
సంస్కారం
‘స్త్రీలపై హింస చేయడం తప్పు’ అని భావించేవారు కూడా సినిమాల్లో హీరోయిన్‌ని హీరో లాగిపెట్టి కొడితే క్లాప్స్ కొడతారు. ఇలా కొట్టే సన్నివేశాలు యువత మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో హీరోలు పెద్దగా ఆలోచించరు– కథకు అవసరమైనా కాకపోయినా. కాని అమోల్ పాలేకర్ మాత్రం నలభై ఏళ్ల క్రితం కొట్టిన చెంపదెబ్బకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ లో తన పుస్తకం ‘వ్యూఫైండర్’ ఆవిష్కరణ సందర్భంగా ఆ ఉదంతాన్ని ప్రస్తావించాడు.
‘నేను ప్రధానంగా చిత్రకారుణ్ణి. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని నా కాబోయే భార్య చిత్ర ఆ రోజుల్లో నాటకాలు వేస్తుంటే తోడుగా రోజూ వెళ్లేవాణ్ణి. అప్పుడు నాటక గురువు సత్యదేవ్ దూబే నాతో ‘నా తర్వాతి నాటకంలో వేషం ఇస్తాను చెయ్. నీలో ఏదో టాలెంట్ ఉందని ఆఫర్ చేయడం లేదు. బాగా ఖాళీగా ఉంటున్నావని ఇస్తున్నాను’ అన్నారు. అలా నాటకాల్లోకి... తర్వాత సినిమాల్లోకీ వెళ్లాను.
నాటకాల్లో చేయడం వల్ల రిహార్సల్స్ చేసి నటించడం నాకలవాటు. అయితే ‘భూమిక’ (1977) సినిమాలో ఒక సన్నివేశంలో తనకు కావలసిన ఎక్స్‌ప్రెషన్ స్మితాపాటిల్ ఇవ్వడం లేదని దర్శకుడు శ్యామ్ బెనగళ్ నన్ను పక్కకు పిలిచి– టేక్‌లో ఆమెను లాగిపెట్టి కొట్టు అన్నారు. అలాగే సార్.. రిహార్సల్‌కు ఆమెను రమ్మన మనండి అన్నాను. ఆమెకు ఈ సంగతి నేను చెప్పలేదు... నువ్వు నిజంగా కొట్టాలి అన్నారు.
నేను షాక్ అయ్యాను. లేదు సార్... అలా చేయను. స్త్రీలపై చెయ్యెత్తడమే తప్పు. యాక్టింగ్ కోసం చేయొచ్చు. కాని నిజంగా చేయమంటే చేయను అన్నాను. ఆయన ఊరుకోలేదు. ‘‘ఇది నా ఆర్డర్. చేస్తావా చేయవా’’ అన్నారు. ఇక నేను ధైర్యం కూడగట్టుకున్నాను. టేక్ మొదలైంది. స్మితాపాటిల్ అద్భుతంగా నటిస్తోంది. సరిగ్గా దర్శకుడు కోరిన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాల్సిన సమయంలో ఆమెను లాగిపెట్టి కొట్టాను. స్మిత స్థాణువయ్యింది. ఆ పని నేను చేయగలనని ఆమె ఊహించలేదు. దాంతో ఎక్స్‌ప్రెషన్స్ ఒకదాని వెంట ఒకటి ఆమె మొఖంలో పరిగెత్తాయి.
మొదట అపనమ్మకం, తర్వాత కోపం, తర్వాత అవమానం, ఆఖరుకు దుఃఖం... డైరెక్టర్ కట్ అనే వరకు నేనూ ఆమె నటిస్తూనే ఉన్నాం. కట్ అన్నాక ఒక్కసారిగా నేను ఏడ్చేశాను. స్మితాను దగ్గరకు తీసుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను. ఆ రోజుల్లో నేను కొత్తనటుణ్ణి. అలా చేశాను. పేరు వచ్చాక అలా చేయలేదు. ఎప్పుడూ చేయను. అసలు స్త్రీల మీద చెయ్యెత్తుతారా ఎవరైనా? ఆమె మీద గొంతెత్తడమే తప్పు. నేనైతే పెద్దగొంతుతో స్త్రీలతో మాట్లాడి కూడా ఎరగను’ అన్నాడు హర్షధ్వానాల మధ్య.
స్త్రీలతో పురుషులు– వారు భర్త/తండ్రి/సోదరుడు స్థానంలో ఉన్నాగాని వ్యవహరించవలసిన తీరు ఏమిటో ఆమోల్ ఉదంతంతో బేరీజు వేసుకుని పరిశీలించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment