బోస్ - ది ఫర్‌గాటెన్ హీరో... | Netaji Subhas Chandra Bose: The Forgotten Hero | Sakshi
Sakshi News home page

బోస్ - ది ఫర్‌గాటెన్ హీరో...

Published Mon, Aug 12 2013 12:11 AM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM

బోస్ - ది ఫర్‌గాటెన్ హీరో... - Sakshi

బోస్ - ది ఫర్‌గాటెన్ హీరో...

సినిమాలు కూడా కాస్తో కూస్తో చదువునిస్తాయ్. ముఖ్యంగా మంచి సినిమాలు. సుభాస్ చంద్రబోస్ గురించి మనకు ఏం తెలుసు? జైహింద్ అన్నాడనీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశాడని. కాని ఆయన చేసిన సుదీర్ఘమైన, మొక్కవోని పోరాటాన్నీ, సంఘర్షణనీ, దేశాలు పట్టి ఆ ప్రభుత్వాలనూ ఈ ప్రభుత్వాలనూ ఒప్పించి సైన్యం తయారు చేసి భూమార్గాన ఢిల్లీ వరకూ లాంగ్ మార్చ్ చేసి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భారత్‌ను విముక్తం చేయాలని ఆయన కన్న కల మరొకరు కనలేరు. కన్నా సంకల్పించలేరు.
 
  సంకల్పించినా కడదాకా నిలువలేరు. అహింసా మార్గంతోనే స్వరాజ్యం సాధ్యం అనే గాంధీజీ సిద్ధాంతంతో సుభాస్ ఏకీభవించినా ఈ బతిమిలాడే ధోరణికి, చర్చలకి, గాంధీగారి ‘ఒప్పించి సాధిద్దాం’ సిద్ధాంతానికి ఆయన చాలా త్వరగా విసిగిపోయాడు. ఆఫ్టరాల్ 70 వేల మంది బ్రిటిష్ సైన్యం ఉంది భారత్‌లో. మిగిలిన సైన్యంలో ఉన్నదంతా మనవాళ్లే. ఒక యాభై వేల మంది సైన్యాన్ని తయారు చేయగలిగితే చిటికెలో స్వరాజ్యం సాధ్యం అని నమ్మాడాయన. భారత్‌ను విముక్తం చేయడానికి హిట్లర్ వంటి పిశాచాన్ని కావలించుకోవడానికి కూడా వెనుకాడను అని చెప్పిన సుభాస్ అందుకోసమనే హిట్లర్‌తో చర్చలు కూడా చేశాడు. అతడు అంతగా లొంగకపోయే సరికి జపాన్‌ను సంప్రదించి, ఆ రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో ప్రాణాలకు తెగించి జర్మనీ సబ్‌మెరైన్‌లో సగం దూరం ఆ తర్వాత జపాన్ సబ్‌మెరైన్‌లో సగం దూరం నెల రోజుల పాటు ప్రయాణించి జపాన్ చేరుకుని.... ఇదంతా ఎంత సాహసోపేత ప్రయత్నం.. భరతమాత పట్ల నరనరానా పెల్లుబికే భక్తి. బోస్ కల నెరవేరకపోయి ఉండవచ్చు. కాని కొద్ది కాలం పాటైనా ఆయన బ్రిటిష్‌వారిని గడగడలాడించాడు. ఇక ఈ దేశం మన చేతుల్లో లేదు అని తాము గ్రహించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఒక ముఖ్య కారణం అని ఒక బ్రిటిష్ అధికారి అధికారికంగా ప్రకటించాడు. కాని బోస్ మీద వచ్చిన సాహిత్యం, ఆయన చుట్టూ తీసిన సినిమాలు తక్కువ. ఆయన మరణం మీద ఉన్న మిస్టరీ గురించే చర్చ, ఆర్భాటం తప్ప ఆయన పోరాటం ఎలాటిందో తెలుసుకునే వివరాలు పెద్దగా ప్రచారం కాలేదు.
 
 అదంతా చదవడం కన్నా ఒక్క మూడు గంటలు వెచ్చిస్తే సుభాస్ చంద్రబోస్ జీవితాన్ని పోరాటాన్ని అథెంటిక్‌గా తెలుసుకునే అవకాశం ఇస్తుంది ‘బోస్- ది ఫర్‌గాటెన్ హీరో’ సినిమా. 2004లో సహారా పరివార్ 30 కోట్ల ఖర్చుతో భారీగా తీసిన ఈ సినిమా ఎక్కువ మందికి చేరలేదు. కాని ఈ సినిమా తీయడం ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇది శ్యామ్ బెనగళ్ లాంటి దర్శకులకే సాధ్యం. సాధారణంగా అన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి ఈ సినిమాను చూపించాలి. మన దేశంలో చాలా పనులు జరగనట్టే ఇదీ జరగలేదు. యూ ట్యూబ్‌లో ఉంది. ఈ ఆగస్టు నెలలో అయినా దీనిని Netaji Subhas Chandra Bose: The Forgotten Hero అని కొట్టి చూడండి. అన్నట్టు ఆర్ట్ క్రిటిక్/ థియేటర్ పర్సనాలిటీ షమా జైదీ, రచయిత అతుల్ తివారి ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement