అజ్మీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. తొలి చిత్రం నుంచే బెనగళ్‌కు అవార్డు పరంపర మొదలైంది. ఉత్తమ చిత్రాలకు ఏకంగా ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. నిశాంత్ (1976), మంథన్ (1977), భూమిక (1978), జునూన్ (1979), ఆరోహణ్ (1982), త్రికాల్ (1986), సూరజ్‌కా సాథ్వా ఘోడా (1993), మమ్మో (1995), ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ (1996), సర్దారీ బేగం (1997) వంటి చిత్రాలు బెనగళ్‌కు జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి. గుజరాత్ క్షీర విప్లవం నేపథ్యంలో బెనగల్ రూపొందించిన ‘మంథన్’కు అక్కడి పాడి రైతులే నిర్మాతలుగా వ్యవహరించడం అరుదైన చరిత్ర. గుజరాత్ పాడి సహకార సంఘంలోని ఐదులక్షల మంది సభ్యులు రెండేసి రూపాయల చొప్పున ఈ చిత్ర నిర్మాణానికి సమకూర్చారు. విడుదలయ్యాక వారందరూ బళ్లు కట్టించుకుని మరీ థియేటర్లకు వచ్చి చూడటంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. బుల్లితెరపైనా తనదైన ముద్ర బెనగళ్ బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. ‘భారత్ ఏక్ ఖోజ్’ టీవీ సిరీస్ ఆయనను బుల్లితెర ప్రేక్షకులకు చేరువ చేసింది. రైల్వే శాఖ కోసం రూపొందించిన ‘యాత్ర’, భారత రాజ్యాంగంపై రూపొందించిన ‘సంవిధాన్’ వంటి టీవీ సిరీస్‌లు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. సత్యజిత్ రే, మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌లపై రూపొందించిన బయోగ్రాఫికల్ చిత్రాలు విమర్శకుల మన్ననలు పొందాయి. భారత ప్రభుత్వం బెనగళ్‌కు 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. సినీరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2007లో సినీరంగానికే తలమానికమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఇవేకాదు, పలు అంతర్జాతీయ అవార్డులు సైతం ఆయనను వరించాయి. - పన్యాల జగన్నాథదాసు -
15వ ముంబై చలనచిత్రోత్సవం ప్రారంభం
ముంబై: 15వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురువారం రాత్రి నగరంలో ప్రారంభమైంది. లీ డానియల్ రూపొందించిన ‘ది బట్లర్’ అనే చారిత్రక సినిమాను తొలిరోజు ప్రదర్శించారు. చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా తొలుత గ్రీక్-ఫ్రెంచ్ దర్శక నిర్మాత కోస్టా గవ్రస్, నటుడు కమల్‌హాసన్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారాలు అందజేశారు. వైట్‌హౌస్‌లో బట్లర్‌గా పనిచేసిన యూగెన్ అలెన్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా ఈ సినిమా రూపొందింది. యూగెల్ తన జీవితకాలంలో మొత్తం ఎనిమిది అమెరికా దేశ అధ్యక్షులకు బట్లర్‌గా పనిచేశాడు. ఈ సినిమాలో ఫారెస్ట్ విటకర్, సెలబ్రిటీ చాట్ కార్యక్రమానికి అతిథిగా వ్యవహరించిన ఓప్రా విన్ఫ్రే వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎనిమిది రోజులపాటు ఈ చలనచిత్రోత్సవం జరగనుంది. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చలనచిత్రోత్సవాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్యామ్ బెనెగళ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చలనచిత్సోత్సవాల నిర్వహణకు శాశ్వత వేదిక కావాలని, అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా కావాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ఈ వేడుకలకు తమ ప్రభుత్వం కొంతమేర ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. వినోదపు పన్ను మినహాయింపు వివాదాన్ని పరిష్కరించేందుకుగాను చలనచిత్ర రంగానికి చెందినవారితో కలిసి పనిచేస్తుందన్నారు. తనపై అపార ప్రభావం చూపిన గవ్రస్కు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయడం ఆనందం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా గవ్రస్ మాట్లాడుతూ సినీప్రేమికులు తనను ఆదరించడంతో ఎంతో ఉద్విగ్నతకు గురయ్యానన్నారు. అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ తన ఎదుగుదలకు తోడ్పడిన శ్యామ్‌బెనెగళ్, గవ్రాస్, కె.జి.బాలచందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చలనచిత్రోత్సవ వేడుకలు తనవంటివారితో కలసి పనిచేసేందుకు చక్కని వేదికలవుతాయన్నారు. ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా 65 దేశాలకు చెందిన మొత్తం 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ‘బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్’ అనే సినిమా కూడా ఉంది. ఇది స్వలింగ సంపర్కులపై తీసిన చిత్రం. దీంతోపాటు ‘ ది పాస్ట్’ అనే ఇరాన్ చిత్రం, ఆస్ట్రేలియాకు చెందిన ‘ఇన్సైడ్ ల్యూవిన్ డావిస్’, హాలీవుడ్ నటుడు జోసెఫ్ నటించిన ‘డాన్ జాన్’ తదితర సినిమాలు కూడా ప్రదర్శితమవుతాయి. -
అంగడి సరుకు: మండి
‘మండి’ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సరుకు అమ్ముతారు. అయితే తరతరాలుగా ఈ ప్రపంచంలో అమ్ముడుపోయే ఒక మానవ సరుకు ఉంది - స్త్రీ. హైద్రాబాద్‌లో జరిగే ఈ కథలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ‘కోఠా’ (వ్యభిచార కేంద్రం) ఉంటుంది. నగరం పెరిగి పెద్దదయ్యి ఆ ప్రాంతంలో ఒక కొత్త మార్కెట్‌ను కట్టాలనుకోవడంతో ఆ ‘కోఠా’కు ముప్పొచ్చి పడుతుంది. దానిని ఖాళీ చేయాలి. కాని ఆ ఆడవాళ్లు, పొట్టకూటి కోసం పడుపువృత్తి చేసుకునే ఆ నిర్భాగ్యులు, నిరక్షరాస్యులు ఎక్కడికెళ్లాలి? చివరకు వాళ్లను ఊరి అవతలకు తరిమేస్తారు. ఆశ్చర్యం. అక్కడ ఎప్పటితో ఒక బాబాగారి సమాధి బయటపడి అదొక రద్దీ క్షేత్రం ఏర్పడుతుంది. మళ్లీ ఆ స్థలానికి మార్కెట్ వ్యాల్యూ వచ్చింది. దాంతో అక్కణ్ణుంచి వాళ్లను తిరిగి తరిమేయాలి. లేదా ఆ చీమల పుట్టను పాములు ఆక్రమించుకోవాలి. చివరకు అదే జరుగుతుంది. విషాదమైన ఈ కథను వ్యంగ్యంగా చెప్పడం వల్ల అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ చూస్తాం. ప్రసిద్ధ పాకీస్తానీ రచయిత గులామ్ అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే కథానిక ఆధారంగా శ్యామ్ బెనగళ్ తీసిన సినిమా (1983) ఇది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ పోటీ పడి చేసినా షబానా స్థిరత్వం అసామాన్యం అనిపిస్తుంది. ‘మేమున్నాం కాబట్టే ఈ సమాజం ఈ మాత్రమైనా ఉంది’ అంటుంది ఈ సినిమాలో షబానా. ‘మేం తప్పు చేస్తున్నామా? మీ మొగాళ్లను ఇంట్లో కట్టి పెట్టండి చేతనైతే. మమ్మల్నెందుకంటారు?’ అని నిలదీస్తుంది నలుగురినీ. దానికి సమాధానం లేదు. ఉండదు కూడా. మర్యాదకరమైన సాహిత్యం చూడ నిరాకరించే ఈ కురుపు సలపరం తెలియాలంటే యూ ట్యూబ్‌లో Mandi (film) అని కొట్టి చూడండి. -
కమల్‌కి జీవిత సాఫల్య పురస్కారం
విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కు అవార్డులు, రివార్డులు కొత్త కాదు. బాలనటుడిగా, కథానాయకుడిగా, దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా... ఇలా గత 50ఏళ్లల్లో సినిమా రంగానికి చెందిన వివిధ శాఖల్లో కమల్ తన ప్రతిభ నిరూపించుకుని, బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. తాజాగా మరో పురస్కారం చేరనుంది. సినిమా రంగానికి అందించిన విశేష సేవలకుగాను 15వ ముంబయ్ ఫిలిం ఫెస్టివల్లో కమల్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. వచ్చే నెల 17న ముంబయ్‌లో ప్రారంభం కాబోయే ఈ చిత్రోత్సవాలకు ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ అధ్యక్షుడు. కమల్‌లాంటి ప్రతిభాశాలిని సత్కరించనుండటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ కోస్టా గవ్రాస్కి కూడా జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నామని బెనెగల్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్సవాల్లో దాదాపు 65 దేశాల నుంచి వచ్చే 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. -
మళ్లీ బుల్లితెరకు బెనెగల్
ముంబై: అత్యంత పేరుగాంచిన ‘భారత్ ఏక్ ఖోజ్’ షో రూపకర్త, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ‘సంవిధాన్’తో మరోసారి బుల్లితెరకు వస్తున్నాడు. పది భాగాలుగా ప్రదర్శితమవనున్న ఈ ధారావాహిక భారత రాజ్యాంగ రూపకల్పన చుట్టూ తిరగనుంది. ఇందుకోసం 78 ఏళ్ల ఈ దర్శకుడు నగరంలోని ఫిలింసిటీలోనే ఉండిపోయాడు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కోసం 1946-1949 మధ్యకాలంలో జరిగిన చర్చలను ఈ ధారావాహికల్లో ప్రసారం చేయనున్నారు. రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులపాటు భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనపై అప్పట్లో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా శ్యాం మాట్లాడుతూ ‘సంవిధాన్’ను వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. దేశానికి ప్రజాస్వామ్యం దిశగా నడిపించడం కోసం ఎవరెవరు ఏవిధంగా కృషి చేశారనేది ఇందులో వివరిస్తాం’ అని అన్నాడు. ఇదొక ఇతిహాస గాధ. మన జాతి పుట్టుకపైన కథ. ఈ ధారావాహికకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాం. చరిత్ర ఎంతమాత్రం దెబ్బతినకుండా ఉండేవిధంగా చూసుకున్నాం. అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగాం. ఇది కచ్చితంగా విజ్ఞానాత్మకమవుతుంది’ అని అన్నారు. ఈ ధారావాహికలకు అతుల్ తివారీ సహమాటల రచయితగా వ్యవహరించారని తెలిపారు. పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ పాత్రకు సంబంధించిన సంభాషణల రూపకల్పనలో అతుల్ నిమగ్నమయ్యారన్నాడు. ఇక సచిన్ ఖేదార్...భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ గురించి రాస్తున్నారన్నాడు. భారత రాజ్యాంగానికి ఎనలేని ప్రాధాన్యముందన్నాడు. అయితే దానికి ముంబైతోగల అనుబంధం గురించి తెలిసింది స్వల్పమేనన్నాడు. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు సంబంధించి కొలాబాలోని వే ఇన్సైడ్ కేఫ్‌లో ఎంతో సమయం గడిపారని ఆయన వివరించాడు. -
ఏపీఐఐసీ భూములు కోరింది: ధర్మాన
మంత్రిమండలి నిర్ణయం మేరకే కేటాయింపులు: ధర్మాన సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల అభివృద్ధికి భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కోరిందని, మంత్రిమండలి నిర్ణయం మేరకే సంస్థకు భూములు కేటాయించామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు ఏపీఐఐసీ కేటాయించిన భూములకు సంబంధించి బుధవారం ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. డీఐజీ హెచ్.వెంకటేష్ నేతృత్వంలోని అధికారులు సుదీర్ఘంగా దాదాపు ఐదు గంటలపాటు ఆయన్ను విచారించారు. ఉదయం 10.45 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ధర్మాన...విచారణ అనంతరం 3.50కి బయటకు వచ్చారు. ‘‘భూములు కేటాయించాలని ప్రభుత్వరంగ సంస్థ ఏపీఐఐసీ కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలను రెవెన్యూ విభాగం ద్వారా అప్పటి మంత్రివర్గం ముందు ఉంచాం. మంత్రివర్గ నిర్ణయం మేరకే భూములు కేటాయించాం. అప్పటి రెవెన్యూ మంత్రిగా ఈ అంశంపై నాకు తెలిసిన విషయాలు చెప్పాలని కోరారు. ఫైళ్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను వివరించాను. ఈ క్రమంలో తీసుకునే అనేక అంశాల గురించి వారు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాను. నా సమాధానాలతో వారు సంతృప్తి చెందారని భావిస్తున్నా’’ అని ధర్మాన మీడియాతో అన్నారు. మళ్లీ విచారణకు హాజరుకావాలని కోరలేదని, సీబీఐ కోరితే తనకు తెలిసిన విషయాలను చెప్పేందుకు సిద్ధమని అన్నారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూములు సద్వినియోగం అయ్యాయా లేక దుర్వినియోగం అయ్యాయా అన్న అంశాలను పరిశ్రమల శాఖ చూసుకుంటుందని చెప్పారు. ధర్మాన ప్రసాదరావును విచారిస్తున్న సమయంలోనే అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం విచారణకు హాజరైన శామ్యూల్‌ను దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించారు. తమను వేర్వేరుగానే ప్రశ్నించారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ధర్మాన జవాబిచ్చారు. సబితనూ ప్రశ్నించిన సీబీఐ: జగన్ కంపెనీల్లో సిమెంట్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆమె ఇంటికే వెళ్లిన ఇద్దరు అధికారులు 2-3 గంటల మధ్య విచారణ కొనసాగించారు. ఓ సిమెంట్ కంపెనీకి సున్నపురాళ్ల గనుల కేటాయింపునకు సంబంధించి ప్రధానంగా సబితను ప్రశ్నించినట్లు సమాచారం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణకు నోటీసులు జారీ చేసిన సమయంలోనే మాజీ హోం మంత్రి విచారణకు కూడా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కలేదు. సబితా ఇంద్రారెడ్డి హోం శాఖకు ముందు గనుల శాఖను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
బోస్ - ది ఫర్గాటెన్ హీరో...
