సత్వం: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు’ | Netaji Subhas Chandra Bose a great patriot of India | Sakshi
Sakshi News home page

సత్వం: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు’

Published Sun, Jan 19 2014 3:53 AM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM

సత్వం: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు’ - Sakshi

సత్వం: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు’

జనవరి 23న  నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి
అహింసా సిద్ధాంతం మీద నేతాజీకి విముఖతకన్నా తనదైన ఒక స్పష్టత ఉంది. తొలి అడుగు కూడా అహింసతో పడాలనేది మహాత్ముడి ఆలోచన. బ్రిటిష్‌వాడి మెడలు వంచేదాకా దాని అవసరం లేదన్నది సుభాషుడి ప్రతిపాదన.
 
 ‘‘భారతదేశ విముక్తి కోసం, 38 కోట్ల నా సాటి భారతీయుల విముక్తి కోసం, దేవుడి పేరుమీద నేను ఈ పవిత్ర ప్రతిన బూనుతున్నాను. సుభాష్ చంద్రబోస్ అనబడే నేను, నా చివరి శ్వాస వరకూ స్వతంత్రం కోసం పవిత్రయుద్ధం చేస్తాను.’’ బ్రిటిష్‌వారితో పోరాటానికి దిగడానికి, తన 30,000 బలగంతో కూడిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను అధికారికంగా ప్రకటిస్తూ నేతాజీ తనను తాను అంకితం చేసుకున్న తీరు ఇది. ప్రాణాలు అర్పిస్తానని మాటవరసకు చేసిన ఉత్తుత్తి ప్రతిజ్ఞ కాదది. ఉపనిషత్తుల్లో చెప్పిన త్యాగగుణాన్ని నేతాజీ తన రక్తంలో ఇంకించుకున్నాడు. అందుకే ప్రాపంచిక విలాసాలను సమకూర్చగలిగే సివిల్ సర్వీసు ఉద్యోగాన్ని ఒక మహోన్నత లక్ష్యం కోసం అట్టే వదిలేయగలిగాడు. 11 సార్లు జైలుకు పోయివచ్చాడు. అంతిమగమ్యం చేరేలోగా మధ్యమార్గంలో ప్రాణం పోయినా ఫర్వాలేదన్నది తనకు తాను ఇచ్చుకున్న తర్ఫీదు.
 
 నేతాజీ కార్యవాది. ఉడుకు నెత్తురు. అందుకే, నూరేళ్ల చరిత్ర ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో... ‘‘చూడు, అధికులదే ఎప్పుడూ అధికారం. భారతీయుల కన్నా బ్రిటిష్‌వాళ్లు నైతికంగా అధికులు. ఇది వాస్తవం. దీన్ని అంగీకరించకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ అని ‘పేలిన’ ప్రొఫెసర్ ఆటెన్ మీద ‘చేయిచేసుకున్న’ బీఏ ఫస్టియర్ విద్యార్థుల్లో మొదటగా సుభాషుడి పేరే వినిపించింది.
 
 గాంధీజీ ప్రవచించే అహింసా సిద్ధాంతం మీద నేతాజీకి విముఖతకన్నా తనదైన ఒక స్పష్టత ఉంది. తొలి అడుగు కూడా అహింసతో పడాలనేది మహాత్ముడి ఆలోచన. బ్రిటిష్‌వాడి మెడలు వంచేదాకా దాని అవసరం లేదన్నది సుభాషుడి ప్రతిపాదన. ఆ విభేదం వల్లే, ఆయన ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. స్వాతంత్య్రం అనేది బ్రిటిష్ వారు తాంబూలంలో పెట్టి సమర్పించే కానుక కాదన్నాడు. దశలవారీ స్వాతంత్య్రాన్ని నిరాకరించాడు. ‘పూర్ణ స్వరాజ్’ మాత్రమే అంగీకారమన్నాడు. ‘నాకు రక్తాన్ని ఇవ్వండి; నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అని పలికాడు.  యుద్ధక్షేత్రంలో వ్యూహాలు పన్నడమే కాదు, స్వాతంత్య్రం సిద్ధించాక ఆచరించాల్సిన కార్యాచరణ నిమిత్తం ప్రణాళికలు కూడా లిఖించాడు.
 
 భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదు. కులాంతర వివాహాలు జరగాలి. గాంధీ అయిష్టత కనబరిచినా నెహ్రూ సంపూర్ణ మద్దతునిచ్చే భారీ పరిశ్రమల స్థాపన జరగాలి. దేశాన్ని కాపాడుకోగలిగే ఆయుధ సంపత్తి మనమే తయారుచేసుకోవాలి. ఉద్యోగి జీవితం యజమాని దయమీద ఆధారపడి ఉండకూడదు. కార్మికులను యధేచ్చగా వీధుల్లోకి తోసేసి ఆకలికి మాడ్చడం కుదరని పని. అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అసమానతలు తొలగిపోవాలంటే, రష్యా, టర్కీల్లోలాగా ‘సోషలిస్ట్ అథారిటేరియనిజం’ ఉండాలి. అలాగని, ప్రభుత్వం యజమాని, ప్రజలు బానిసలు కావడానికి వ్యతిరేకం. ఇవీ నేతాజీ భావనలు.


 భగవద్గీతను గాఢంగా అభిమానించినప్పటికీ మతం అనేది నేతాజీకి వ్యక్తిగత వ్యవహారమే. దానికి రాజ్యంతో సంబంధం లేదు. దేశమాత సంకెళ్లను తెంచడానికి పనికొచ్చే ప్రతివ్యక్తీ ఆయనకు ఆత్మీయుడే. వాళ్లు మసీదులో ప్రార్థిస్తారని తప్ప ఇంకేవిధంగానూ ముస్లింలు భిన్నమని నాకెన్నడూ తోచలేదన్నాడు. అందుకే ఆయన సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి. తుపాకీ కాల్చడానికి కూడా వెనుకంజ వేయకూడదనేవాడు.
 
  ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ను ఏర్పాటుచేసి యువతులనూ సైన్యంలో భర్తీ చేసుకున్నాడు. అమెరికా, ఇటలీ, చెకొస్లొవేకియా, ఐర్లాండ్ దేశాల స్వాతంత్య్ర పోరాటాల తీరును పరిశీలించాడు. ఎన్ని విమర్శలు వచ్చినా జర్మనీ, జపాన్, ఇటలీ దేశాల సాయం కోరాడు. ముల్లును తీయడానికి మరో ముల్లును ఆయుధంగా చేసుకోవాలనుకున్నాడు. స్వాతంత్య్రం లభించాక, ఢిల్లీ గద్దె మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాక, అప్పుడు, ‘గురుదేవా! ఇప్పుడిక దేశానికి నీ అహింసే కావాలి’ అని ఎలుగెత్తి చాటాలనుకున్నాడు. పవిత్ర గంగాజలంతో హింసను శుభ్రపరచాలనుకున్నాడు. కానీ, ఆకాశమంతటి నాయకుణ్ని ఆ ఆకాశం విమానం సహా మాయం చేసింది. కాయం దొరక్కపోయినా ఆ తేజం అంతటా వ్యాపించింది. అది ఎవరినైనా కదిలించింది. గాంధీజీ ఆయన్ని ఇలా కొనియాడారు: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement