మళ్లీ బుల్లితెరకు బెనెగల్
ముంబై: అత్యంత పేరుగాంచిన ‘భారత్ ఏక్ ఖోజ్’ షో రూపకర్త, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ‘సంవిధాన్’తో మరోసారి బుల్లితెరకు వస్తున్నాడు. పది భాగాలుగా ప్రదర్శితమవనున్న ఈ ధారావాహిక భారత రాజ్యాంగ రూపకల్పన చుట్టూ తిరగనుంది. ఇందుకోసం 78 ఏళ్ల ఈ దర్శకుడు నగరంలోని ఫిలింసిటీలోనే ఉండిపోయాడు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కోసం 1946-1949 మధ్యకాలంలో జరిగిన చర్చలను ఈ ధారావాహికల్లో ప్రసారం చేయనున్నారు. రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులపాటు భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనపై అప్పట్లో చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్యాం మాట్లాడుతూ ‘సంవిధాన్’ను వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. దేశానికి ప్రజాస్వామ్యం దిశగా నడిపించడం కోసం ఎవరెవరు ఏవిధంగా కృషి చేశారనేది ఇందులో వివరిస్తాం’ అని అన్నాడు. ఇదొక ఇతిహాస గాధ. మన జాతి పుట్టుకపైన కథ. ఈ ధారావాహికకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాం. చరిత్ర ఎంతమాత్రం దెబ్బతినకుండా ఉండేవిధంగా చూసుకున్నాం. అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగాం. ఇది కచ్చితంగా విజ్ఞానాత్మకమవుతుంది’ అని అన్నారు.
ఈ ధారావాహికలకు అతుల్ తివారీ సహమాటల రచయితగా వ్యవహరించారని తెలిపారు. పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ పాత్రకు సంబంధించిన సంభాషణల రూపకల్పనలో అతుల్ నిమగ్నమయ్యారన్నాడు. ఇక సచిన్ ఖేదార్...భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ గురించి రాస్తున్నారన్నాడు. భారత రాజ్యాంగానికి ఎనలేని ప్రాధాన్యముందన్నాడు. అయితే దానికి ముంబైతోగల అనుబంధం గురించి తెలిసింది స్వల్పమేనన్నాడు. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు సంబంధించి కొలాబాలోని వే ఇన్‌సైడ్ కేఫ్‌లో ఎంతో సమయం గడిపారని ఆయన వివరించాడు.