సినిమాలు కూడా కాస్తో కూస్తో చదువునిస్తాయ్. ముఖ్యంగా మంచి సినిమాలు. సుభాస్ చంద్రబోస్ గురించి మనకు ఏం తెలుసు? జైహింద్ అన్నాడనీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశాడని. కాని ఆయన చేసిన సుదీర్ఘమైన, మొక్కవోని పోరాటాన్నీ, సంఘర్షణనీ, దేశాలు పట్టి ఆ ప్రభుత్వాలనూ ఈ ప్రభుత్వాలనూ ఒప్పించి సైన్యం తయారు చేసి భూమార్గాన ఢిల్లీ వరకూ లాంగ్ మార్చ్ చేసి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భారత్‌ను విముక్తం చేయాలని ఆయన కన్న కల మరొకరు కనలేరు. కన్నా సంకల్పించలేరు. సంకల్పించినా కడదాకా నిలువలేరు. అహింసా మార్గంతోనే స్వరాజ్యం సాధ్యం అనే గాంధీజీ సిద్ధాంతంతో సుభాస్ ఏకీభవించినా ఈ బతిమిలాడే ధోరణికి, చర్చలకి, గాంధీగారి ‘ఒప్పించి సాధిద్దాం’ సిద్ధాంతానికి ఆయన చాలా త్వరగా విసిగిపోయాడు. ఆఫ్టరాల్ 70 వేల మంది బ్రిటిష్ సైన్యం ఉంది భారత్‌లో. మిగిలిన సైన్యంలో ఉన్నదంతా మనవాళ్లే. ఒక యాభై వేల మంది సైన్యాన్ని తయారు చేయగలిగితే చిటికెలో స్వరాజ్యం సాధ్యం అని నమ్మాడాయన. భారత్‌ను విముక్తం చేయడానికి హిట్లర్ వంటి పిశాచాన్ని కావలించుకోవడానికి కూడా వెనుకాడను అని చెప్పిన సుభాస్ అందుకోసమనే హిట్లర్‌తో చర్చలు కూడా చేశాడు. అతడు అంతగా లొంగకపోయే సరికి జపాన్ను సంప్రదించి, ఆ రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో ప్రాణాలకు తెగించి జర్మనీ సబ్‌మెరైన్‌లో సగం దూరం ఆ తర్వాత జపాన్ సబ్‌మెరైన్‌లో సగం దూరం నెల రోజుల పాటు ప్రయాణించి జపాన్ చేరుకుని.... ఇదంతా ఎంత సాహసోపేత ప్రయత్నం.. భరతమాత పట్ల నరనరానా పెల్లుబికే భక్తి. బోస్ కల నెరవేరకపోయి ఉండవచ్చు. కాని కొద్ది కాలం పాటైనా ఆయన బ్రిటిష్‌వారిని గడగడలాడించాడు. ఇక ఈ దేశం మన చేతుల్లో లేదు అని తాము గ్రహించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఒక ముఖ్య కారణం అని ఒక బ్రిటిష్ అధికారి అధికారికంగా ప్రకటించాడు. కాని బోస్ మీద వచ్చిన సాహిత్యం, ఆయన చుట్టూ తీసిన సినిమాలు తక్కువ. ఆయన మరణం మీద ఉన్న మిస్టరీ గురించే చర్చ, ఆర్భాటం తప్ప ఆయన పోరాటం ఎలాటిందో తెలుసుకునే వివరాలు పెద్దగా ప్రచారం కాలేదు. అదంతా చదవడం కన్నా ఒక్క మూడు గంటలు వెచ్చిస్తే సుభాస్ చంద్రబోస్ జీవితాన్ని పోరాటాన్ని అథెంటిక్‌గా తెలుసుకునే అవకాశం ఇస్తుంది ‘బోస్- ది ఫర్గాటెన్ హీరో’ సినిమా. 2004లో సహారా పరివార్ 30 కోట్ల ఖర్చుతో భారీగా తీసిన ఈ సినిమా ఎక్కువ మందికి చేరలేదు. కాని ఈ సినిమా తీయడం ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇది శ్యామ్ బెనగళ్ లాంటి దర్శకులకే సాధ్యం. సాధారణంగా అన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి ఈ సినిమాను చూపించాలి. మన దేశంలో చాలా పనులు జరగనట్టే ఇదీ జరగలేదు. యూ ట్యూబ్‌లో ఉంది. ఈ ఆగస్టు నెలలో అయినా దీనిని Netaji Subhas Chandra Bose: The Forgotten Hero అని కొట్టి చూడండి. అన్నట్టు ఆర్ట్ క్రిటిక్/ థియేటర్ పర్సనాలిటీ షమా జైదీ, రచయిత అతుల్ తివారి ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించారు.